logo
Published : 03/12/2021 03:13 IST

క్రైం వార్తలు

ఆటాడుకుంటూనే అనంతలోకానికి

పాము కాటుతో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

మేళ్లచెరువు, న్యూస్‌టుడే: సాయంత్రం వేళ ఇంటి ముందు ఆటలాడుకుంటున్న చిన్నారి పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన మేళ్లచెరువు మండల పరిధిలోని వెల్లటూరులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండా పున్నారెడ్డి కూతురు పావని (7) సాయంత్రం పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత ఎప్పటిమాదిరిగానే ఇంటి ముందు ఆటలాడుకుంటోంది. రాత్రి ఏడు గంటల సమయంలో తన కాలికి ఏదో కుట్టినట్టు అన్పించడంతో  తాత వద్దకు వెళ్లి చెప్పింది. అతను వెంటనే వచ్చి ఆ ప్రాంతంలో వెతికినా ఏమి కన్పించలేదు. దీంతో పురుగు కుట్టి ఉంటుందని భావించారు. మరికొద్ది నిమిషాల వ్యవధిలోనే పాప నోటి నుంచి నురగ వస్తుండడంతో భయపడ్డారు. ఇది పాము కాటే అని భావించి హుటాహుటిన మేళ్లచెరువులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే హుజూర్‌నగర్‌కు తరలించారు. చికిత్స అందిస్తుండగానే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అప్పటివరకు కళ్ల ముందు ఆడుతూ పాడుతూ ఉన్న తమ కన్నకూతురు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోవడంతో వారి హృదయాలు తల్లడిల్లాయి.


నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడి దుర్మరణం

పాలకవీడు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం చెరువు తండాలో గురువారం చోటుచేసుకొంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. తండాకు చెందిన బాణావత్‌ వెంకటేశ్వర్లు, శాంతి దంపతులు. వీరికి తన్విశ్‌ (6) హనుమంతు (4) సంతానం. వ్యవసాయమే జీవనాధారం. వారు గురువారం పిల్లలిద్దరినీ ఇంట్లో వదిలి వ్యవసాయ పనులకు వెళ్లారు. వారి బాబోగులు చూసుకునేందుకు వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు ఉన్నారు. చిన్నారి హనుమంతు ఇంట్లో ఆడుకుంటూ ఆవరణలోకి వెళ్ల్లి ప్రమాదశాత్తూ సంపులో పడిపోయాడు. ఇంట్లో పెద్దలు ఈ విషయాన్ని గమనించలేదు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు బాబు కోసం పరిసరాలలో వెతికారు. అయినా కనిపించకపోవడంతో అనుమానంతో సంపులో చూడటంతో చిన్నారి విగతజీవిగా కనిపించాడు. బాబును వెలికితీసి హుటాహుటీనా వైద్యశాలకు తరలించారు. అప్పటికే శ్వాస ఆడక మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎటువంటి పిర్యాదు అందలేదని స్థానిక ఎస్సై సైదులుగౌడ్‌ తెలిపారు.


కౌన్సిలర్‌పై ఆర్డీవో, ఏసీపీకి ఫిర్యాదు

భువనగిరి నేరవిభాగం: వారసత్వంగా వచ్చిన ఉమ్మడి భూమిని సమానంగా ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని చెప్పి తమకు అన్యాయం చేసి మోసం చేశారని భువనగిరి పురపాలిక పరిధిలోని 11వ వార్డు కౌన్సిలర్‌ జిట్టా వేణుగోపాల్‌రెడ్డిపై ఆయన పాలివారు జిట్టా బాల్‌రెడ్డి తదితరులు భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డికి ఆయా కార్యాలయాల్లో బుధవారం వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. బొమ్మయిపల్లి పరిధిలో వివిధ సర్వే నెంబర్లలో ఉన్న 15 ఎకరాల భూమిని ధరణి పోర్టల్‌ ద్వారా సమానంగా రిజిస్ట్రేషన్‌ చేయిస్తాని చెప్పడంతో తాము నమ్మి అతను చెప్పినచోట సంతక చేశామని,00 తీరా డ్యాంకుమెంట్లు వచ్చిన తర్వాత విలువైన భూమి అనూకూలంగా వేణుగోపాల్‌రెడ్డి తన పేరు చేయించుకున్నారనిపేర్కొన్నారు. జిట్టా సంజీవరెడ్డి, జిట్టా భరత్‌రెడ్డి ఫిర్యాదు అందజేసిన వారిలో ఉన్నారు.


నకిలీ విత్తనాల విక్రేతపై పీడీయాక్టు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: ఈ ఏడాది జూన్‌ నెలలో నకిలీ పత్తి విత్తనాలు అమ్మకాలు చేస్తూ పట్టుబడిన యేనుబోతు శ్రీనివాస్‌రెడ్డిపై పీడీయాక్టు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ బోయినపల్లి ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కొంత కాలంగా నైరుతి సీడ్స్‌ పేరుతో పత్తివిత్తనాల విక్రయాల వ్యాపారం చేస్తున్నాడు. వివిధ కంపెనీల నుంచి రిజక్ట్‌ అయిన విత్తనాలు సేకరించి నకిలీ లేబుల్‌తో విత్తనాల ప్యాకెట్లు తయారు చేసి తక్కువ ధర పేరుతో అమాయక రైతులకు అంటగడుతున్నాడు. పోలీసుల తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడినా అతడిలో ఎలాంటి మార్పు రాక పోవడంతో రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి రిమాండ్‌కు పంపారు. ఇతడిపై నల్గొండ, చండూర్‌, దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లలో మూడు కేసులు నమోదయ్యాయి. జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశాలతో గురువారం శ్రీనివాస్‌రెడ్డిపై పీడీయాక్టు కేసు నమోదు చేసి హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు సీఐ చెప్పారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని