యాదాద్రిలో ఉద్ఘాటన దిశగా పనులు
మందిర రూపంగా సిద్ధమవుతున్న దర్శన క్యూకాంప్లెక్స్
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి క్షేత్రాభివృద్ధి పనుల సంపూర్తికి యాడా ప్రత్యేక దృష్టి సారించింది. పంచనారసింహులు, రామలింగేశ్వరస్వామి ఆలయాల పునర్నిర్మాణం పనులు పూర్తయినందున ఉద్ఘాటన దిశగా మిగులు పనులను మూడునెలల్లో పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు. ఆలయ సన్నిధిలోని దర్శన వరసల నాలుగు అంతస్తుల సముదాయం మందిరంలా రూపొందించే పనులు కొనసాగుతున్నాయి. సదరు సముదాయంలో స్టీల్గ్రిల్స్తో వరసల ఏర్పాట్లు చేశారు. దైవ దర్శనం చేసుకొనేందుకు భక్తులు వేచి ఉండేలా మౌలిక వసతులతో తీర్చిదిద్దుతున్నారు. నడవలేని వారి కోసం మూడంతస్తుల్లో ఎస్కలేటర్లను బిగించే పనులను వేగవంతం చేశారు. సముదాయం ఆధ్యాత్మిక చింతన కలిగించే తరహాలో ఆలయ గోపురం, సాలహారాలతో తీర్చిదిద్దుతున్నారు. పునర్నిర్మితమైన ఆలయాలలో విద్యుద్దీకరణ పనుల సంపూర్తి చేసేందుకు తగు పనులను చేపట్టారు. ఆ క్రమంలో శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ చెంత ఏసీ దట్ ఏర్పాట్లకు తవ్వకాలు జరుగుతున్నాయి. ఆర్‌అండ్‌బీశాఖ ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. కొండపైన ఉత్తర దిశలో రక్షణగోడ, ఎదుట చదును చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాలినడకన వచ్చే వారి కోసం మెట్ల మార్గం నిర్మితమవుతోంది. వర్షం, మురుగు నీటి పారుదలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.