logo

‘భూగర్భం’.. ఆగమాగం

ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్ల భారీ అంచనా వ్యయంతో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియాలో నిర్మించిన భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ (అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ) లోపభూయిష్టంగా మారింది.

Updated : 09 Jun 2023 05:45 IST

మురుగు పారుదల గొట్టాల నిర్మాణాల్లో తలెత్తుతున్న లోపాలు

యంత్రం ద్వారా శుభ్రం చేస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే, గజ్వేల్‌: ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్ల భారీ అంచనా వ్యయంతో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియాలో నిర్మించిన భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ (అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ) లోపభూయిష్టంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారు ఇష్టారీతిన చేపట్టిన నిర్మాణాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పనులు ముగిసిన చోట నెలలు గడువక ముందే లోపాలు తలెత్తుతున్నాయి. మురుగు గొట్టాలు స్తంభించిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. మ్యాన్‌హోళ్లు నిండిపోయి మురుగు నీరంతా రోడ్లపై పారుతూ దుర్వాసన వస్తోంది.

పనులు తాత్కాలికమే

రెండు నెలల కిందట 14వ వార్డులో పైపులైన్లలో స్తంభించటంతో యంత్రాల ద్వారా నీటి ఒత్తిడిని ప్రయోగించి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. ప్రస్తుతం ప్రజ్ఞాపూర్‌లోని బాలుర ప్రభుత్వ పాఠశాల ముందు రోడ్డుపై మ్యాన్‌హోళ్లు నిండిపోయి మురుగు పారుతుంది. మిగతా వార్డుల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. రోడ్డుపై ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో వెళ్లలేక పోతున్నారు. చాలా మ్యాన్‌హోళ్లను సరిగా నిర్మించలేదు. మురుగు సరిగా వెళ్లటం లేదు. అధికారులు స్పందించి తగు పరిష్కార చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


130 కి.మీ. పూర్తి

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియా  పరిధిలో మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండర్‌ డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. మొత్తం 20 వార్డుల పరిధిలో   మొత్తం 138 కిలోమీటర్ల మేర గొట్టాల నిర్మాణం  చేపట్టాలని నిర్ణయించారు. 2020 జూన్‌లో పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 5 వేలకుపైగా మ్యాన్‌హోళ్లు, 4వేల వరకు చిన్న మ్యాన్‌హోళ్లుతో సహా 130 కిలోమీటర్ల మేర పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కాలువలు తవ్వి గొట్టాలు బిగించే సమయంలో ఎత్తుపల్లాల కొలత సరిగా వేయకుండానే నిర్మాణాలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కాలనీ ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైనా అధికారులు, గుత్తేదారు  ప్రజల ఆవేదనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండానే నిర్మాణాలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 14వ వార్డులో ఎయిర్‌టెల్‌ కాలనీలో మంచినీళ్ల పైపులపై నుంచే తక్కువ లోతు గుంతలు తీసి మ్యాన్‌హోళ్లు నిర్మిస్తున్నారని స్థానికులు గతంలో ఆందోళన చేపట్టారు. ప్రజ్ఞాపూర్‌,గజ్వేల్‌ బీటీ రోడ్లపై నిర్మించిన పైప్‌లైన్లు, మ్యాన్‌హోళ్లను రెండేసి సార్లు సవరించినా సమస్య తీరకపోవటంతో వాటిని అలాగే వదిలిపెట్టారు.


సమస్య తలెత్తకుండా చూస్తాం

ఎన్సీ రాజమౌళి, బల్దియా ఛైర్మన్‌

మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం బల్దియాలో అండర్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయించింది. దీనిని అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.  కొందరు మ్యాన్‌హోళ్లలో వ్యర్థాలు వేస్తున్నట్లు దృష్టికి వచ్చింది. అవగాహన కల్పిస్తాం. స్తంభించిన చోట బాగు చేయించి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని