ప్రాణాలు కోల్పోయి.. విషాదాన్ని మిగిల్చి
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదా ల్లో నలుగురు మృతి చెందారు. మనోవేదనతో మరో నలుగురు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. చెరువులో పడి ఒకరు మృత్యువాతపడ్డారు. ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
మనోవేదనతో నలుగురి బలవన్మరణం
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదా ల్లో నలుగురు మృతి చెందారు. మనోవేదనతో మరో నలుగురు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. చెరువులో పడి ఒకరు మృత్యువాతపడ్డారు. ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.
కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు..
హవేలిఘనపూర్, న్యూస్‌టుడే: కారు, ద్విచక్రవాహనం ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన హవేలి ఘనపూర్ మండలం కూచన్‌పల్లి శివారులో చోటుచేసుకుంది. ఇన్‌ఛార్జి ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ఇదే మండలం ఫరీద్‌పూర్‌కు చెందిన సార రాములు(46), సుప్రియ దంపతులకు ఓ కుమారుడు ఉన్నారు. రాములు వ్యవసాయంతో పాటు మేస్త్రీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. బుధవారం రాత్రి పనులు ముగిశాక మెదక్ వైపు నుంచి ద్విచక్రవాహనంపై గ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో కలిసి ఫరీద్‌పూర్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో కూచన్‌పల్లి శివారులో సర్ధన వైపు నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో వాహనం నడుపుతున్న రాములుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు మెదక్ ఆసుపత్రికి, అక్కడికి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు తులసి రత్నకుమార్ ఫిర్యాదుతో కేసు నమోదైనట్లు ఇన్‌ఛార్జి ఎస్‌ఐ వివరించారు.
గ్రామస్థులపైకి దూసుకొచ్చిన కారు.. కూలీ
చిన్నకోడూరు: ‘దశాబ్ది’ ఉత్సవాల నిర్వహణపై చర్చిస్తున్న గ్రామస్థుల బృందం పైకి అతివేగంతో వచ్చిన కారు దూసుకు రావడంతో కూలీ ఒకరు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌లో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శివానందం, గ్రామస్థులు వివరాలు తెలిపారు. ఇబ్రహీంనగర్‌కు చెందిన పొన్నాల మల్లేశం (45) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య ఎల్లవ్వ, కుమారుడు శివ, కూతురు భవిత ఉన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగ నిర్వహించేందుకు డప్పులు అవసరమవగా గురువారం ఉదయం ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు కలిసి రాజీవ్ రహదారి పక్కన ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద చర్చిస్తున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు గుంపుగా ఉన్న జనాల మధ్యలోకి దూసుకొచ్చింది. గమనించిన వారందరూ వేగంగా పక్కకు తప్పుకోగా మల్లేశం అక్కడే చిక్కుకు పోవడంతో కారు ఢీకొట్టింది. తలకు గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. వాహనం అలాగే ముందుకెళ్లి బేస్‌మెంటును ఢీకొని ధ్వంసమైంది. ఇతర జనాలకు, చోదకుడికి గాయాలు కాలేదు. మల్లేశం సోదరుడు రాజలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్‌కు చెందిన కారు డ్రైవర్ శ్రీనివాస్‌రావుపై కేసు నమోదు చేశారు.
బైక్ అదుపుతప్పి.. యువకుడు..
శివ్వంపేట: విందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో అదుపు తప్పి కింద పడగా తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. శివ్వంపేట ఎస్‌ఐ రవికాంత్‌రావు తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లికి చెందిన సాయికుమార్ (27) బుధవారం రాత్రి శివ్వంపేట మండలం తిమ్మాపూర్‌లో వివాహ విందులో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. టిక్యాదేవమ్మ గూడెం తండా చౌరస్తాలో వాహనం అదుపు తప్పగా పొలంలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. అదే మార్గంలో వెళ్తున్న దేవమ్మగూడెం తండాకు చెందిన విఠల్ గమనించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని బాచుపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.
లారీ ఢీకొని వీఆర్‌ఏ..
తాండూరు గ్రామీణ: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గౌతాపూర్‌లో నిర్వహించిన చెరువుల పండుగలో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గురువారం సాయంత్రం గ్రామస్థులు బతుకమ్మలతో ఆడిపాడారు. అనంతరం చెరువు వద్ద పూజలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలో ఓగీపూర్ నుంచి నాపరాయితో పట్టణంలోని ట్రాన్స్‌పోర్టు వద్దకు వెళ్తున్న లారీని వీఆర్‌ఏ సలీం(46) ఆపబోయాడు. అతడిని లారీ బలంగా ఢీకొట్టడంతో మృతి చెందాడు. గ్రామస్థులు గమనించి లారీని పట్టుకున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు. చోదకుడు బంట్వారం మండలం ఈదులపల్లికి చెందిన కమాల్‌రెడ్డిని వెంటనే అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదైంది. మృతుడికి భార్య హనీఫా బేేగం, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతి
కుల్కచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కుల్కచర్ల ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం... బొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన షబానా బేగం, భర్త గౌస్(31)తో కలిసి తన తల్లి పుట్టింటికి ఈ నెల 6వ తేదీన వెళ్లారు. మరుసటి రోజు రాత్రి గౌస్ బయటకు వెళ్లి వస్తానని ఇంట్లోని వారికి చెప్పి వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో చుట్టు పక్కల వెదికారు. గురువారం ఉదయం గ్రామానికి చెందిన నర్సయ్య చెరువు దగ్గర చెప్పులు, ఫోన్‌ను గుర్తించి షబానాబేగంకు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో వెతకగా మృతదేహం లభించింది.
తల్లి మందలించడంతో మనస్తాపం చెంది..
చిలప్‌చెడ్: తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు మంజీరాలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చిలప్‌చెడ్ ఏఎస్‌ఐ మిస్బొద్దీన్ తెలిపిన వివరాలు.. మండలంలోని బండపోతుగల్‌కు చెందిన తలారి లచ్చమ్మ కుమారుడు సత్యనారాయణ (27) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఏదైనా పనిచూసుకో, ఖాళీగా ఎన్ని రోజులు ఉంటావని లచ్చమ్మ గత నెల 28న మందలించింది. దీంతో మనస్తాపం చెందిన సత్యనారాయణ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి కుటుంబీకులు, బంధువులు అన్ని చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి లచ్చమ్మ ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదైంది. గురువారం మంజీరాలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి సత్యనారాయణగా గుర్తించారు. కేసు నమోదైంది.
కుటుంబ సమస్యలతో మహిళ
చేర్యాల, న్యూస్‌టుడే: భర్త చనిపోగా ఇద్దరు పిల్లలతో జీవనం సాగడం కష్టంగా మారడంతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం రాంసాగర్‌లో జరిగింది. కొమురవెల్లి ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తాడూరి యాదమ్మ(30) గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దాదాపు 15 ఏళ్ల క్రితం గజ్వేల్‌కు చెందిన స్వామితో వివాహమైంది. వారికి పన్నెండేళ్ల లోపు బన్నీ, భాను ఇద్దరు కుమారులున్నారు. పదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో తల్లిగారి ఊరైన రాంసాగర్‌కి వచ్చి కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. జీవనం కష్టమవడంతో మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన బన్నీ, భానును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
వెంకటాయపల్లిలో మరొకరు..
తూప్రాన్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో చోటుచేసుకుంది. తూప్రాన్ ఎస్‌ఐ సురేశ్‌కుమార్ తెలిపిన వివరాలు.. వెంకటాయపల్లికి చెందిన స్వామిగౌడ్, సునీత (36)లకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య తరచూ గొడవలు పడేవారు. పలుమార్లు పెద్దల సమక్షలో పంచాయితీలు జరిగాయి. బుధవారం మరోసారి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన సునీత గురువారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి తలుపులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మృతురాలికి భర్తతో పాటు కుమారుడు ఉన్నాడు.
మొయినాబాద్ రిసార్టులో..
అక్కన్నపేట(హుస్నాబాద్ గ్రామీణం), న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేటకు చెందిన యువకుడు కామాద్రి అనిల్(22) ఓ రిసార్టులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం బతుకుదెరువుకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ రిసార్టులో యువకుడు పని చేస్తున్నాడు. ఏం జరిగిందో విషయం బయటకు వెల్లడి కాలేదు కానీ రిసార్టులోని ఓ గదిలో రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులకు నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. కుమారుడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునే వాడు కాదని తండ్రి వెంకటస్వామి అన్నారు. మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తండ్రి తెలిపారు. అంతకపేటలో గురువారం అంత్యక్రియలు జరిగాయి.
చెరువులో పడి యువకుడి గల్లంతు
మోమిన్‌పేట, న్యూస్‌టుడే: చెరువుల పండగ ఉత్సవాల్లో ఓ యువకుడు చెరువులో గల్లంతు అయిన సంఘటన మోమిన్‌పేట మండలంలోని దేవరôపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, మోమిన్‌పేట ఎస్‌ఐ విజయ్ ప్రకాష్ తెలిపిన ప్రకారం..దేవరంపల్లి గ్రామానికి చెందిన పొచ్చన్నోళ్ల మాణిక్‌రెడ్డి, పుష్పమ్మల కుమారుడు శేఖర్‌రెడ్డి (36) గురువారం గ్రామంలో నిర్వహించిన చెరువుల పండగలో పాల్గొన్నాడు. బతుకమ్మలను వదిలేందుకు చెరువులోకి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి బయటకు రాలేకపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి గాలించినా లాభం లేకపోయింది. సమాచారం తెలుసుకున్న మోమిన్‌పేట ఠాణా పోలీసులు, ఆగ్నిమాపక సిబ్బంది, జాలర్లు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై విజయ్‌ప్రకాష్ తెలిపారు.
జీవించి ప్రజాసేవలో..మరణించి ఆర్తుల సేవలో..
మనోహరాబాద్, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ కానిస్టేబుల్ జీవన్మృతుడైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సింగి లక్ష్మారెడ్డి(40) శివ్వంపేట ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య భవానీతోపాటు మణికంఠ, సాత్విక్‌రెడ్డి అనే ఇద్దరు కుమారులున్నారు. ఈ నెల 2న తూప్రాన్ నుంచి శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మెదక్‌లో సోమవారం నిర్వహించిన సురక్షా దినోత్సవంలో ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్నారు. నూతన ఠాణాలో రిపోర్టు చేసి ఇంటికి తిరిగొస్తుండగా పరికిబండ శివారులో అడవిపంది ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తున్న వైద్యులు ఆయన్ను జీవన్మృతుడిగా ప్రకటించారు. అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. లక్ష్మారెడ్డి మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోగా, ముప్పిరెడ్డిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తల్లి, కుమారుడి అనుమానాస్పద మృతి
పటాన్‌చెరు అర్బన్, న్యూస్‌టుడే: తల్లి, కుమారుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ఉస్మానాబాద్‌కు చెందిన ముక్రాబాయి సత్వాజీ కాంబ్లే(79), కుమారుడు ఉత్తమ్ సత్వాజీ నాగప్ప కాంబ్లే(48)లు బతుకుదెరువుకు పదేళ్ల క్రితం పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామానికి వచ్చారు. ఇక్కడ అద్దెకుంటున్నారు. ఉత్తమ్ స్థానికంగా ఉన్న తోషిబా పరిశ్రమలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నారు. అయితే గురువారం ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. గదికి వెళ్లి చూసేసరికి ఇద్దరూ చనిపోయి ఉన్నారు. వారే విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పటాన్‌చెరు పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ukraine Crisis: భద్రతామండలి పని తీరును ప్రపంచం ప్రశ్నించాలి!: భారత్
-
Chandrababu Arrest: చంద్రబాబుకు బాసటగా.. కొత్తగూడెంలో కదం తొక్కిన అభిమానులు
-
Swiggy: యూజర్ల నుంచి స్విగ్గీ చిల్లర కొట్టేస్తోందా? కంపెనీ వివరణ ఇదే..!
-
Salman khan: రూ.100కోట్ల వసూళ్లంటే చాలా తక్కువ: సల్మాన్ ఖాన్
-
Apply Now: ఇంటర్‌తో 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
-
Hyundai i20 N Line: హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్.. ధర, ఫీచర్ల వివరాలివే!