logo

తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టి, నిరంతర కృషి వల్ల తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు.

Published : 09 Jun 2023 01:56 IST

ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు

ప్రసంగిస్తున్న హరీశ్‌రావు. చిత్రంలో మాణిక్‌రావు, బీబీపాటిల్‌, శివకుమార్‌, చింతా ప్రభాకర్‌ తదితరులు

జహీరాబాద్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టి, నిరంతర కృషి వల్ల తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం జహీరాబాద్‌లో పర్యటించిన ఆయన స్థానిక ఎమ్మెల్యే కె.మాణిక్‌రావుతో కలిసి హోతి (కె) శివారులో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి ఆగస్టు 15వ తేదీలోపు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పద్మశాలి భవనం, ఆరె కటికె భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వివిధ చోట్ల ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. గత ఎమ్మెల్యే గీతారెడ్డి(కాంగ్రెస్‌) హయాంలో జహీరాబాద్‌ వాసులు తాగునీటి కోసం అనేక అవస్థలు పడ్డారన్నారు. నేడు ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీటిని అందించి ఇబ్బందులు దూరం చేశామన్నారు. జహీరాబాద్‌లో ఆసుపత్రి స్థాయి పెంచి డయాలసిస్‌ తదితర కేంద్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. 50 పడకలతో మాతాశిశు సంరక్షణ కేంద్ర నిర్మాణం జరుగుతుందని, మూడు నెలల్లో పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈ నెల 16 నుంచి కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీని ప్రారంభిస్తామని, గృహలక్ష్మి పథకం ద్వారా త్వరలో జహీరాబాద్‌ నియోజకవర్గానికి 3వేల ఇళ్లు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు.

భవనాలకు స్థలాలు, నిధులు

జహీరాబాద్‌ పర్యటనకు వచ్చిన మంత్రి టి.హరీశ్‌రావు హోతి(కె) శివారులో పద్మశాలి భవనానికి 30 గుంటల భూమి కేటాయింపుతో పాటు.. భవన నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అరెకటిక భవనానికి 20 గంటలు, రూ.10 లక్షలు, జంగమ సమాజం భవనానికి 10 గుంటలు, గౌడ సంఘం భవనానికి 10 గుంటలు, మున్నూరుకాపు సంఘం భవనానికి 10 గుంటల భూమిని కేటాయిస్తూ.. సంబంధిత పత్రాలను ఆయా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్‌, పాలనాధికారి డాక్టర్‌ ఎ.శరత్‌, ఎస్పీ రమణకుమార్‌, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చింతా ప్రభాకర్‌, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ ఎం.శివకుమార్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు, మైనార్టీ కమిషన్‌ సభ్యుడు మహ్మద్‌ తన్వీర్‌ పాల్గొన్నారు.

నూతన పాలక మండలికి అభినందన

సంగారెడ్డి టౌన్‌: సంగారెడ్డి వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి నూతన అధ్యక్షుడిగా నియామకమైన ప్రభుగౌడ్‌, డైరెక్టర్‌లకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నూతన పాలకమండలి సభ్యుల్ని ఆయన అభినందించారు. మార్కెట్‌ కమిటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చింతా ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని