logo
Published : 02/12/2021 05:40 IST

మడిగెల్లో అక్రమాల పడగ

నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో మడిగెల నిర్వహణ అస్తవస్తంగా ఉంది. చాలాచోట్ల మున్సిపాల్టీలకు లీజు బకాయిలు చెల్లించడం లేదు. మరికొన్నిచోట్ల వ్యాపారస్థులు కోర్టుకు వెళ్లారు. కొత్తవారికి అవకాశమివ్వడం లేదు. పురపాలికలకు ఆదాయం రాని పరిస్థితి నెలకొంది. మిర్యాలగూడలో భవనం నిర్మించినా నేటికి ఖాళీగానే ఉంది. నల్గొండ జిల్లాలో పురపాలికల తీరుపై కథనం.


వీడని నిర్లక్ష్యం

చండూరు చౌరస్తాలోని పురపాలికకు చెందిన మడిగెలు

చండూరు, న్యూస్‌టుడే: చండూరు పురపాలిక పరిధిలో 21 మడిగెలు ఉన్నాయి. కొన్నింటికి 2011లో, మిగిలిన వాటికి 2021 మార్చిలో లీజు గడువు ముగిసింది. కానీ టెండర్లు వేసి బహిరంగ వేలం నిర్వహించటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. లీజుదారులు తమకే తిరిగి లీజు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత పురపాలిక వారు కౌంటర్‌ దాఖలు వేశారు. కానీ నేటి వరకు పురోగతి లేదు. 21 దుకాణాల్లో మూడు శిథిలావస్థకు చేరాయి. పొగ 18 దుకాణాలకు బహిరంగ మార్కెట్‌లో రూ.10 వేల నుంచి 12 వేల వరకు నెలకు అద్దె పలుకుతున్నాయి. పురపాలికకు రూ. 150 నుంచి 1500 లోపునే చెల్లిస్తున్నారు. కొందరు లీజుదారులే సొంతంగా దుకాణాలు నడుపుతుండగా మిగిలినవారు సబ్‌ లీజులకు ఇచ్చుకుంటు దర్జాగా అద్దె సొమ్ము అనుభవిస్తున్నారు. సగటున నెలకు రూ. 1.35 లక్షలు పురపాలిక ఆదాయానికి గండి పడుతోంది. వెంటనే వేలం వేయించాలని పురపాలికకు ఆదాయం వచ్చేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.      


మాయా బజార్‌..

మాయాబజార్‌లోని లీజు దుకాణాలు

దేవరకొండ, న్యూస్‌టుడే: దేవరకొండ పట్టణం మొదటగా మున్సిపాలిటిగా ఏర్పడింది. ఈక్రమంలో సుభాష్‌రోడ్డు ప్రధాన సెంటర్‌గా ఉన్న సమయంలో రాత్రికి రాత్రి వ్యాపారులు, పాలకవర్గం అండదండలతో మడిగలు నిర్మించుకున్నారు. రాత్రికి రాత్రి వెలిసినందున సుభాష్‌రోడ్డుకు మాయాబజార్‌గా పేరుపడింది. ప్రస్తుతం ఈ మాయాబజార్‌ రద్దీగా ఉండే వ్యాపారబజార్‌గా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఎంతో విలువైన వాణిజ్యదుకాణాల వివాదంకు తెరపడడం లేదు. దశాబ్దాలుగా ఖాళీ చేయకుండా, లీజు చెల్లించకుండా వ్యాపారులు తిష్ఠ వేశారు. దీంతో పురపాలిక ఆదాయానికి భారీగా గండిపడింది. ఏళ్ల తరబడి పురపాలిక అధికారులు లీజుదారులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో వారి వాణిజ్య వ్యాపారాలు సజావుగా, సాఫీగా సాగుతున్నాయి. లీజుకు కొనసాగుతున్న దుకాణాలు కొంతమంది వ్యాపారులు లీజు పేరిట విక్రయాలకు పాల్పడుతున్నారు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
 


అద్దె రాదు.. లీజు రద్దు కాదు

ప్రకాశంబజారులో పురపాలిక దుకాణ సముదాయం

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: నల్గొండ పట్టణంలో ప్రకాశం బజారు, ఇందిరా నగర్‌, వస్త్రలత బజారు, ప్రాంతంలో మున్సిపాలిటీకి చెందిన సుమారు 232 దుకాణాల లీజుల భాగోతం సమసిపోవడం లేదు. లీజుల రూపంలో రూ. 4 కోట్ల మేర నిధులు పురపాలికకు రావాల్సి ఉన్న లీజు దారులు చెల్లించడం లేదు. 2015లో లీజులు రద్దు చేసి తిరిగి కొత్తగా మడిగెల లీజుల టెండర్లు పిలవగా ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. వ్యాపారులు కోర్టును ఆశ్రయించడంతో లీజుల పునరుద్ధరణ అమలుకు నోచుకోవడం లేదు. దుకాణాల్లో తిష్ఠ వేసిన వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు అద్దెకు ఇస్తు రూ. లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. కానీ మున్సిపాలిటీకి చెల్లించాల్సిన లీజు బకాయిలు చెల్లించకుండా దుకాణాలు తమకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల మున్సిపాలిటీ అధికారులు సాహసం చేసి లీజుల అద్దె బకాయిలు వసూలు చేసేందుకు ప్రకాశం బజారులో కౌంటర్‌ ప్రారంభించిన  రెండు మూడు రోజులకే ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు అధికారులు కౌంటరు ఎత్తివేశారు.


ఆరేళ్లుగా వంద దుకాణాలు ఖాళీ

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: మిర్యాలగూడ పురపాలికలో పట్టణం నడిబొడ్డున నాగార్జున సాగర్‌ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఎన్టీఆర్‌ పురపాలిక దుకాణ సముదాయంలో మొదటి అంతస్తులో వంద దుకాణాలు ఆరేళ్ల క్రితం నూతనంగా నిర్మించగా, అద్దెలకు ఇవ్వకపోగా ఖాళీగా ఉంటున్న తీరు ఇది. అధికారుల మధ్య కొరవడిన సమన్వయంతో ప్రతినెల సుమారు రూ. కోటి ఆదాయం పురపాలిక నష్టపోతుంది. 2012లో పురపాలిక నిధులతో మొదటి అంతస్తులో వంద దుకాణాల నిర్మాణం ప్రారంభించారు. 2016 నాటికి నిర్మాణాలు పూర్తిచేయగా 2017లో ఒకసారి టెండర్లు పిలిచారు. సాధారణ మార్కెట్‌ ధరలకన్నా అద్ధెలు ఎక్కువగా ఉన్నాయనే సాకుతో టెండర్ల దాఖలుకు ఎవరు ముందుకు రాలేదు. వీటి ధరలను సవరించి మరోసారి టెండర్లు పిలిచే ప్రక్రియ నాలుగేళ్లు అవుతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ప్రైవేటుగా వ్యాపారాలు చేసుకునేందుకు మార్కెట్‌ ధరలకు సమానంగా అద్దెకు ఇస్తే నిరుద్యోగులు ఉపాధి పొందే అవకాశముంది.

ఒకేసారి వేలంపాట

చిట్యాల, న్యూస్‌టుడే: చిట్యాలలో పురపాలికలో  11 మడిగెలు ఉన్నాయి. మూడింటికి 2017లో, మిగిలిన వాటికి 2018 జూన్‌లో వేలం నిర్వహించారు. 2017లో వేలం నిర్వహించిన మడిగెలకు మూడేళ్లు, మిగిలిన వాటికి రెండేళ్లు కాలపరిమితి నిర్ణయించారు. కరోనాతో వ్యాపారం సాగక అద్దెల చెల్లింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికే మరోదఫా వేలం నిర్వహించాల్సి ఉంది. పాత బకాయిలు రెండు నెలల్లో వసూలు చేసి, కొత్తగా వేలం పాట నిర్వహించాలని యోచిస్తున్నామని కమిషనర్‌ ఎం.రాందుర్గారెడ్డి తెలిపారు.  
 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని