logo

సంకల్పం.. సాకారం

సాధించాలనే సంకల్పం ముందు సమస్యలు ఎన్ని ఉన్నా తలవంచాల్సిందే. నిరంతరం నచ్చిన రంగంలో రాణించాలనే తపనతో పాటు, నిత్య సాధన పలువురు క్రీడాకారులను మెరికలుగా తీర్చిదిద్దుతోంది.

Published : 08 Jun 2023 02:04 IST

రాష్ట్ర స్థాయిలో రాణించిన అథ్లెట్లు

న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌: సాధించాలనే సంకల్పం ముందు సమస్యలు ఎన్ని ఉన్నా తలవంచాల్సిందే. నిరంతరం నచ్చిన రంగంలో రాణించాలనే తపనతో పాటు, నిత్య సాధన పలువురు క్రీడాకారులను మెరికలుగా తీర్చిదిద్దుతోంది. వేదిక ఏదైనా గెలుపే లక్ష్యంగా జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన నలుగురు అథ్లెట్లు ప్రతిభ చాటారు. గ్రామీణ నేపథ్యం కలిగిన ఈ క్రీడాకారులు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా యువ క్రీడాకారులపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..


దేశానికి సేవ చేయాలి: ఎలుపుల కల్యాణి

ఆరవ తరగతి నుంచే పరుగు సాధన చేస్తూ శిక్షకులు ఎవరూ లేకుండా స్వయంగా అథ్లెటిక్స్‌లో రాణిస్తోంది సిద్దిపేట అర్బన్‌ మండలం గాడిచెర్లపల్లికి చెందిన ఎలుపుల కల్యాణి. 2021లో భువనగిరిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రాస్‌కంట్రీ పోటీల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచి బంగారు పతకం సాధించింది. 2022లో కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ బంగారు పతకం పొందింది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పదివేల మీటర్ల పరుగులో రజత పతకం సాధించింది. తన శిక్షణలో కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పలువురు సైన్యానికి ఎంపికయ్యారు. వ్యాయామోపాధ్యాయుడు వెంకటస్వామిగౌడ్‌ ప్రోత్సాహంతో ముందుకు సాగుతోంది. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయటమే తన లక్ష్యమంటోంది కల్యాణి.


ఒలింపిక్స్‌లో పోటీ పడతా: గోగర్ల అభిషేక్‌

పేదింటి గోగర్ల అభిషేక్‌ తల్లిదండ్రులు సదానందం, వనిత ఇద్దరు వ్యవసాయాదారులు. అభిషేక్‌ గతంలో రాష్ట్రస్థాయిలో పదివేల మీటర్ల పరుగులో మూడు స్వర్ణ, రెండు రజత పతకాలు సాధించాడు. తాజాగాకాంస్య పతకం సాధించాడు. సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటస్వామిగౌడ్‌, శిక్షకుడు కృష్ణకుమార్‌ ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నాడు. ఒలింపిక్స్‌లోనూపోటీ పడతానని ధీమా వ్యక్తం చేశాడు.


పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యం: తలారి కల్పన

రాయపోల్‌కుచెందిన తలారి కల్పన చిన్ననాటి నుంచే పరుగులో దిట్ట. తల్లి వినోద వ్యవసాయం చేస్తూ ఒక్కగానొక్క కూతురు కల్పనను చదివిస్తున్నారు.అథ్లెటిక్స్‌పై దృష్టి సారించి పరుగుపందెంపై శిక్షణ తీసుకుంటుంది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 1500 మీటర్ల పరుగులో కాంస్య పతకంతో మెరిసింది. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్‌ పరీక్షలో సైతం అర్హత సాధించింది.


జాతీయ స్థాయిలో రాణిస్తా: తొడంగి అశ్విని

రాయపోలు మండలం తిమ్మక్కపల్లికి చెందిన తొడంగి అశ్విని ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో హైజంప్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. అమ్మా నాన్న అంజయ్య, అరుణ ఇద్దరు రైతులే. అశ్విని పదో తరగతి దుబ్బాక ఏంజేపీలో చదివింది. వర్గల్‌ ఎంజేపీలో ఇంటర్‌ పూర్తిచేసిన అశ్విని జాతీయస్థాయి హాకీలో పతకం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.


చలాకీ బాలిక

మిరుదొడ్డి: దుబ్బాక మున్సిపాటీ పరిధి లచ్చపేటకు చెందిన బాలకిషన్‌ అరుణ కుమార్తె వర్షిణి పరుగుల రాణిగా పేరు తెచ్చుకుంది. మిరుదొడ్డి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాటు తల్లిదండ్రుల సాయంతో నిత్యం వ్యాయామం చేస్తోంది. ప్రతి రోజు తండ్రి బాలకిషన్‌తో కలిసి ఐదు కి.మీ. పరుగును సాధన చేసింది. ఇటీవల సిద్దిపేట సీపీ శ్వేత ఆదేశాల మేరకు రన్నర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి ఠాణాలో ఐదు కి.మీ. పరుగు పందేలు నిర్వహించారు. బాలిక వర్షిణి మిరుదొడ్డి, దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్‌ పలు చోట్ల ఐదు కి.మీ. పరుగును పూర్తి చేసి పోలీసు అధికారుల మెప్పు పొందింది. చిన్నారికి మెరుగైన శిక్షణతో పాటు సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తే భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని శిక్షకులు పేర్కొంటున్నారు. రన్నర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాపురెడ్డి బాలిక పరుగుకు కావాల్సిన బూట్లతో పాటు వసతుల కల్పనకు సాయం చేస్తున్నారు. మిరుదొడ్డి గ్రామానికి చెందిన నాగేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి రూ.5 వేల నగదు అందజేసి ప్రోత్సహించారు.

పోటీదార్లతో పరుగెడుతున్న బాలిక

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని