పోటాపోటీగా సన్నాహాలు
చిల్పకుంట్లలో ఒకే దిమ్మెపై అంబేడ్కర్ విగ్రహాలు
నూతనకల్, న్యూస్టుడే: రెండు వర్గాల నడుమ ఆధిపత్యం వల్ల ఒక్క దిమ్మెపై అంబేడ్కర్ విగ్రహాలు రెండింటిని ఉంచిన ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్లలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ఎస్సీ కాలనీవాసులు నిర్ణయించుకుని ఇటీవల ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ను కలిసి వివరించారు. తనవంతుగా విగ్రహాన్ని అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పది రోజుల క్రితం విగ్రహాన్ని పంపించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిర్వాహకులు దిమ్మె నిర్మించారు. ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకంపై పేర్లు రాయాలని నిర్ణయించగా.. మరోవర్గం వారు వ్యతిరేకించారు. చర్చలు జరుగుతున్నా.. శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 2 గంటల సమయంలో మరోవర్గం వారు దిమ్మెపైకి విగ్రహాన్ని చేర్చారు. మొదటి వర్గం వారు కూడా ఉదయం 9 గంటల సమయంలో దిమ్మెపైకి విగ్రహాన్ని తెచ్చిపెట్టారు. రెండువర్గాల వారు విగ్రహాలను ప్రతిష్ఠించకపోవటం గమనార్హం. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నూతనకల్, మద్దిరాల పోలీసులు శుక్రవారం రాత్రి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.