logo

అతివ.. దిగ్గజ..లక్‌పతి దీదీలు

జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగింది.

Published : 10 Jun 2023 01:47 IST

1,92,313 మందికి రూ.లక్షకు పైగా వార్షికాదాయం

సమావేశమైన పొదుపు  సంఘం సభ్యులు

ఓ వైపు పొదుపు బాటలో పయనిస్తూ.. మరోవైపు తమ దక్షతతో వ్యాపార రంగంలో తమదైన ముద్రవేస్తూ ముందుకు సాగుతున్నారు ఎంతో మంది మహిళలు. బృందంగా రాణించేలా, పొదుపు సూత్రం అవలంబించేలా చేయాలన్న లక్ష్యంతో ఏర్పడినవే స్వయం సహాయక సంఘాలు. వీటిల్లో చేరిన వారంతా ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతను వినియోగించుకుంటూ ఫలితాలు సాధిస్తుండటం విశేషం. గతంతో పోలిస్తే వారి ఆర్థిక స్థితిగతుల్లో ఎంతో మార్పు వచ్చిందని ఇటీవల చేపట్టిన సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

న్యూస్‌టుడే, చేర్యాల: జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగింది. ఇందులో నాలుగు జిల్లాల్లో 1.92 లక్షల మంది రూ.లక్షకు పైగా వార్షిక ఆదాయం ఆర్జిస్తున్నట్లు తేలడం విశేషం. మహిళల సంఘటితం, పొదుపు, ఆర్థికంగా ఎదుగుదలకు రుణాలు, తిరిగి సక్రమంగా చెల్లిస్తున్నారా, ఆర్థిక స్వావలంబన ఏ మేర సాధించారు.. తదితర అంశాలపై లక్‌పతి దీదీ పేరిట ఆరా తీశారు. మహిళల ఆర్థిక పురోగతిలో భాగంగా ప్రతి ఇంట్లో సగటు సంపాదన ఎంతనేది కూడా సేకరించారు. రుణం తీసుకొని రూ.లక్షకు పైగా వార్షికాదాయం ఉన్న వారిలో సంగారెడ్డి జిల్లా 41 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నాగర్‌కర్నూల్‌ 39 శాతంతో రెండో స్థానంలో ఉంది.

వివరాలు సేకరిస్తున్న సిబ్బంది


ఆర్థికంగా ఎదిగిన తీరు..

రెండు, మూడు దశాబ్దాల కిందట పొదుపు సంఘాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. సంఘాల్లో చేరి కొంచెం కొంచెం డబ్బు పొదుపు చేశారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని వ్యాపారాలు మొదలుపెట్టారు. కుటుంబాలకు అండగా నిలిచారు. తమ పిల్లలను చదివించుకునేందుకు వినియోగించుకున్నారు. ఏ ఆసరా లేని వారెంతోమందికి ఈ సంఘాలు భరోసాగా నిలిచాయి. 2011 నుంచి సంఘంలో చేరిన మహిళ ఆర్థికంగా ఏ మేరకు ఎదిగారన్నది క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. రుణాల వినియోగం ఏ మేర ఉందన్న అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.


ప్రధానమైనవి ఇవే..

సర్వేలో పలు ప్రధాన అంశాలను తెలుసుకున్నారు. పొదుపు సంఘాల్లో చేరకముందు డబ్బు సర్దుబాటు ఎలా చేసుకున్నారు, ఇప్పుడెలా ఉంది, అనుకోకుండా వచ్చే ఖర్చులకు సొమ్ము లభ్యత వివరాలు సేకరించారు. మైక్రో ఫైనాన్షియర్ల నుంచి రుణాలు తీసుకునే బదులు స్త్రీనిధి, చిన్న సంఘాల ద్వారా రుణాలు తీసుకుంటున్న క్రమాన్ని నమోదు చేశారు. ప్రతి నెల, ఆరు నెలలు, ఏడాదికోసారి సగటున ఎంత సంపాదిస్తున్నారు, వీటితో కుటుంబానికి ఎలా అండగా నిలుస్తున్నారని తెలుసుకున్నారు. వ్యాపారాన్ని ప్రారంభించి, ఎదిగిన తీరును మదింపు చేసి నమోదు చేశారు. కుటుంబంలో విద్య, ఆర్థిక నిర్వహణ తదితరవి తెలుసుకున్నారు.


భవిష్యత్తుకు ప్రణాళిక

సంఘాల సభ్యులు ఆర్థికంగా మరింత రాణించేలా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించే దిశగా అధికారులు అడుగేశారు. అందుకు ఆర్థిక వనరులు ఏ మేర అవసరం, ఎలా సమకూర్చుకోనున్నారు తదితర వాటిపై సభ్యుల ఆలోచనలను మదింపు చేశారు. పక్కా పొదుపు, రుణం తీసుకోవడం, క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్న వారికి బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళికలు రూపొందిచుకోవాలన్నది ఈ సర్వే లక్ష్యం.


ప్రతి ఇంటికి వెళ్లి..: చంద్రమోహన్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి, సిద్దిపేట

బ్యాంకుల చేయూతతో మహిళలు తమ స్థితిగతులను మెరుగుపరుచుకుంటున్నారు. గతంలో రూ.10 వేలకు మించి లేని వార్షిక ఆదాయం నేడు రూ.లక్ష దాటడం హర్షణీయం. ప్రస్తుతం ప్రతి పొదుపు సంఘం రూ.20 లక్షల రుణం తీసుకునే స్థాయికి ఎదిగింది. సిబ్బంది ప్రతి ఇల్లు తిరిగి పారదర్శకంగా సర్వే నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణకు నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు