logo

జీవన నైపుణ్యాలు.. భవితకు వారధులు

కౌమారదశలో విద్యార్థినులకు శారీరకం, మానసిక భావోద్వేగాలు చుట్టుముడుతాయి. ఈ దశలో సామాజికంగానూ సామర్థ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.

Published : 08 Jun 2023 02:04 IST

కస్తూర్బా పాఠశాలల్లో ప్రత్యేక కరదీపికల పాఠాలు

కరదీపికలు

న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ: కౌమారదశలో విద్యార్థినులకు శారీరకం, మానసిక భావోద్వేగాలు చుట్టుముడుతాయి. ఈ దశలో సామాజికంగానూ సామర్థ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. జీవన నైపుణ్యాలు నేర్పితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినట్లే అవుతుంది. ఆటుపోట్లను అధిగమించేందుకు, ఒత్తిళ్లను తట్టుకునేందుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రత్యేక బోధనకు శ్రీకారం చుడుతున్నారు. వీటికి సంబంధించిన కరదీపికలు విద్యాసంస్థలకు చేరాయి.

6, 7 8 తరగతులకు

మొదట ఈ కార్యక్రమాన్ని 6, 7, 8 తరగతులు చదివే విద్యార్థినులకు అమలు చేయనున్నారు. భవిష్యత్తు పరిణామాలు అంచనా వేయడం సహచరులు, ఉపాధ్యాయులు, కుటుంబంతో అనుబంధాలపై బోధన ఉంటుంది. సాధారణంగా కేజీబీవీల్లో చదివే వారి కుటుంబాలు ఆర్థికంగా వెనుకబాటుతో ఉంటాయి. భవిష్యత్తులో ఆసక్తి ఉన్న రంగంలో నిలదొక్కుకొని నైపుణ్యాలు పెంపొందించుకునేలా అమలు చేస్తారు.

వారానికి మూడు

నూతన విద్యా సంవత్సరంలో కేజీబీవీలో వారానికి మూడు తరగతుల్లో పాఠాలు బోధించేందుకు ప్రణాళికలు రూపొందించారు. తరగతుల వారీగా ప్రత్యేక పుస్తకాలను సమగ్ర శిక్షా అధికారులు పాఠశాలలకు చేర్చారు. ఈ బోధన అమలుకు ప్రత్యేక కరదీపికలను పంపిణీ చేస్తున్నారు. త్వరలో విద్యాశాఖ అధికారులు కేజీబీవీ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.

వేధింపులపై అప్రమత్తం

చాలా మంది బాలికలు లైంగిక, ఇతర వేధింపులతో పాటు హింసను ఎదుర్కొంటున్నారు. లైంగిక హింస అంటే ఏంటి? దాడులు ఎలా జరుగుతున్నాయి? వీటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు? పరిచయం లేని వారితో ఉండాల్సిన తీరు, బయటకు ఒంటరిగా వెళ్లాల్సి వస్తే ప్రవర్తించాల్సిన అంశాలపై వివరిస్తారు.


సానుకూలత, విలువల బలోపేతమే ధ్యేయం
ముక్తేశ్వరి, జీసీడీవో, సిద్దిపేట

విద్యార్థినుల్లో ప్రతికూల, ప్రమాదకర ప్రవర్తనల్ని నివారించేందుకు ప్రత్యేక బోధన ప్రణాళిక రూపొందించారు. సంపాదించిన జ్ఞానంతో, సానుకూల వైఖరి, విలువలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అంశాలు ఉంటాయి. వారి పరిపూర్ణ జీవనానికి దోహదం చేస్తుందని భావిస్తున్నాం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని