logo
Published : 02 Dec 2021 06:03 IST

ఫిర్యాదులు గోప్యంగా.. ఆగడాలకు అడ్డుకట్ట

 క్యూఆర్‌ కోడ్‌తో తక్షణం ఫిర్యాదు చేసే అవకాశం

నాంపల్లి, నకిరేకల్‌, న్యూస్‌టుడే

రద్దీ ప్రదేశాలు, షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు, సినిమా హాళ్లు వంటి ప్రదేశాల్లో, ఒంటరిగా ప్రయాణించే మహిళలు, విద్యార్థినులపై ఆకతాయిల ప్రవర్తన మితిమీరుతోంది. ఇలాంటి వారిపై ఫిర్యాదు చేసేందుకు షీ టీం ‘క్యూఆర్‌ కోడ్‌’ విధానం సులువుగా ఉంటుంది.
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. ఇదంతా ఓ వైపు కాగా మరో వైపు మహిళలపై వేధింపులు, దాడులు, అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. వారి రక్షణకు ఎన్నో చట్టాలు అందుబాటులోకి తీసుకొచ్చినా ఫలితం ఆశించినంత ఉండటం లేదు. బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తుండటమే దీనికి కారణం. ఈ పరిస్థితులను దూరం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అమలు చేస్తోంది.

అంతర్జాల సాయంతో..
ఇంతకు ముందు చరవాణి నంబరుకు బాధితులు సమాచారం అందించేలా ‘షీ’టీం బృందాలు అవగాహన కల్పించాయి. అయితే ఫిర్యాదు చేసిన వారి వివరాలు బహిర్గతం అవడంతో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవల్సి వస్తోంది. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచేలా పోలీసు శాఖ అవకాశం కల్పించింది. ఇటీవల ‘షీ’ బృందం సేవలను మరింత సులభం, వేగవంతం చేసేందుకు వీలుగా క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రధాన కూడళ్లలో, బస్టాండ్లు, ఆర్టీసీ బస్సులు, సినిమా హాళ్లు, విద్యా సంస్థలు, ఇతరత్రా రద్దీ ప్రాంతాల్లో క్యూఆర్‌ కోడ్‌ తెలిసేలా గోడ ప్రతులు, ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

వివరాలు సమర్పించి..
స్మార్ట్‌ ఫోన్‌లో ఉండే క్యూఆర్‌ కోడ్‌ రీడర్‌ సహాయంతో బాధితులు ఫిర్యాదు చేయవచ్చు. కోడ్‌ స్కాన్‌ చేయగానే అనుసంధానం అవుతుంది. లింక్‌ ఓపెన్‌ చేయగానే ఫిర్యాదుదారు పేరు, అక్కడ ఉండే రిజిస్ట్రేషన్‌ ఫారంలో తమ వివరాలు, ఉన్న ప్రాంతం, సమస్య, తదితరాలు నమోదు చేయాలి. ఇలా అందిన ఫిర్యాదుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు షీ బృందం విభాగాలు అప్రమత్తం అవుతాయి.


బాధితులకు సత్వర సాయం : -ఆనందరెడ్డి, డీఎస్పీ, దేవరకొండ
బాధిత మహిళలు, విద్యార్థినులు పోలీసుల సహాయం పొందేలా క్యూఆర్‌ కోడ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాం. అవసరమైన సందర్భాల్లో దీన్ని వినియోగించుకోవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంటాయి. బాధితులకు సత్వర సహాయం అందించేలా షీ బృందం సభ్యులు కృషి చేస్తున్నారు.


విశేష స్పందన

క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ విధానం మంచి ఫలితాలిస్తోంది. నల్గొండ జిల్లాలో ఈ ఏడాది వచ్చిన 400 ఫిర్యాదుల్లో 60 ఫిర్యాదులు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా వచ్చినట్లు అధికారులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. కాగా మరింత మెరుగైన సేవల కోసం ఈ విధానంలో స్వల్ప మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు.  
 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని