పంట కాలం ముందుకు.. ప్రయోజనాలు అనేకం
సాగు కాలాన్ని ఒక నెల ముందుకు జరపడం ద్వారా రైతులకు మేలు చేకూరుతుందని, వడగళ్ల వాన, ప్రకృతి విపత్తుల ముప్పు తప్పుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కొర్రపాటి శివప్రసాద్ అన్నారు.
విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
‘న్యూస్‌టుడే’తో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ ముఖాముఖి
న్యూస్‌టుడే, సిద్దిపేట: సాగు కాలాన్ని ఒక నెల ముందుకు జరపడం ద్వారా రైతులకు మేలు చేకూరుతుందని, వడగళ్ల వాన, ప్రకృతి విపత్తుల ముప్పు తప్పుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కొర్రపాటి శివప్రసాద్ అన్నారు. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించే కంపెనీలు, డీలర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఖరీఫ్ (వానాకాలం) సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించగా పలు అంశాలపై స్పందించారు. రైతులు పూర్తిగా వరిధాన్యం సాగుపైనే ఆధారపడవద్దని, ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని కోరారు.
న్యూస్‌టుడే: ఈ ఖరీఫ్‌లో సాగు అంచనా..?
వ్యవసాయ అధికారి: 5.47 లక్షల ఎకరాల్లో సాగు అంచనాలు ఉన్నాయి. అందులో వరిధాన్యం 3 లక్షల ఎకరాలు, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 40 వేల ఎకరాల్లో కందులు, 60 వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఇతరత్రా సాగు చేస్తారు. ఆయిల్‌పామ్ గడిచిన రెండేళ్లలో 8550 ఎకరాల్లో చేపట్టారు.1380 ఎకరాలకు సంబంధించి రైతులు డీడీలు చెల్లించారు.
న్యూ: పంట కాలం ముందుకు జరిపేందుకు తీసుకుంటున్న చర్యలు?
వ్య.అ.: రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. గతంలో సెప్టెంబరు వరకు నారు పోసే పరిస్థితి. ఇప్పుడలా కాదు.. జులై 15వ తేదీలోపు నార్లు పోయడం పూర్తవ్వాలి. ఆగస్టు మొదటి వారంలో నాట్లు పూర్తి కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. జిల్లాలో 127 రైతు వేదికల ద్వారా ప్రతి మంగళ, శుక్రవారాల్లో అవగాహన కల్పిస్తున్నాం. కనీసం 6 సెం.మీ. మేర వర్షం పడితే పత్తి విత్తాల్సి ఉంటుంది.
న్యూ: వెదసాగు, విత్తన ఉత్పత్తిపై ప్రణాళికలు ఏమిటి..?
వ్య.అ.: గత ఏడాది 23 వేల ఎకరాల్లో వరి వెద సాగు జరిగింది. ఈ సారి 50 వేల ఎకరాలు నిర్దేశించుకున్నాం. ఈ విధానంలో అన్నదాతలకు విత్తనాలు తక్కువగా అవసరమవుతాయి. లెవలింగ్ విధానంలో విత్తనాలు చల్లాలి. ఎగుడుదిగుడుగా ఉండొద్దు. వెద చేసిన తరువాత వారం రోజుల్లో గడ్డి మందు కచ్చితంగా చల్లాలి. విత్తన సాగుపై దృష్టిసారించాం. గతేడాది 19 వేల ఎకరాల్లో వరిధాన్యం, 2 వేల ఎకారల్లో హైబ్రిడ్ వరి, 550 ఎకరాల్లో శెనగలు విత్తన సాగు చేశారు. 3 వేల ఎకరాల్లో సేంద్రియ సాగు జరుగుతోంది.
న్యూ: పచ్చిరొట్ట, ఇతర ఎరువుల వినియోగం ఎలా ఉంది?
వ్య.అ.: జనుము, జీలుగ విత్తనాలు 6 వేల క్వింటాళ్లు అవసరమవుతాయి. ఇప్పటికే 3,350 క్వింటాళ్లు విక్రయమయ్యాయి. పచ్చిరొట్టతో భూమికి కావాల్సిన కర్బన శాతం పెరుగుతుంది. తద్వారా దిగుబడి అధికమవుతుంది. 16 వేల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉంది. బఫర్ స్టాక్ కింద మార్క్‌ఫెడ్ పరిధిలో 440 మెట్రిక్ టన్నుల యూరియా, 500 మెట్రిక్ టన్నుల కాంప్లెక్సు, 200 మెట్రిక్ టన్నుల డీఏపీ ఉంది. డీలర్ల వద్ద 12 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్సు, 3 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ ఉంది. కావాల్సిన విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి.
న్యూ: పంట నష్ట పరిహారం ఎప్పుడిస్తారు?
వ్య.అ.: మొత్తంగా 51,126 వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదించాం. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలకు సంబంధించి 1525 మంది రైతులకు రూ.1.14 కోట్లు మంజూరు అవగా రెండు రోజుల్లో ఖాతాల్లో జమవనున్నాయి.
న్యూ: నాసిరకం విత్తనాల కట్టడి ఎలా చేయబోతున్నారు?
వ్య.అ.: జిల్లాలో ఆరు బృందాలు (టాస్క్‌ఫోర్సు) తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో బృందంలో ఏడీ, పోలీసు అధికారి, విత్తన నాణ్యతను ధ్రువీకరించే వ్యక్తి ఉంటారు. జిల్లాస్థాయిలో ఒక బృందం పని చేస్తుంది. నాసిరకం విత్తనాలు విక్రయించినట్లుగా దృష్టికి వస్తే డయల్ - 100 లేదా పోలీసు కమిషనరేట్ వాట్సాప్ నం. 87126 67100 సమాచారం చేరవేయొచ్చు. ఇప్పటికే రూ.4.50 కోట్ల విలువైన పత్తి విత్తనాలు నిలుపుదల చేశాం. నిర్ణీత ధరలకు మించి విక్రయించవద్దు. అవసరమైతే పీడీ చట్టాన్ని ప్రయోగిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల
-
Chandrababu Arrest: ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్: బాలకృష్ణ
-
Jammu Kashmir: కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి
-
Pawan Kalyan: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్ కల్యాణ్