ఓటరు జాబితా సవరణ వేగవంతం
సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి
భువనగిరి, న్యూస్‌టుడే: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తుల స్వీకరణ, తొలగించాల్సిన పేర్లను పరిశీలించి జాబితా సవరణను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ ఆదేశించారు. ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఆయన దూరదృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్షించారు. 18ఏళ్లు నిండిన వారందరినీ ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయాలన్నారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో చనిపోయినవారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుంచి ఫారం-7 ద్వారా లేదా సుమోటోగా తీసుకొని తొలగించాలని ఆదేశించారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన గోదాములను ప్రతి నెలా తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.