రోడ్డెక్కిన కేజీబీవీ విద్యార్థినులు
మౌలిక వసతులు కల్పించాలంటూ ఆందోళన
సూర్యాపేట జిల్లా మద్దిరాలలో ధర్నా చేస్తున్న కేజీబీవీ విద్యార్థినులు
మద్దిరాల, న్యూస్టుడే: నాలుగేళ్లుగా వసతులు కల్పించాలంటూ వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) సమస్యలకు నిలయమైందంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 7 గంటలకు గ్యాస్ లీకై పాఠశాల ఆవరణంతా విస్తరించిందని, ఉపాధ్యాయురాలు అప్రమత్తమై విద్యుత్తు సరఫరా నిలిపేయకపోతే పెనుప్రమాదం సంభవించేదని విద్యార్థినులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రత్యేకాధికారిణి(ఎస్వో) తేజశ్రీకి వివరించగా తేలిగ్గా తీసుకోమని నిర్లక్ష్యంగా బదులిచ్చారని వాపోయారు. పాఠశాలలో 180 మంది బాలికలకు కేవలం నాలుగు గదులే ఉన్నాయని, ఒక్కో గదిలో సుమారు 50 మంది నిద్రించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందించడంలేదని, మంచినీరు, మరుగుదొడ్ల నిర్వహణ సరిగ్గా లేదన్నారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం ప్రారంభం కావడంతో చెట్ల కిందే పాఠాలు వినాల్సి వస్తుందని తెలిపారు. కలెక్టర్ స్పందించి సమస్యలు పరిష్కరించాలంటూ సుమారు మూడు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని తహసీల్దారు మన్నన్ హామీ ఇవ్వటంతో శాంతించారు. అనంతరం ఆర్డీవో రాజేంద్రకుమార్ విద్యాలయానికి చేరుకుని వంటకాలను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని జీసీడీవో రమణను ఆదేశించారు. నూతన భవనం పూర్తయ్యే వరకు మరో భవనాన్ని వెతుకుతున్నామని తెలిపారు.