logo

ప్రకృతి రమణీయత.. పర్యాటక వేదిక

ఆహ్లాద వాతావరణం.. పచ్చటి పంటపొలాలు.. ద్వీపాన్ని తలపించే సాగరం.. గుట్టపై రంగనాయకుడు.. అడుగడుగునా హరిత సంపద..

Updated : 26 Sep 2023 07:13 IST

జాతీయ స్థాయిలో మెరిసిన చంద్లాపూర్‌

రంగనాయక సాగర్‌

న్యూస్‌టుడే, సిద్దిపేట, చిన్నకోడూరు: ఆహ్లాద వాతావరణం.. పచ్చటి పంటపొలాలు.. ద్వీపాన్ని తలపించే సాగరం.. గుట్టపై రంగనాయకుడు.. అడుగడుగునా హరిత సంపద.. ఇలా ఎన్నో విశేషాల సమాహారమే చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ గ్రామం. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పల్లె.. జాతీయస్థాయిలో మెరిసింది. ఈ ప్రాంత కీర్తిని నలు దిశలా చాటింది. 2023 ఉత్తమ పర్యాటక గ్రామంగా చంద్లాపూర్‌ ఎంపికవడం విశేషం. మొత్తం దేశవ్యాప్తంగా 795 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నేతృత్వంలో కొత్త దిల్లీలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ఉత్తమ పర్యాటక గ్రామ పోటీల్లో సత్తా చాటిన నేపథ్యంలో విశేషాలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

ప్రత్యేక ఆకర్షణ

చంద్లాపూర్‌ ప్రత్యేకత చెప్పాలంటే.. ముందుగా ప్రస్తావించాల్సింది 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న రంగనాయక సాగర్‌. చంద్లాపూర్‌, పెద్దకోడూరు, లింగారెడ్డిపల్లి, ఇమాంబాద్‌, రామంచ గ్రామాల సరిహద్దులను కలుపుతూ 2,217 ఎకరాల్లో జలాశయం నిర్మించారు. మంత్రి హరీశ్‌రావు సారథ్యంతో అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తయింది. గోదారమ్మ నీళ్లు.. మధ్యన కొండ, గుట్టల ప్రాంతం ఓ ద్వీపాన్ని తలపిస్తుంది. జలాశయం చుట్టూ 8.65 కి.మీ. కట్టను తీర్చిదిద్దారు. జలాశయం మధ్య ద్వీపం మాదిరి (50 ఎకరాలు) స్థలం ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం ఇక్కడ నీటిపారుదల శాఖ అతిథిగృహం, ఎస్‌ఈ కార్యాలయం కొనసాగుతున్నాయి. పర్యాటక అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ దండిగా నిధులు కేటాయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సాగర్‌ చెంతన రూ.125 కోట్లతో పర్యాటక శాఖ అభివృద్ధి పనులు చేపట్టింది. అవి పూర్తయితే ఆహ్లాదానికి చిరునామాగా మారనుంది. జిల్లా కేంద్రం నుంచి 8 కి.మీ. దూరంలోని ఈ ప్రాజెక్టు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. సెలవు రోజుల్లో సందర్శకులతో సందడి ఉంటోంది.

ఆదర్శంగా నిలిచాం..: హరీశ్‌రావు, మంత్రి

రాష్ట్రంలో రెండు గ్రామాలు ఎంపికవగా.. అందులో చంద్లాపూర్‌ ఒకటవడం ఆనందంగా ఉంది. ఎన్నో జాతీయ స్థాయి పురస్కారాలను అందుకుంటున్న సిద్దిపేట నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామస్థులకు శుభాకాంక్షలు. ఈ స్ఫూర్తిని నిరంతరం కొనసాగిద్దాం. అన్ని అంశాల్లో మన ప్రత్యేకతను చాటుదాం. రానున్న రోజుల్లో సాగర్‌ అద్భుత పర్యాటక క్షేత్రంగా మారుస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని