రాజ్యాంగానికి కంకణబద్ధులై ఉండాలి
నల్గొండలోని రాజ్యాంగ పీఠికను చదివిస్తున్న జిల్లా జడ్జి జగ్జీవన్ కుమార్
నల్గొండ లీగల్, న్యూస్‌టుడే: అందరికీ రాజ్యాంగ స్ఫురణ ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ఎస్.జగ్జీవన్ కుమార్ అన్నారు. శుక్రవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా సదన్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగ ప్రాముఖ్యతను తెలియజేశారు. అందరికి సమాన హక్కులు, వాటితో పాటు బాధ్యతలు రాజ్యాంగంలో కల్పించారని పేర్కొన్నారు. రాజ్యాంగం భారత పౌరుల న్యాయ దీపికగా ఆయన అభివర్ణిస్తూ పౌరులందరూ రాజ్యాంగానికి కంకణబద్ధులై ఉండాలని కోరారు. అనంతరం న్యాయమూర్తులు, న్యాయవాదులు, తదితరులతో రాజ్యాంగ పీఠికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు. న్యాయమూర్తులు నాగరాజు, కృష్ణమూర్తి, భవాని, పద్మజ, తిరుపతి, వేణు, కీర్తిచంద్రికారెడ్డి, శ్రీవాణి, న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మేడా మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగానికి భారత పౌరులంతా కంకణబద్ధులై ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వేణు అన్నారు. శుక్రవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్, ఎన్జీకళాశాలలో నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోకెల్లా భారత రాజ్యాంగ విశిష్ఠమైందని, ప్రజల అవసరాలను తీర్చే విధంగా రూపొందించారన్నారు. ఎన్నో చట్టాలున్నా వాటిపై అవగాహన లేక సంఘంలో అనేక తప్పులు జరిగి దేశ ప్రతిష్ఠకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. కార్యక్రమాలలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రభాకర్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్‌కుమార్, బీసీ సంక్షేమాధికారిణి కృష్ణవేణి, కొండలు, ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.