logo
Published : 03/12/2021 03:13 IST

ఆరుతడికే జలసవ్వడి

ఈనాడు, నల్గొండ: యాసంగిలో ఉమ్మడి జిల్లాలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని జలవనరుల శాఖ ప్రతిపాదించింది. నాగార్జునసాగర్‌, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)ల కింద ఏడున్నర లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకే నీళ్లివ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సాగర్‌ ఎడమ కాల్వ కింద ఉమ్మడి జిల్లాలో దాదాపు 3.8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. మిగితాది ఖమ్మం జిల్లాలో ఉంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం ఆయకట్టులో మొదటి మేజర్ల కింద ఉన్న 1.5 లక్షల ఎకరాలకే వరిసాగుకు నీళ్లివ్వాలని ప్రతిపాదించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరి సాగుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసినందునా.. ఆయకట్టులోనూ రైతులు ఆరుతడి పంటల సాగునే ప్రోత్సహించేలా చూడాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. ఆరుతడి పంటలకే సాగునీరు అందిస్తామని వారు క్షేత్రస్థాయిలో వెల్లడిస్తున్నారు. మరోవైపు 2.2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న ఏఎమ్మార్పీ కింద పూర్తిస్థాయిలో ఆరుతడి పంటలకే సాగునీరివ్వాలని అధికారులు సిఫార్సు చేస్తున్నారు. ప్రాజెక్టు కింద ఏటా ప్రత్యక్షంగా 2.2 లక్షల ఎకరాల్లో వరితో పాటు పరోక్షంగా మరో 30 వేల ఎకరాల్లో పంటలు పండేవి. ఈ దఫా మొత్తం ఆరుతడి పంటలే వేయాలని ఆదేశించడంతో కాల్వ నిండుగా పారితే ఆ నీళ్లతో ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లుందని రైతులు బెంగపడుతున్నారు. మూసీ కింద 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా... ఇందులో రెండు వేల ఎకరాల్లో మాత్రమే మాగాణి పంటలకు నీళ్లివ్వనున్నారు. మిగితా 28 వేల ఎకరాల్లో మెట్ట పంటలకే సాగునీరు అందనుంది. డిండి ప్రాజెక్టు కింద 12,500 ఎకరాల్లో సుమారు 5000 ఎకరాలకు మాగాణి పంటలకు నీరిచ్చే అవకాశముందని తెలిసింది. మిగితా ఆయకట్టు అంతా ఆరుతడి పంటలే వేయాలని రైతులకు అధికారులు నచ్చజెబుతున్నారు.

రెండు లక్షల ఎకరాల్లోనే వరి
రాష్ట్రంలో అత్యధిక సాగుభూమి, అత్యధిక విస్తీర్ణంలో వరి సాగవుతోంది ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే. గతేడాది యాసంగిలో వివిధ ప్రాజెక్టుల కింద దాదాపు 10.5 లక్షల ఎకరాలకు ప్రభుత్వం సాగునీరు అందించింది. బోరు, బావుల కింద సాగైన విస్తీర్ణం దీనికి అదనం. ఈ ఏడాది మారిన పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు, బోరు, బావుల కింద సుమారు రెండు లక్షల ఎకరాల్లోనే వరి సాగు చేయాలని అధికారులు రైతులను ఆదేశిస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు కింద 1.5 లక్షల ఎకరాలు, శ్రీరాంసాగర్‌ రెండో దశ (ఎస్సారెస్పీ స్టేజ్‌ - 2) కింద ఉన్న 50 వేల ఎకరాల విస్తీర్ణంలో అంతా ఆరుతడి పంటలే వేయాలని, అయితేనే నీళ్లందిస్తామని అధికారులు, రైతులకు తేల్చిచెబుతున్నారు.

ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవడంతో నాగార్జునసాగర్‌, మూసీ, డిండి, పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నాగార్జునసాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా...ప్రస్తుతం 588.5 అడుగులతో (307 టీఎంసీలు) ఉంది. డెడ్‌ స్టోరేజీ పోనూ రెండు రాష్ట్రాలకు కలిపి ఇంకా 160 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. కుడి కాల్వ, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు పోనూ ఎడమ కాల్వ కింద దాదాపు 60 టీఎంసీలు యాసంగి సాగుకు ఇవ్వొచ్చు. ప్రభుత్వ నిర్ణయంతో ఇందులో ఆరుతడి పంటలకు సగం మాత్రమే విడుదల చేసే అవకాశముందని సమాచారం. మూసీ, డిండి, ఏఎమ్మార్పీ ప్రాజెక్టుల్లో సాగునీరు అందుబాటులో ఉన్నా ఆరుతడి పంటలే వేయాల్సి రావడంతో ఆయకట్టు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాధ్యాసాధ్యాలపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. రైతులు సన్నరకం ధాన్యం సాగు చేస్తే దానిని మిల్లర్లకు అమ్మిచ్చే బాధ్యత తమదని మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేలు భాస్కర్‌రెడ్డి, సైదిరెడ్డి రైతులకు భరోసానిస్తున్నారు. బోరు, బావుల కింద వరి సాగు చేసే రైతుల పరిస్థితి ఏంటని మిగితా అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఈ వానాకాలంలో ఉమ్మడి జిల్లాలో 9.7 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా...యాసంగిలో దానిని రెండు లక్షల ఎకరాలకే పరిమితం చేయాలన్న అధికారుల లక్ష్యం ఏ మేరకు ఫలిస్తుందో మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని