logo

గణపతి బప్పా.. సాంకేతిక భద్రతప్పా

గణేశ్‌ నవరాత్రులంటే.. ఊరావాడ సంబురమే. ఎవరికి వారుగా ప్రత్యేకతను చాటుతూ నిర్వహించే ఉత్సవాలు అంబరాన్నంటుతాయి. మండపాల వద్ద అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహణకు పోలీసు శాఖ ఏటా చర్యలు తీసుకుంటోంది.

Published : 22 Sep 2023 06:03 IST

జిల్లాలోని 2300 మండపాలకు జియో ట్యాగింగ్‌

సిద్దిపేటలోని మండపం వివరాలు నమోదు చేస్తున్న పోలీసులు

న్యూస్‌టుడే, సిద్దిపేట: గణేశ్‌ నవరాత్రులంటే.. ఊరావాడ సంబురమే. ఎవరికి వారుగా ప్రత్యేకతను చాటుతూ నిర్వహించే ఉత్సవాలు అంబరాన్నంటుతాయి. మండపాల వద్ద అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహణకు పోలీసు శాఖ ఏటా చర్యలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో నూతన సాంకేతికతను అనుసంధానిస్తోంది. ఈ నెల 18న ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ప్రతి మండపానికి జియో ట్యాగింగ్‌ ప్రక్రియ పూర్తయింది. ఆధునిక పరిజ్ఞానంతో పోలీసుల పర్యవేక్షణ సులువుగా మారింది. ఈసారి జిల్లాలో 2300 ప్రతిమలను ప్రతిష్ఠించారు. నేరాల కట్టడికి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ముందంజలో ఉంటున్న శాఖ.. పూర్తిస్థాయి భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలో గణేశ్‌ మండపాల భద్రత, పర్యవేక్షణకు జియో ట్యాగింగ్‌ చేపట్టింది. పోలీసు ఠాణాల వారీగా తొలుత ట్యాబ్‌ల ద్వారా రేఖాంశాలు, అక్షాంశాలు గుర్తించి గూగుల్‌ పటానికి అనుసంధానించారు. సంబంధిత వివరాలు పోలీసు పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. జిల్లాలోని 26 పోలీసు ఠాణాల పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రతి మండపం వద్దకు వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించారు. పటంలో మండపానికి కేటాయించిన నంబరుపై క్లిక్‌ చేస్తే రూట్‌ మ్యాప్‌, నిర్వాహకులు, ఇతర వివరాలు కనిపిస్తాయి. అవసరమైన సందర్భంలో సిబ్బంది సులువుగా నిర్దేశిత ప్రాంతానికి ఐదు నుంచి పది నిమిషాల్లోపు చేరుకోవచ్చు. ఎక్కడి నుంచైనా ఉన్నతాధికారులు పర్యవేక్షించవచ్చు. కొన్ని భారీ మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అంతా ఆన్‌లైన్‌

ఉత్సవాల నేపథ్యంలో మండపాల ఏర్పాటుకు తొలుత ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, అనుమతుల దిశగా పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. జియోట్యాగింగ్‌ పూర్తయిన నేపథ్యంలో పెట్రోలింగ్‌, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. ఒకప్పుడు పోలీసులు అన్ని మండపాల వద్ద ప్రత్యక్షంగా పాయింట్‌ బుక్స్‌ నిర్వహించే వారు. సంతకం చేయిస్తుండేవారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లో నమోదవుతోంది. మండపం వద్దకు చేరుకొని ట్యాబ్‌ తెరవగానే హాజరు పడుతుంది. మూడో రోజు నుంచి నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైంది. సీపీ శ్వేత మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఉత్సవా లు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. పోలీసులు పర్యవేక్షిస్తున్నారని, వారి సూచనలు, సలహాలను నిర్వాహకులు పాటించాలన్నారు. పుకార్లను నమ్మొద్దని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని