logo

డీలర్ల దురాశ.. కర్షకుల ప్రయాస!

మునిపల్లి మండలం వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తండ్రి ఈనెల 6న ఒక డీలరు వద్ద పత్తి  విత్తన ప్యాకెట్లు కొన్నాడు. గరిష్ఠ చిల్లర ధర కంటే రూ.600 ఎక్కువ తీసుకున్నారు.

Published : 07 Jun 2023 01:34 IST

పత్తి విత్తనాలు కావాలంటే అడిగినంత ఇవ్వాల్సిందే
ఈనాడు, మెదక్‌:

గజ్వేల్‌ మండలం రిమ్మనగూడలో పత్తి విత్తనాలు నాటుతున్న మహిళలు

* మునిపల్లి మండలం వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తండ్రి ఈనెల 6న ఒక డీలరు వద్ద పత్తి  విత్తన ప్యాకెట్లు కొన్నాడు. గరిష్ఠ చిల్లర ధర కంటే రూ.600 ఎక్కువ తీసుకున్నారు.

* ‘మేం ఎక్కువ ధర చెల్లించే కొన్నాం. కానీ డీలరు గరిష్ఠ చిల్లర ధరనే రసీదులో రాసిచ్చారు. ఇదేంటని అడిగితే.. విత్తనాలు లేవు.. ఇదే ధర ఇష్టం లేకుంటే తీసుకోవద్దన్నారని సదాశివపేట మండలానికి చెందిన ఓ రైతు వాపోయారు.

రైతుల అవసరాన్ని కొందరు డీలర్లు అవకాశంగా మలచుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అందినకాడికి దోచుకుంటున్నారు. పత్తి సాగు చేసే వారి నుంచి కొన్ని కంపెనీల విత్తనాలకు డిమాండ్‌ అధికంగా ఉంటోంది. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచేస్తున్నారు. ఎవరికి చెప్పినా ప్రయోజనం ఉండదనే నిస్సహాయతో అన్నదాతలు వారు చెప్పిన ధరకే పత్తి విత్తన ప్యాకెట్లు కొని తెచ్చుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో పత్తి సాగు అధికంగా ఉండే సదాశివపేట మండలంతో పాటు అందోలు నియోజకవర్గం, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ నియోజకవర్గంలో పరిశీలించగా ఇదే విషయం తేటతెల్లమైంది. ప్రస్తుతం పత్తి సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా తొలిగా విత్తనాలను తెచ్చి పెట్టుకుంటున్నారు. గత రెండు మూడేళ్లలో మంచి దిగుబడులనిచ్చిన రకాలు కావాలని డీలర్లను అడుగుతున్నారు. ఎక్కువ మంది అవే విత్తనాలు కావాలని కోరుతుండటంతో వ్యాపారుల్లో దురాశ మొదలయింది. రైతులు అడిగిన విత్తనాలు కొరత ఉన్నాయని చెబుతూ అదనపు దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక కంపెనీకి సంబంధించిన విత్తన ప్యాకెట్‌పై ధర రూ.850 ఉంటే, రూ.1,400కు అమ్ముతున్నారు. రూ.900పైచిలుకు ధర ఉన్న మరో విత్తన కంపెనీ ప్యాకెట్‌ కావాలంటే దాదాపు రూ.500 ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో కొన్ని లక్షల విత్తన ప్యాకెట్లు రైతులు కొనుగోలు చేస్తారు. ఉన్న కాస్త సమయంలోనే భారీగా వెనకేసుకునే లక్ష్యంతో డీలర్లు దందాకు తెరలేపారు.

ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదని

డీలర్ల తీరుపై అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించి చర్యలు తీసుకుంటారనే నమ్మకం లేదని రైతులు పేర్కొంటున్నారు. అందుకే మంచి దిగుబడి ఇస్తాయనుకున్న పత్తి విత్తనాలు ఎక్కువ ధర పెట్టి కొనకతప్పడం లేదంటున్నారు. ప్రతి డీలరు తప్పనిసరిగా తన వద్ద ఉన్న స్టాకు వివరాలు, ధరల సమాచారాన్ని బహిరంగంగా ప్రదర్శించాలి. దాని ప్రకారమే అమ్మకాలు జరపాలి. ఈ విషయంలో ఉల్లంఘన జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో సాగుతున్న ఈ దందాపై జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు దృష్టికి తీసుకెళ్లగా... ప్రత్యేకంగా తనిఖీ చేసి ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటామన్నారు. గరిష్ట చిల్లర ధరను మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఇవ్వొద్దని ఆయన రైతులకు సూచిస్తున్నారు.


చర్యలు ఉండవనే ధీమాతోనే దోపిడీ

టి.పృథ్వీరాజ్‌, అధ్యక్షుడు, మంజీరా రైతు సమాఖ్య

వానానాలం సీజన్‌ మొదలవగానే డీలర్లకు దోపిడీకి తెరలేపారు. నేను మూడు దుకాణాలకు వెళ్లి పరిశీలించా. కొందరు రైతులనూ పంపించా. విత్తన ప్యాకెట్‌ మీద ఉన్న ధర కంటే కనీసం రూ.600 ఎక్కువగా తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఇది రూ.1000కి పైగానే ఉంటోంది. అధికారుల పర్యవేక్షణ అసలే లేదు. అందుకే డీలర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పక్కాగా పాటించేలా చూసి రైతులకు ఆర్థికభారం తప్పేలా చూడాలని మేం ఉన్నతాధికారులను కోరుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని