logo

రుణం ఇస్తామని రూ.80 వేలకు టోకరా

రూ.50 వేల రుణం ఇస్తామని చెప్పి రూ.80 వేలు వసూలు చేసిన సైబర్‌ మోసం వెల్దుర్తి మండలం మానేపల్లిలో చోటుచేసుకుందని ఎస్సై మధుసూదన్‌గౌడ్‌ తెలిపారు.

Published : 22 Sep 2023 06:13 IST

వెల్దుర్తి, న్యూస్‌టుడే: రూ.50 వేల రుణం ఇస్తామని చెప్పి రూ.80 వేలు వసూలు చేసిన సైబర్‌ మోసం వెల్దుర్తి మండలం మానేపల్లిలో చోటుచేసుకుందని ఎస్సై మధుసూదన్‌గౌడ్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ‘గ్రామానికి చెందిన యాజాల శేఖర్‌ చరవాణికి ఈనెల 18న ఓ అపరిచితుడి నుంచి కాల్‌ వచ్చింది. బ్యాంక్‌ రుణం ఇస్తామని చెప్పగా, వద్దని ఫోన్‌ పెట్టేశారు. విషయం తెలుసుకున్న అదే గ్రామానికే చెందిన శేఖర్‌ బావమరిది నర్సింలు ఆ ఫోన్‌ నంబరు తీసుకుని తనకు రుణం కావాలని అవతలి వ్యక్తిని కోరగా మీకు రూ.50 వేల రుణం ఇస్తామని చెప్పి ఛార్జీల పేరుతో  మొత్తం రూ.80 వేలు వసూలు చేసి చరవాణి ఆపేశాడు. తాను మోసపోయానని గుర్తించిన నర్సింలు గురువారం ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.  


టీవీ కొందామని..

నర్సాపూర్‌ రూరల్‌: నర్సాపూర్‌ మండలం మంతూరుకు చెందిన దంపతులు నాగభూషణం, ప్రణీతలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నెల 8న ఓఎల్‌ఎక్స్‌లో టీవీ అమ్మకం ప్రకటన చూశారు. కొనడానికి సిద్ధమై.. ప్రకటనలోని చరవాణి నంబరుకు ఫోన్‌ చేశారు. అవతలి వ్యక్తి సూచించిన మేరకు దఫాలుగా రూ.40,000 పంపించారు. తర్వాత ఫోన్‌ చేయగా మరింత నగదు పంపాలని కోరాడు. మోసపోయామని గుర్తించి ఎస్సై శివకుమార్‌కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.


చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

హత్నూర, న్యూస్‌టుడే: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి చెందాడు. ఎస్సై సుభాష్‌ తెలిపిన వివరాలు.. మండల పరిధి బ్రాహ్మణగూడకు చెందిన బొట్ల యాదయ్య(60) చేపలు పట్టి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. బుధవారం గ్రామ శివారు అయ్యవారి చెరువుకి చేపలు పట్టేందుకు ఒంటరిగా వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృత్యువాత పడ్డాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక మృతదేహం లభ్యమైంది. ఆయన కుమారుడి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని