logo
Published : 03/12/2021 03:13 IST

సంక్షిప్త వార్తలు

మధ్యాహ్న భోజన నిధులు విడుదల

నల్గొండ విద్యావిభాగం: జిల్లాలో మధ్యాహ్నభోజనం పథకం సంబంధించి వంట ఖర్చులు, వంట సహాయకుల గౌరవ వేతనము నిధులు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిందని డీఈవో బి.భిక్షపతి ప్రకటనలో తెలిపారు. పథకం అమలవుతున్న పాఠశాలలకు బకాయిలు రూ.3,31,82,291, వంట సహాయకుల గౌరవ వేతనం రూ.32.47 లక్షలు ఎంఈవోలకు విడుదల చేసినట్లు ప్రకటించారు.


5న ఉచిత ప్రవేశ పరీక్ష

నల్గొండ విద్యావిభాగం: తెలంగాణ షెడ్యూల్డ్‌ కులాల స్టడీ సర్కిల్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఐదు నెలల ఫౌండేషన్‌ కోర్సుతో పాటు బ్యాంకింగ్‌, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ ఉచిత శిక్షణ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 5న నల్గొండలోని ఎన్జీ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి సంక్షేమాధికారి సల్మాభాను తెలిపారు.


ఉపాధ్యాయులకు శిక్షణ

నల్గొండ విద్యావిభాగం: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విలీన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు ఈనెల 6 నుంచి 18వ తేదీ వరకు రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు డీఈవో బి.భిక్షపతి తెలిపారు. పభుత్వం సమగ్ర శిక్షణ ద్వారా ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు(పాక్షిక వినికిడి, కంటిచూపు సమస్య) ఉన్న విద్యార్థులకు బోధించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

నల్గొండ విద్యావిభాగం: ప్రధానమంత్రి కౌశల్‌ కేంద్రం పథకం ద్వారా కస్టమర్‌కేర్‌ ఎగ్జిక్యూటివ్‌, టెలీకాలర్‌, టైపింగ్‌, కంప్యూటర్‌బేసిక్స్‌, కమ్యునికేషన్‌ స్కిల్స్‌ కోర్సులందు నిరుద్యోగ యువతి యువకులకు లార్నెట్‌ స్కిల్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పనాధికారి ఎన్‌.పద్మ తెలిపారు. 50 రోజుల పాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.


ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం

నల్గొండ నేరవిభాగం: ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ఉద్య్లోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. పట్టణ పరిధిలోని చర్లపల్లి ప్రాంతానికి చెందిన తులం సంతోశ్‌కు శాలిగౌరారం మండలం వల్లాకు చెందిన కాయగూరి రాఘవేందర్‌ మూడేళ్లక్రితం పరిచయం ఏర్పడింది. ఈయన ద్వారా హైదరాబాద్‌ సచివాలయంలో వీరాంజనేయులు పరిచయం అయ్యాడు. నల్గొండలోని ఎయిడెడ్‌ కళాశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని రెండేళ్ల క్రితం రూ.1.80 లక్షలు తీసుకుని ఉద్యోగం ఇప్పించక పోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఇతనితో పాటు మరికొంత మంది బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


స్వగ్రామంలో మదార్‌ గౌడ్‌ అంత్యక్రియలు

చిట్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన జనగాం మదార్‌గౌడ్‌(50) ఉపాధి నిమిత్తం మాలీ దేశానికి వెళ్లి ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దుబాయ్‌లో చికిత్స పొందుతూ నవంబర్‌ 21న మృతి చెందారు. పన్నెండు రోజుల అనంతరం గురువారం మదార్‌గౌడ్‌ మృతదేహం స్వగ్రామం ఊరుమడ్లకు చేరుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అంత్యక్రియల్లో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, సర్పంచి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సత్తయ్య పాల్గొన్నారు.


బాలభవన్‌లో సభ్యత్వం పెంచండి

సూర్యాపేట సాంస్కృతికం, న్యూస్‌టుడే: రెండేళ్లుగా బోసినపోయిన బాలభవన్‌లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయని జవహర్‌ బాలభవన్‌ డైరెక్టర్‌ ఉషారాణి అన్నారు. ‘స్థానికంగా ఉండే పాఠశాలలకు వెళ్లండి. బాలభవన్‌లలో సభ్యత్వాన్ని పెంచండి’ అని జిల్లాల బాలభవన్‌ అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. ఇది వరకు సూర్యాపేట, వనపర్తి, కరీంనగర్‌ జిల్లాల్లో ఉన్న బాలకేంద్రాలను ‘బాలభవన్‌’లుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా తెలంగాణ బాల కేంద్రం యూనియన్‌ అధ్యక్షురాలు బండి రాధాకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో ఆయా జిల్లాల బాలభవన్‌ల అధికారులు, సిబ్బంది నగరానికి వచ్చి బాలభవన్‌ సంచాలకురాలు ఉషారాణిని సత్కరించారు. సంచాలకురాలు మాట్లాడుతూ.. పిల్లలకు విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు పట్ల సమగ్ర అవగాహన కల్పించడం, లలితకళల్లో శిక్షణ పొందే అద్భుతమైన వేదికలుగా బాలభవన్‌లను తీర్చిదిద్దాలన్నారు. ఇప్పుడు ఉదయం 10:30 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు బాలభవన్‌లు పని చేస్తాయన్నారు. అనంతరం బండి రాధాకృష్ణరెడ్డి మాట్లాడుతూ.. తమ విన్నపాలను మన్నించి బాల కేంద్రాలను బాలభవన్‌లుగా అప్‌గ్రేడ్‌ చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బాలభవన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌(అడ్మిన్‌) రామచందర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి, డి.ధనలక్ష్మి, పీటీఐ కె.జ్యోతి, చిత్రకళాకారుడు కిషన్‌, లైబ్రేరియన్‌ వరలక్ష్మీలతో పాటు సూర్యాపేట, వనపర్తి, కరీంనగర్‌ జిల్లాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


టీకా తప్పక తీసుకోవాల్సిందే

సూర్యాపేట(మహాత్మాగాంధీరోడ్డు): జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసుల కొవిడ్‌టీకా తీసుకోవాలని డీఈవో అశోక్‌ గురువారం ప్రకటించారు. రెండు డోసుల టీకా తీసుకోనివారి జాబితాను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు.


రాష్ట్రస్థాయి ఎంపికకు క్రీడాపోటీలు  

భువనగిరి నేరవిభాగం: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ నెల 6, 7న బాల, బాలికలకు హాకీ, అథ్లెటిక్స్‌, అర్చరీ క్రీడాపోటీల్లో రాష్ట్ర స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ధనంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 12 నుంచి 18 ఏళ్ల ఆస్తిక గల బాలబాలికలు ఆయా క్రీడా అంశాల్లో ఎంపిక పోట్లీల్లో పాల్గొనవచ్చన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని