logo
Published : 02/12/2021 06:13 IST

ఆరోగ్య కిట్లు కటకట

కొండమల్లేపల్లిలోని కేజీబీవీ పాఠశాల

కొండమల్లేపల్లి, మునగాల, న్యూస్‌టుడే: 14 ఏళ్లలోపు బాలికలకు ఉచిత విద్యనందించాలనే లక్ష్యంతో 2001లో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సర్వ శిక్ష అభియాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ఆయా రాష్ట్రాల భాగస్వామ్యం, సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం మన రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్‌ కింద కేజీబీవీలను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) నిర్వహిస్తోంది. నాలుగేళ్లుగా బాలికలందరికీ ఏడాదికి మూడు సార్లు ఆరోగ్య కిట్లను అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో సుధీర్ఘంగా మూతపడిన విద్యాలయాలు అక్టోబర్‌ 21న తెరుచుకున్నా.. నేటికీ ఆరోగ్య కిట్లను పంపిణీ కాలేదు. దీంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతి వస్తువూ ముఖ్యమే..
బాలికల ఆరోగ్యం దృష్ట్యా ప్రతి మూడు నెలలకోసారి కిట్లు అందించాలి. శానిటరీ న్యాప్‌కిన్స్‌తో పాటు వివిధ రకాల సామగ్రి పంపిణీ చేయాలి. ఏడాదిన్నర తర్వాత విద్యాలయాలు ప్రారంభమైనా ఆరోగ్యకిట్లపై చర్యలు కరవయ్యాయి. కిట్లలో స్నానం, దుస్తులు ఉతికే సబ్బులు మూడు చొప్పున, కేశ నూనె డబ్బా 1, షాంపూ, పౌడర్‌, టూత్‌పేస్ట్‌, దువ్వెన, జడ క్లిప్పులు, రబ్బర్లు, నుదిటి బొట్టు బిల్లలు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు విద్యాశాఖ నుంచి స్పందన లేదు. ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలతో పాటు 8 రాత పుస్తకాలు అందజేస్తామని విద్యాశాఖ ప్రకటించినా ఆ దిశగా చర్యలు కరవయ్యాయి. రాష్ట్రంలో ఆరోగ్య కిట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయనే నెపంతో ఈ విద్యా సంవత్సరం వాటి పంపిణీలో జాప్యం నెలకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే విద్యార్థినులకు ఆరోగ్యకిట్లు, విద్యాసామగ్రి త్వరితగతిన పంపిణీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.    


పంపిణీకి చర్యలు
- భిక్షపతి, డీఈవో, నల్గొండ

కస్తూర్బాల్లో ఆరోగ్య కిట్లు, పుస్తకాల పంపిణీ లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. సమస్యను ఉన్నతాధికారులకు విన్నవించాం. విద్యార్థినులు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని ఆయా పాఠశాలల నిర్వాహకులకు సూచించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వీలైనంత తొందరగా కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటాం.


ఇంటి నుంచే తెచ్చుకున్నాం
పిట్టల ఉమ, పదో తరగతి, కేజీబీవీ మునగాల

కరోనా కంటే ముందు విద్యాలయాల్లో సకాలంలో ఆరోగ్య కిట్లు అందజేసేవారు. ప్రస్తుతం పంపిణీ నిలిచిపోయింది. ప్రతినెలా తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి తెప్పించుకుంటున్నాం. ప్రభుత్వం స్పందించి కిట్లను అందజేయాలి.


అదనపు ఖర్చు
త్రివేణి, పదో తరగతి, కేజీబీవీ మునగాల.

ఆరోగ్య కిట్లు అందజేయకపోవడంతో అదనపు భారం పడుతుంది. పేద కుటుంబాల నుంచి వచ్చిన మాకు అది భారంగా మారుతుంది. అధికారులు స్పందించి కిట్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలి.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని