logo

అన్నీ అందితేనే.. చదువు సాగేది!

మరో మూడు రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పిల్లలకు పాఠాల బోధనకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి.

Updated : 09 Jun 2023 05:49 IST

కొన్నేళ్లుగా సకాలంలో పంపిణీ చేయక తిప్పలు
ఈసారి పకడ్బందీగా అధికారుల చర్యలు

మరో మూడు రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పిల్లలకు పాఠాల బోధనకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి. ఈ తరుణంలో అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే పాఠ్య, రాత పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఏకరూప దుస్తులు సైతం అందించేలా ప్రణాళిక రూపొందించింది. మరోవైపు సర్కారు బడుల్లో చేరికలు పెంచేలా బడి బాటను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లోని పరిస్థితిపై కథనం.

ఈనాడు, సంగారెడ్డి, న్యూస్‌టుడే, సిద్దిపేట, సంగారెడ్డి మున్సిపాలిటీ, మెదక్‌: కరోనా మహమ్మారితో రెండేళ్ల పాటు బోధన అంతంతే సాగిన విషయం విదితమే. ఆ తర్వాతి నుంచి పాఠ్యపుస్తకాలకు తిప్పలు తప్పలేదు. బడులు మొదలై చాలారోజులైనా అందరికీ సరిపడా అందక సమస్య తలెత్తింది. గత విద్యాసంవత్సరం సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లోని చాలా బడులుకు ఆగస్టు నెలాఖరు వరకు కూడా పూర్తిస్థాయిలో పుస్తకాలు పంపిణీ కాలేదు. దీంతో ఉపాధ్యాయులు పాత విద్యార్థుల నుంచి పాత పుస్తకాలు తెప్పించి సర్దుబాటు చేశారు. ఇది ఫలితాల సాధనపై ప్రభావం చూపిందని నిపుణులు సూచిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినా అవసరాల మేర పాఠ్యపుస్తకాలు సకాలంలో ఇవ్వకపోవడంతో ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్థితి. ఈసారి ప్రభుత్వం కొత్తగా రాతపుస్తకాలూ పంపిణీ చేస్తామని చెప్పింది. ఈ అంశమై ఇంకా జిల్లాస్థాయిలో తమకు పూర్తి స్పష్టత రాలేదని అధికారులు వివరించారు.


పిల్లల సంఖ్య పెంచేలా..

సిద్దిపేటలో బడిబాట ర్యాలీ

ప్రబుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు ఈనెల 3న బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. ప్రైవేటు బడుల్లో చదువుతున్న వారితో పాటు బడి బయట పిల్లలను రప్పించేలా కసరత్తు కొనసాగుతోంది. ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తోన్న సదుపాయాల గురించి వివరిస్తున్నారు. పలు చోట్ల అప్పటికప్పుడే ప్రవేశాలు చేయిస్తున్నారు. డీఈవోలు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. వీలైనంత మేర పిల్లలను చేర్చుకోవడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.


చొరవ చూపాలి..

పంపిణీకి సిద్ధంగా పుస్తకాలు

నాలుగు జిల్లాల పరిధిలో పరిశీలిస్తే సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్‌లలో అవసరమైన పాఠ్యపుస్తకాల్లో 80 శాతానికి పైగా జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రం నుంచి మండలాలకూ పంపిణీ సైతం మొదలైంది. మెదక్‌ జిల్లాలో అధికారులు ఈ విషయమై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కేవలం 49 శాతం మాత్రమే జిల్లా కేంద్రానికి వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బడులు ప్రారంభమయ్యేలోపు మిగతా వాటినీ తెప్పించాలి. మండల కేంద్రాలకు చేరిన పుస్తకాలను ఆయా బడుల ఉపాధ్యాయులు వచ్చి తీసుకెళ్తుంటారు. ఈనెల 12 నుంచి ప్రక్రియ మొదలవుతుంది. మిగతావి సైతం జిల్లాకు అందేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలి.


ఏకరూప దుస్తులూ ఆలస్యమే

గతేడాది వస్త్రం రాక ఆలస్యం కావడంతో ఏకరూప దుస్తుల పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. మొదట్లో ఆగస్టులో పూర్తిచేస్తామన్నా సాధ్యం కాలేదు. జనవరిలో విద్యార్థులకు వాటిని అందించారు. ఈసారి మొదట్లోనే ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 20న విద్యాదినోత్సవం రోజు పంపిణీకి కసరత్తు చేస్తున్నారు. తొలుత కనీసం ఒక జత ఇచ్చి సాధ్యమైనంత త్వరగా మరోటి అందించేలా కార్యాచరణ రూపొందించారు. దుస్తుల నాణ్యత సరిగా లేక కొన్ని రోజులకే చినుగుతుండటం విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. ఈ సారైనా పరిస్థితిలో మార్పు ఉంటుందో లేదో వేచిచూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని