logo
Published : 29/11/2021 02:54 IST

ఆరోగ్యశ్రీకి సుస్తీ

రూ.20 కోట్ల వరకు బకాయిలు

శస్త్రచికిత్సలు చేయని ప్రైవేటు ఆసుపత్రులు

సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులు (పాత చిత్రం)

* నల్గొండ జిల్లా కేంద్రంలో చంద్రగిరి విల్లాస్‌కు చెందిన వెంకటేశ్‌కు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడ్డాయి. కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స చేయడానికి నిరాకరించారు. చేసేదేమీ లేక హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో వెంకటేశ్‌ శస్త్రచికిత్స చేయించుకున్నారు.


* నల్గొండ జిల్లాకేంద్రంలోని మాన్యంచల్క ప్రాంతానికి చెందిన యాదగిరికి నెల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ఆరోగ్యశ్రీ పథకం అమల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ పథకం నిధులు సకాలంలో రావడం లేదని రూ.35 వేలు చెల్లిస్తే వెంటనే శస్త్రచికిత్స చేస్తామని నిర్వాహకులు చెప్పారు. బాధితుడి కుటుంబ సభ్యులు నగదు చెల్లించి శస్త్రచికిత్స చేయించుకున్నారు.


* సూర్యాపేట జిల్లాకేంద్రంలోని కుడకుడరోడ్డు ప్రాంతానికి చెందిన నర్సింహాచారికి ఎర్నియా సమస్య రావడంతో నెల క్రితం నల్గొండ జనరల్‌ ఆసుపత్రికి వెళ్లారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేసినా తమకు పారితోషికం అందడం లేదంటూ వైద్యులు జాప్యం ప్రదర్శించటంతో హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.

నల్గొండ అర్బన్‌, సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పేదలకు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రభుత్వం నుంచి సకాలంలో రాకపోవడంతో నగదు చెల్లిస్తేనే శస్త్రచికిత్సలు చేయడానికి ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు మొగ్గుచూపుతున్నారు. ఎక్కువ మంది బాధితులు హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఏడాదిన్నరగా ప్రభుత్వం నుంచి సుమారు రూ.20 కోట్ల వరకు ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు అందాల్సి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్సలు చేసినా వైద్యులు, ఇతర సిబ్బందికి చెల్లించాల్సిన పారితోషికం మూడేళ్లుగా అందటం లేదు. అందుకే అక్కడా శస్త్రచికిత్సలు నామమాత్రంగా జరుగుతున్నాయి. సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 350 పడకలకుగాను ఆరోగ్యశ్రీ రోగులు 20 మంది మాత్రమే ఉండటం ఈ పథకం అమలు తీరుకు అద్దం పడుతోంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పదకొండు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు తొమ్మిది ప్రైవేటు దవాఖానాల్లో మల్టీస్పెషాలిటీ, ఆర్థో వైద్య సేవలు, నల్గొండలో ఐదు, సూర్యాపేటలో మూడు ప్రైవేటు ఆసుపత్రుల్లో దంత వైద్య సేవలు ఆరోగ్యశ్రీ పథకం కింద నిర్వహిస్తున్నారు.  


సిబ్బందిని సంప్రదిస్తే..
-స్వప్న, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త, నల్గొండ జిల్లా

ఆరోగ్యశ్రీ అనుమతులున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో అర్హత కలిగిన వారికి శస్త్రచికిత్సలు అందించాల్సిందే. ప్రభుత్వం నుంచి నిధులు ప్రతినెలా రావని ఒప్పందాలున్నాయి. శస్త్రచికిత్స చేయబోమని నిర్వాహకులు చెబితే ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ సిబ్బందిని సంప్రదిస్తే తక్షణ చర్యలు తీసుకుంటారు. బకాయి నిధుల అంశాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తాం.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని