logo

వ్యక్తిని బలిగొన్న పొలం వివాదం

పొలం వివాదంపై ఉన్న కక్షతో ముగ్గురు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

Published : 10 Jun 2023 01:47 IST

దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి

చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: పొలం వివాదంపై ఉన్న కక్షతో ముగ్గురు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని తీసుకువచ్చిన సమయంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన ముచ్చర్ల యాదగిరి(58)కి పొలం విషయంలో అదే గ్రామానికి చెందిన సురేష్‌తో వివాదం ఉంది. గత నెల 21న యాదగిరి వరి పంటను కోసి సురేష్‌ ఖాళీ స్థలంలో ఆరబెట్టాడు. అర్ధరాత్రి వర్షం కురియడంతో వడ్లపైన టార్పలిన్లను కప్పి సురేష్‌ పొలం నుంచి బండరాయిని తీసుకువచ్చి కుప్పపై ఉంచాడు. ఇది గమనించిన సురేష్‌, దిడ్డికిని మహిపాల్‌, దిడ్డికిని కిషన్‌లు కలిసి యాదగిరిపై మూకుమ్మడి దాడికి పాల్పడి విచక్షణారహితంగా కొట్టారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యాదగిరిని కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై సుభాష్‌గౌడ్‌ గ్రామంలో విచారణ చేపట్టి సురేష్‌, మహిపాల్‌, కిషన్‌లు ఉద్దేశపూర్వకంగానే యాదగిరిపై దాడికి పాల్పడినట్లు తేలడంతో ఆదివారం వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం యాదగిరి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య మంజుల, ముగ్గురు పిల్లలున్నారు.

గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి  

యాదగిరి మరణించిన విషయం తెలియగానే సురేష్‌, మహిపాల్‌, కిషన్‌ కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళం వేసి పరారయ్యారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేగుంట, నార్సింగ్‌, నిజాంపేట, రామాయంపేట నుంచి భారీగా పోలీసులు వచ్చారు. రాత్రి మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగానే గ్రామస్థులు అంబులెన్సును చుట్టుముట్టారు. నిందితుల కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడే వరకు అంబులెన్స్‌ నుంచి మృతదేహాన్ని తీసేదిలేదని పట్టుబట్టారు. తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి గ్రామస్థులతో మాట్లాడినప్పటికీ శాంతించలేదు. దీంతో నిందితుల కుటుంబసభ్యులు ఎక్కడ ఉన్నారని డీఎస్పీ ఆరా తీసి వారిని గ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.  


గ్రామస్థులతో మాట్లాడుతున్న డీఎస్పీ యాదగిరిరెడ్డి  


విద్యుదాఘాతంతో రైతు మృతి

వర్గల్‌, న్యూస్‌టుడే: మొరాయించిన బోరు మోటారును సరి చేసేందుకు రైతు యత్నించగా విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం దండుపల్లి గ్రామంలో జరిగింది. బేగంపేట ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన టెంకంపేట నర్సింలు (55) గురువారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లాడు. మోటారు నడిచేలా చేసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్తు తీగలు తాకి అక్కడికక్కడే కింద పడి చనిపోయాడు. రాత్రి ఎంతసేపైనా ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా నర్సింలు విగతజీవిగా పడి కనిపించాడు. కుమారుడు రాజు శుక్రవారం ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. నర్సింలుకు భార్య, నలుగురు సంతానం ఉన్నారు. ముగ్గురికి వివాహాలయ్యాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని