logo

అర్ధరాత్రి అమ్మకు ఎంత కష్టం

అర్ధరాత్రి గర్భిణి ప్రసవ వేదనతో అంబులెన్స్‌ కోసం నాలుగు గంటలు ఎదురుచూసినా...

Updated : 18 Sep 2023 06:32 IST

 గర్భిణికి నాలుగు గంటల నరకయాతన
స్పందించని 108 సిబ్బంది

హెడ్‌ కానిస్టేబుల్‌ తుకారాం,  హోంగార్డుసర్దార్‌ను అభినందిస్తున్న ఎస్సై మహిపాల్‌రెడ్డి

సిర్గాపూర్‌, న్యూస్‌టుడే: అర్ధరాత్రి గర్భిణి ప్రసవ వేదనతో అంబులెన్స్‌ కోసం నాలుగు గంటలు ఎదురుచూసినా... ఫలితం లేకపోవడంతో చివరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది స్పందించి వారి వాహనంలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన ప్రకారం.. కల్హేర్‌ మండలం బీబీపేట్‌కు చెందిన పిట్ల శ్రావణికి శనివారం రాత్రి 11 గంటలకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆటోలో సిర్గాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రసవం నిమిత్తం ఆసుపత్రి సిబ్బంది ఏర్పాట్లు చేస్తుండగా ఆమెకు శ్వాసపరమైన సమస్య తలెత్తింది. పరిస్థితి విషమిస్తుండటంతో మెరుగైన వైద్యానికి నారాయణఖేడ్‌ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా వారి నుంచి స్పందన కరవైంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పలుమార్లు అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేయగా.. ప్రతీసారి పేషెంట్‌ పేరు, గ్రామం, మండలం, చరవాణి సంఖ్య తదితర వివరాలు నమోదు చేసుకోవడమే కాని.. వాహనం మాత్రం పంపలేదు. ఆ రాత్రి కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తోచలేదు. ఆరోగ్యం విషమిస్తుండటంతో శ్రావణి భర్త సాయిలు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పరిస్థితిని వివరించి సాయం చేయాలని అర్థించారు. వెంటనే ఎస్సై మహిపాల్‌రెడ్డి సూచన మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ తుకారం, హోంగార్డుసర్దార్‌ స్పందించి పోలీస్‌ వాహనంలో 14 కిలోమీటర్ల దూరంలోని నారాయణఖేడ్‌ ప్రాంతీయ ఆసుపత్రికి ఆమెను తరలించారు. పోలీస్‌వాహనం ఖేడ్‌ ప్రాంతీయ ఆస్పత్రికి ఒక కిలోమీటర్‌ దూరంలో ఉందనగా ఎదురుగా అంబులెన్స్‌ వచ్చి గర్భిణిని ఆ వాహనంలోకి ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాంతీయ ఆస్పత్రిలో శ్రావణి ఆడ శిశువుకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరిపిల్చుకున్నారు. ఎన్నిసార్లు పోన్‌చేసినా స్పందించని 108 కాల్‌ సెంటర్‌ సిబ్బంది తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిర్గాపూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని కల్హేర్‌ మండల కేంద్రంలో ఒకటి, 14 కిలోమీటర్ల దూరంలోని ఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో రెండు 108 అంబులెన్స్‌లు ఉన్నా.. సమయానికి ఎవరూ రాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.


కాల్‌సెంటర్‌ నుంచే సమాచారం వెళ్తుంది
-హుస్సేన్‌, 108 సంగారెడ్డి జిల్లా సమన్వయకర్త

బాధితులు 108కు పోన్‌చేసి వివరాలు చెప్పగానే వెంటనే సమీపంలోని అంబులెన్స్‌కు కాల్‌ సెంటర్‌ నుంచి సమాచారం వెళ్తుంది. ఆ వివరాల ఆధారంగా అంబులెన్స్‌ సిబ్బంది అక్కడకు చేరుకుంటారు. కాల్‌సెంటర్‌ నుంచి సేకరించిన వివరాలు స్థానిక 108 సిబ్బందికి పంపడంలో ఎక్కడ లోపం జరిగిందో తెలియదు. దీనిపై సమగ్రంగా విచారణ చేయిస్తాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని