logo
Updated : 27/11/2021 06:25 IST

ఆరుతడికి నీరు.. వరివైపే వీరు

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే

హుజూర్‌నగర్‌: యాసంగి కోసం పోసిన నారు

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింద నిర్దేశించిన ఆయకట్టులో ఆరుతడి పంటలకు నీరు ఇవ్వాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. యాసంగికి ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతుల పరిస్థితిపై కథనం...

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 312.05 టీఎంసీలకు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీరుండటంతో రైతులు యాసంగి పంటపై ఆశలు పెంచుకున్నారు. తక్కువ నీటి మట్టం ఉన్న రోజులలో యాసంగికి ఆరుతడి పంటలకు నీరు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే పద్ధతిలో విడుదలకు నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సన్నాలు సాగు చేసుకుంటే ఇబ్బంది ఉండదన్న ప్రజాప్రతినిధుల ఆలోచన మేరకు రైతులు ముమ్మరంగా సాగు చేసేందుకు నార్లు పోసుకుంటున్నారు.పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ ఎన్నెస్పీ అధికారి మరో వారం రోజుల్లో ఆరుతడి పంటల నీటి విడుదల షెడ్యూలు వెలువడుతుందని తెలిపారు.

వ్యవసాయ విద్యుత్తు వాడకం పెరిగినట్లే..

సాగర్‌ ఎడమ కాలువ పరిధిలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలో 3,85,662 ఎకరాలలో ఆయకట్టు విస్తరించి ఉంది. ఆయకట్టు విస్తరించి ఉన్న నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్తు సర్వీసులు అధికంగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో వ్యవసాయ విద్యుత్తు సర్వీసులు 2,02,613 సర్వీసులు ఉండగా అందులో దాదాపు 1.50 లక్షల సర్వీసులు ఆయకట్టు ప్రాంతంలోనే ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 1,32,903 వ్యవసాయ విద్యుత్తు సర్వీసులు ఉండగా అందులో లక్ష కనెక్షన్లు ఆయకట్టు ప్రాంతంలోనే ఉన్నాయి. వీరంతా యాసంగి వ్యవసాయ పనులు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గతంలోనే కాలువ నీరు రాని సమయంలో మోటరు ద్వారా పంటలను రక్షించుకునేందుకు చేసుకున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అధికంగా ఉండటం, ఉచిత విద్యుత్తు సరఫరా అవుతుండటంతో రైతులు ఎక్కువ వరి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం నీటిపారుదలశాఖ అధికారులు ఆరుతడి పంటలకు నీరు ఇచ్చేందుకు నిర్ణయించినందున రైతులు వ్యవసాయ మోటార్ల వాడకం పెంచి వరి సాగును పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరుతడి పంటలకు ఇచ్చినా భూగర్భ జలాలు ఎండాకాలంలో పడిపోకుండా పంటలను రక్షించుకోవచ్చునన్న ధీమాతో రైతులు ఉన్నారు. ఈపరిస్థితులలో యాసంగిలో విద్యుత్తు వాడకం పెరుగుతుందని విద్యుత్తు అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించినదాని ప్రకారం, ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నీటి విడుదల ఉంటుందని నీటి పారుదల శాఖ హుజుర్‌నగర్‌ డివిజన్‌ ఈఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఇంకా నీటి పారుదల శాఖ నీటి విడుదల చేయాలని నిర్ణయించినప్పటికి విధివిధానాలు ఖరారు కాలేదన్నారు.


వేరే పంటలు పండవు

- మేకల నాగేశ్వరరావు, రైతు, వెలిదండ, గరిడేపల్లి మండలం

సాగర్‌ ఆయకట్టు భూములలో వేరే పంటలు పండవు. వేరే పంటలు పండుతాయని అధికారులు నిరూపిస్తా అంటే నా పది ఎకరాల భూమి ఎలాంటి కౌలు లేకుండా ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధం. రైతులు వరి వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. యాసంగిలో ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకోవాలి. ఎమ్మెల్యేలు చెప్పినట్లు తాము సన్నరకాలు సాగు చేస్తాం.


Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని