logo

గజ్వేల్‌ జిగేల్‌

ఒకప్పుడు అనేక సమస్యలతో సతమతమైన గజ్వేల్‌ నియోజకవర్గం నేడు అభివృద్ధి పనుల్లో రాష్ట్రానికే నమూనాగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Updated : 03 Oct 2023 08:39 IST

రూ.540 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి
నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు

రింగు రోడ్డు

న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ, గజ్వేల్‌: ఒకప్పుడు అనేక సమస్యలతో సతమతమైన గజ్వేల్‌ నియోజకవర్గం నేడు అభివృద్ధి పనుల్లో రాష్ట్రానికే నమూనాగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో గజ్వేల్‌ నియోజకవర్గం దశ మారిపోయింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికి నమూనాగా చేయాలని సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో ఉన్నతాధికారులకు ఆదేశించారు. రంగంలోకి దిగిన అధికారులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శాఖల వారీగా ప్రణాళికలు రూపొందించారు. ఈ పనులను దశల వారీగా పూర్తి చేస్తూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.వేల కోట్ల విలువైన పనులను పూర్తి చేసిన వినియోగంలోకి తీసుకువచ్చారు. తాజాగా గజ్వేల్‌ నియోజకవర్గంలో రూ.540 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను నేడు మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఈ అభివృద్ధి పనులపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

రూ.34కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం

నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలను అందించాలనే లక్ష్యంగా గజ్వేల్‌ పట్టణంలో మాతా శిశుసంక్షేమ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రూ.34 కోట్లతో అధునాతన సౌకర్యాలతో కూడిన మూడు అంతస్తులతో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు. మూడు ఆపరేషన్‌ థియేటర్లు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక వార్డులు, ఐసీయూ, ఆక్సిజన్‌ సరఫరా చేసే కేంద్రంతో నిర్మించారు.  

మరిన్ని అభివృద్ధి పనులు

  • ములుగు మండలం బండమైలారం, తున్కిబొల్లారం పారిశ్రామికవాడల్లో రూ.9 కోట్లతో నిర్మించిన విద్యుత్తు ఉపకేంద్రాలు, బైలంపూర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో రూ.35లక్షలు, చిన్నతిమ్మాపూర్‌లో రూ.50లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు.
  •  వర్గల్‌ మండలం అవుసులోనిపల్లిలో పంచాయతీ భవనం(రూ.30లక్షలు), గజ్వేల్‌ మండలం, బల్దియాలతో పత్తి మార్కెట్ యార్డు(రూ.2.70కోట్లు), తూప్రాన్‌ రోడ్డులో మోడల్‌ బస్టాండ్‌ (రూ.5కోట్లు), బయ్యారంలో అభివృద్ధి పనులు(రూ.2.36కోట్లు), బల్దియాలో భూగర్భ మురుగు కాల్వలు, అంబేడ్కర్‌ భవనం(రూ.కోటి), పద్మశాలి భవనం(రూ.1.30కోట్లు), రాజీవ్‌ పార్క్‌(రూ.2.50కోట్లు)లను ప్రారంభిస్తారు.
  •  కొండపాక మండలంలో రూ.82కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు.

రింగు రోడ్డుతో తీరిన కష్టాలు2014లో ఎమ్మెల్యేగా గజ్వేల్‌లో తొలిసారి నామినేషన్‌ వేసేందుకు కేసీఆర్‌ ఇక్కడికి వచ్చారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు స్వయంగా చూసి.. శాశ్వత పరిష్కారంగా రింగు రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రింగు రోడ్డు నిర్మాణానికి భూసేకరణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ పూర్తి చేయడంతో 2016లో రూ.303 కోట్ల భారీ వ్యయంతో గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌, క్యాసారం, రిమ్మనగూడ, శ్రీగిరిపల్లి, ముట్రాజ్‌పల్లి, ధర్మారెడ్డిపల్లి, జాలిగామ, సంగాపూర్‌, సంగుపల్లి గ్రామాలను కలుపుతూ రహదారి నిర్మాణాన్ని పూర్తిచేశారు. రైల్వేస్టేషన్‌ సమీపంలో, సంగాపూర్‌ శివారులో రెండు చోట్ల కొంత మేరకు పనులు మిగిలిపోయాయి. 12 కూడళ్లతో చేపట్టిన ఈ రోడ్డు ప్రజ్ఞాపూర్‌ శివారులోని పాతూర్‌ జంక్షన్‌ నుంచి రిమ్మనగూడ శివారు వరకు 6 కూడళ్ల పరిధిలో మూడు వంతెనలతో 6 వరుసలుగా నిర్మించి విభాగినిపై హైమాస్ట్‌ దీపాలను బిగించారు.

ప్రగతి చరిత్రలో రికార్డు

నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన దాదాపు రూ.540 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్‌రావు నేడు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగ సర్వం సిద్ధం చేసింది. గజ్వేల్‌ నియోజకవర్గ చరిత్రలో ఇంత పెద్ద అభివృద్ధి పనులు ఒకేరోజు జాతికి అంకితం చేయటం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. ఈ అభివృద్ధి పనులను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి పర్యవేక్షించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని