logo
Published : 02/12/2021 06:13 IST

తనువు వీడుతూ.. ఇంకొకరికి ఊపిరి!

 కర్నూల్‌ బాలికకు ఓ జీవన్మృతురాలు పునర్జన్మ


శస్త్రచికిత్సలో పాలుపంచుకున్న వైద్య బృందం.  (ఇన్‌సెట్‌) సుశీల

ఈనాడు, హైదరాబాద్‌, గుండాల, న్యూస్‌టుడే: కొవిడ్‌ అనంతర సమస్యలతో బాధపడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న బాలికకు జీవన్మృతురాలైన ఓ మహిళ నుంచి సేకరించిన ఊపిరితిత్తులు అమర్చి కొత్త జీవితం ప్రసాదించారు పంజాగుట్ట నిమ్స్‌ వైద్యులు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాలకు చెందిన ఎగ్గె సుశీల(47) సికింద్రాబాద్‌ తాడ్‌బండ్‌లో కుటుంబసభ్యులతో నివాసముంటున్నారు. స్థానికంగా చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. గత నెల 27న నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా ఆమెను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి హైటెక్‌సిటీ మెడికవర్‌కు తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు బ్రెయిన్‌డెడ్‌ (జీవన్మృతురాలు) అయినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ బృందం ఆమె కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించింది. వారు అంగీకరించడంతో ఆమె వద్ద నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించారు. ప్రాణాపాయ స్థితిలో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలిక(17)కు ఊపిరితిత్తులను అమర్చగా ఇతర అవయవాలను మరో రెండు ఆసపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కోసం కేటాయించినట్లు పీఆర్‌వో పవన్‌రెడ్డి పేర్కొన్నారు.

వారం రోజులే మిగిలాయనగా..
కర్నూలు జిల్లా నందవరానికి చెందిన బాలికకు కరోనా వచ్చింది. కోలుకున్న కొన్ని నెలల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. వైద్యుల్ని కలిస్తే ఊపిరితిత్తుల సమస్య ఉందని చెప్పారు. నగరానికి వచ్చి పరీక్షలు చేయించారు. ఇన్ఫెక్షన్‌ సోకిందని సాధ్యమైనంత త్వరగా ఊపిరితిత్తులు మార్చాలని చెప్పారు. దీంతో ఆగస్టు 9న జీవన్‌దాన్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. సెప్టెంబర్‌ నుంచి నిమ్స్‌లో వైద్యం పొందుతున్నారు. రోజు రోజుకు పరిస్థితి విషమిస్తుండడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు. అక్కడ రూ.20-30లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్తోమత లేక అవయవదాత కోసం ఎదురు చూశారు. మరో వారం రోజులు గడిస్తే పరిస్థితి చేయిదాటి పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో బాలికకు సరిపోయే ఊపిరితిత్తులు ఉన్నాయని దాత కూడా అంగీకరించారని చెప్పడంతో వారి తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

నిమ్స్‌లో తొలిసారి ఊపిరితిత్తుల మార్పిడి
నెలల ఎదురుచూపులు ఫలించి బుధవారం ఉదయం 7:40 గంటలకు మెడికవర్‌ నుంచి ఊపిరితిత్తులను తరలించి 7:51 గంటలకు నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత శస్త్రచికిత్స నిర్వహించారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఊపిరితిత్తుల మార్పిడి పంజాగుట్ట నిమ్స్‌ ఆసుపత్రిలోనే తొలిసారి నిర్వహించినట్లు కార్డియోథొరాసిక్‌ డాక్టర్‌ ఎ.అమరేశ్వరరావు తెలిపారు. అవయవమార్పిడి విజయవంతం అయిందని 7 గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇందులో వైద్య బృందం గోపాల్‌, కళాదార్‌, మధుసూదన్‌తోపాటు అనస్థీషియా వైద్యులు ప్రాచీ, నర్మదతోపాటు సాంకేతిక విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని