ఆర్టీసీ చొరవ.. రక్తదాన శిబిరాలు
నేడు 7 డిపోల్లో ఏర్పాట్లు
నల్గొండ గ్రామీణం, యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: అత్యవసర వైద్య సమయంలో రక్తం అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి పక్షం రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి ఉంది. అదే గ్రూప్ రక్తం దొరక్క చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆపత్కాల సమయంలో రక్తం అందుబాటులో లేకపోతే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. ఇందుకు సహజంగా స్వచ్ఛంద సంస్థలు, బ్లడ్ బ్యాంకులు చేయూతనిస్తాయి. ఈసారి ప్రయాణికులను సురక్షింతంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాదు..రక్తం సేకరించి రోగులకు అందించి ప్రాణదాతలవుతామని ఆర్టీసీ ముందుకొచ్చింది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు రక్తదాన శిబిరాల ఏర్పాటు కార్యక్రమం చేపట్టారు. మంగ[ళవారం ఉదయం 9గంటల నుంచి ఒంటి గంట వరకు జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట డిపోల పరిధిలో జరుగుతుంది. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టి సిబ్బంది మాత్రమే కాకుండా యువత, ఆరోగ్యవంతులు, ప్రయాణికుల నుంచి రక్తాన్ని సేకరించేందుకు ఆయా డిపో మేనేజర్లు, అధికారులు పిలుపునిచ్చారు. ఇందుకోసం అనుభవజ్ఞలైన వైద్యులు, రెడ్‌క్రాస్ స్వచ్ఛంద సంస్థ సహకారాన్ని ఆర్టీసీ తీసుకుంటోంది. దేవరకొండ, నార్కట్‌పల్లి డిపోలో రక్తదానం శిబిరాలు నిర్వహించకపోవడం వల్ల వాళ్లంతా నల్గొండ డిపోలో చేపట్టే శిబిరాంలో పాల్గొనాలని అధికారులు తెలిపారు.
యువత, ప్రయాణికులు ముందుకు రావాలి
-రాజేంద్ర ప్రసాద్, ఆర్ఎం, నల్గొండ
రక్తం అందక పలువురు మృత్యువాత పడుతున్నారు. ప్రయాణికులను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది, ప్రయాణికులు, యువకులు ముందుకొచ్చి రక్త దానం చేయాలి. ప్రణాళిక ప్రకారం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందుకు అంతా సహకరించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.