logo
Published : 29/11/2021 02:54 IST

అందుతున్న నోటీసులు.. ఆందోళనలో అన్నదాతలు

ఈ పంట పొలం మీదుగా వెళ్లనున్న పెట్రోలియం పైపులైను (పాత చిత్రం)

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి హైదరాబాద్‌లోని మాదారం వరకు భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) ఆధ్వర్యంలో పెట్రోలియం ఉత్పత్తుల తరలింపునకు భారీ పైపులైను నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భూములు వినియోగించుకుంటామంటూ మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని గ్రామాల రైతులకు బీపీసీఎల్‌ ద్వారా నోటీసులు జారీ అవుతున్నాయి.

కృష్ణపట్నం- హైదరాబాద్‌ పైపులైను మార్గం
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి ఒంగోలు, గుంటూరు జిల్లాల మీదుగా తెలంగాణలోకి పైపులైన్‌ ప్రవేశిస్తుంది. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం  ముదిమాణిక్యంతో పాటు ఇతర గ్రామాలు, త్రిపురారం మండలంలోని బెజ్జికల్లు, రాగడప, మాటూరు, అంజనపల్లి, త్రిపురారం, కంపాసాగర్‌, దుగ్గేపల్లి, గుంటిపల్లి అన్నారం, నల్గొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల మీదుగా సాగుతుంది. విజయవాడ- హైదరాబాద్‌ ప్రధాన రహదారి వెంట భువనగిరి వైపు అక్కడి నుంచి భాగ్యనగరంలోని మాదారం వరకు పైపులైను నిర్మాణానికి ఇంజినీరింగ్‌ బృందాలు రెండేళ్ల క్రితమే సర్వే చేశాయి. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే సర్వే చేయటం గమనార్హం. ఏ మార్గంలో పైపులైను వెళ్తుందో నిర్ణయించుకున్న తరువాతే ఆదారి గుండా రైతులు ఎంత భూమి ఇవ్వాలో తెలుపుతూ వారం రోజులుగా నోటీసులు జారీ చేస్తున్నారు.
త్రిపురారం మండలంలోనే అత్యధిక రైతులకు చెందిన భూముల్లో 20 కి.మీ. మేర పైపులైను వెళ్లనుంది.
నోటీసులు అందుకున్న 21 రోజుల్లోగా నిర్ణీత విధానంలో అభ్యంతరాలు తెలియజేయాలని బీపీసీఎల్‌ అధీకృత అధికారులు స్పష్టం చేశారు.
సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఏడాదికి రెండు పంటలు పండించే పొలాల నుంచి పైపులైన్‌ వెళ్లనుంది. దీనివల్ల తమకు నష్టం కలుగుతుందని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు లీకేజీలు సంభవించి ప్రమాదాలు జరిగితే తీవ్రంగా నష్టపోతామంటూ కర్షకులు ఆందోళన చెందుతున్నారు.
భూములు కోల్పోయే రైతులకు ఎంత పరిహారం చెల్లిస్తామనే అంశాన్ని నోటీసుల్లో బీపీసీఎల్‌ పొందుపరచలేదు. అడవిదేవులపల్లి, త్రిపురారం, నల్గొండ ప్రాంతాల్లో ఎకరం భూమి రూ.30- 40 లక్షల వరకు బహిరంగ మార్కెట్‌లో ధర పలుకుతోంది. రిజిస్ట్రేషన్‌ ధరల ప్రకారం బీపీసీఎల్‌ పరిహారం చెల్లిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు చెబుతున్నారు.


విలువైన భూముల మీదుగా పైపులైన్లు వేయటం సరికాదు
-మెరుగు శీనివాస్‌, బెజ్జికల్‌, త్రిపురారం మండలం

మా గ్రామంలోని 267 సర్వే నంబరులో నా పంట పొలం 39 కుంటలు (సుమారు ఎకరం) పోతున్నట్లుగా బీపీసీఎల్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక్కడ ఎకరం భూమి విలువ సుమారు రూ.40 లక్షల వరకు పలుకుతోంది. ఇంత విలువైన భూముల నుంచి పైపులైన్లు వేయటం సరికాదు. మధ్యతరగతి రైతుల జీవనం అగమ్యగోచరంగా మారుతుంది. ప్రభుత్వ స్థలాలు, ఖాళీ ప్రాంతాల మీదుగా పైపులైన్‌ వెళ్లేలా సర్వే చేస్తే బాగుండేది.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని