logo

ద్రవరూప ఎరువు.. సాగుకు ఆదరువు

తునికి గ్రామ శివారులో ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రంలో రెండు నెలల క్రితం ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్‌ నిధుల కింద రూ.55 లక్షలు వెచ్చించి అత్యాధునిక జీవ నియంత్రణ ప్రయోగశాలను నెలకొల్పారు.

Published : 22 Sep 2023 06:22 IST

తునికి కేవీకేలో 7 రకాలు ఉత్పత్తి

ఉత్పత్తులను పరిశీలిస్తున్న పాలనాధికారి రాజర్షిషా

న్యూస్‌టుడే, కౌడిపల్లి: ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తాడు రైతు. సరైన దిగుబడులు అందక నష్టపోతుంటాడు. ఈ సమస్యల నుంచి గట్టెక్కించడంతో పాటు సాగును లాభాలమయం చేయాలన్న కృతనిశ్చయంతో కృషి జరుగుతోంది. పెట్టుబడి తగ్గించి లాభసాటి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. అన్ని పంటల్లో జీవన ఎరువుల ఆవశ్యకతను వివరిస్తూ వినియోగానికి అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రం పలు పరిశోధనలతో నాణ్యమైన ద్రవరూప ఎరువులను తయారుచేస్తూ రైతులకు అందిస్తుండటం విశేషం.

తునికి గ్రామ శివారులో ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రంలో రెండు నెలల క్రితం ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్‌ నిధుల కింద రూ.55 లక్షలు వెచ్చించి అత్యాధునిక జీవ నియంత్రణ ప్రయోగశాలను నెలకొల్పారు. మార్కెట్‌ ధర కంటే తక్కువకే ద్రవరూపంలో జీవ ఎరువులను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడి శాస్త్రవేత్తలు ద్రవరూపంలోని జీవ ఎరువులను తయారు చేస్తూనే రైతులకు వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. రసాయనాలు తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఇటీవల పాలనాధికారి రాజర్షిషా, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ ప్రయోగశాలను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించి దిశానిర్దేశం చేశారు. కేవీకే హెడ్‌ డాక్టర్‌ నల్కర్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌ హింగె, ల్యాబ్‌ ఇన్‌ఛార్జి శాస్త్రవేత్త రవికుమార్‌ ఆధ్వర్యంలో ఉత్పత్తి జరుగుతోంది.


అందుబాటులో ఇవే..

కేవీకేలో ప్రస్తుతం ఏడు రకాల ద్రవరూపం ఎరువులు అందుబాటులో ఉన్నాయి.

  •  రైజోబియం 
  •   అజటోబ్యాక్టర్‌
  •  అజోస్ప్రెరిల్లమ్‌
  •  ఫాస్పరస్‌ సాల్యుబిలైజింగ్‌ బ్యాక్టీరియా
  •  మైకో రైజా
  •  పొటాషియాన్ని విడుదల చేసే బ్యాక్టీరియా
  • జింక్‌ను కరిగించే బ్యాక్టీరియా

     

ఏయే పంటల్లో..

పప్పు, నూనె పంటలతో పాటు అన్ని రకాల కూరగాయలు, పండ్ల తోటల్లో ద్రవ రూపంలోని జీవ ఎరువులను వాడుకోవచ్చు. జొన్న, వరి, మొక్కజొన్న, చెరకు, గోధుమ, పత్తి పంటల్లోనూ వేసుకోవచ్చు. విత్తన శుద్ధికి ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు.

ఉపయోగాలు

జీవ ఎరువుల వాడకం వల్ల భూసారం పెరుగుతుంది. నాణ్యమైన దిగుబడులకు అవకాశం ఉంటుంది. నేలలోని పోషకాల సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుతుంది. జీవ ఎరువుల సిఫారసు మేరకు అన్ని పంటల్లో వినియోగించవచ్చు. మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం, సూక్ష్మపోషకాలైన జింక్‌ సమృద్ధిగా అందుతాయి. వివిధ రకాల హార్మోన్లు, యాంటిబయాటిక్స్‌ను ఉత్పత్తి చేయడం వల్ల మొక్కలకు తెగుళ్లు సోకకుండా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

లీటరు రూ.160

మార్కెట్‌లో వివిధ రకాల జీవ ఎరువులు లభిస్తున్నాయి. వాటన్నింటి కంటే తక్కువ ధరకే అందిస్తున్నారు. నాణ్యత ప్రమాణాల మేరకు తయారు చేస్తున్నారు. లీటరుకు రూ.160 చొప్పున రైతులకు అందిస్తున్నారు. అవసరమైన వారు నేరుగా కృషి విజ్ఞాన కేంద్రానికి వెళ్లి కొనుగోలు చేయవచ్చు.


రైతులను ప్రోత్సహిస్తున్నాం

ద్రవ రూప జీవ ఎరువులతో రైతులకు ఎన్నో విధాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. సాగు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన దిగుబడులను ఉత్పత్తి చేసుకోవచ్చు. మొక్కల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఉత్పత్తి చేస్తున్నాం. ఈ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. సలాహాలు, సూచనలు కావాలంటే నేరుగా కేంద్రంలోని శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చు.
రవికుమార్‌, శాస్త్రవేత్త, ల్యాబ్‌ ఇన్‌ఛార్జి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని