logo

భూములిచ్చేవారు ఆందోళన చెందొద్దు

సాగునీటి కాలువలు, ఇతరత్రా నిర్మాణాల కోసం భూములిచ్చే రైతులకు మెరుగైన పరిహారమిచ్చే బాధ్యత తనదేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వారికి ఏ కష్టం రానీయకుండా కడుపులో పెట్టి దాచుకుంటామన్నారు.

Published : 08 Jun 2023 02:12 IST

మెరుగైన పరిహారమిప్పించే బాధ్యత తీసుకుంటా..
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

సాగునీటి రంగం అభివృద్ధిపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హరీశ్‌రావు. చిత్రంలో రఘోత్తంరెడ్డి, క్రాంతికిరణ్‌, బీబీపాటిల్‌, మంజుశ్రీ తదితరులు

ఈనాడు, సంగారెడ్డి, న్యూస్‌టుడే, మునిపల్లి: సాగునీటి కాలువలు, ఇతరత్రా నిర్మాణాల కోసం భూములిచ్చే రైతులకు మెరుగైన పరిహారమిచ్చే బాధ్యత తనదేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వారికి ఏ కష్టం రానీయకుండా కడుపులో పెట్టి దాచుకుంటామన్నారు. రెండుశాతం భూములు పోయినా 98శాతానికి సాగునీరు అందుతుందన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలను పూర్తి చేసి సంగారెడ్డి జిల్లాను మరో కోనసీమగా తీర్చిదిద్దుతామన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన సాగునీటి దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సంగమేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న పంప్‌హౌజ్‌ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. మునిపల్లి మండలం చిన్నచెల్మడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, కలెక్టర్‌ శరత్‌, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, చేనేత అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, డీసీఎంఎస్‌ అధ్యక్షుడు మల్కాపురం శివకుమార్‌, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నరహరిరెడ్డి, మునిపల్లి జడ్పీటీసీ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ తాగు నీరిస్తున్నాం..

భూమిపూజ చేసిన అనంతరం అక్కడే సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఒకప్పుడు ఈ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం ఎంతో గోసపడే వారన్నారు. నేడు ఆ బాధలు తొలగిపోయాయన్నారు. ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఒకప్పుడు సింగూరు అంటే హైదరాబాద్‌ వారిదేనన్నట్లు పరిస్థితి ఉండేదన్నారు. సీఎం కేసీఆర్‌ సింగూరు జలాలను ఉమ్మడి మెదక్‌ జిల్లా వారికి అందేలా ప్రత్యేక చొరవ చూపారన్నారు. గతంలో ఇక్కడ ఉపముఖ్యమంత్రి సహా పెద్ద పెద్ద మంత్రులున్నా ఏనాడూ సింగూరు జలాలు స్థానికులకు రావాలని పోరాటం చేయలేదన్నారు. ఈ నీళ్లను హైదరాబాద్‌కు అప్పజెప్పి జిల్లాలోని సాగు భూములను బీళ్లుగా మార్చారన్నారు. సీఎం కేసీఆర్‌ ఎంతో దూరదృష్టితో ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేశారన్నారు. అందోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ఇటీవలే రూ.100 కోట్లు మంజూరు చేశామన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రసాగునీటి రంగంలో జరిగిన మార్పులను వివరించేలా రూపొందించిన పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా చిన్నచెల్మడ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. గ్రామంలో నూతనంగా అందుబాటులోకి తెచ్చి క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. సర్పంచి విజయ్‌భాస్కర్‌తో పాటు స్థానిక నేతలు మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికారు.

ధరిణితో భూసమస్యల పరిష్కారం

సదాశివపేట: భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తీసుకొచ్చిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సదాశివపేట తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆయన సందర్శించి ధరణి పోర్టల్‌ పనితీరును పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ధరణి సేవల తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో రిజిస్ట్రేషన్‌ కోసం అనేక సమస్యలు ఉండేవని ధరణి వల్ల తొలగిపోయాయన్నారు. అనంతరం పలువురు కర్షకులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందించారు. పట్టణానికి చెందిన గిరిజారాణికి మెరుగైన వైద్య చికిత్సకోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.రెండు లక్షలకు సంబంధించిన ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చింతా ప్రభాకర్‌, జిల్లా పాలనాధికారి డాక్టర్‌ శరత్‌, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, తహసీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని