logo
Published : 04/12/2021 04:54 IST

పట్టాఫట్‌గా ఆక్రమణలు

దేవరకొండ వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం

దేవరకొండ, న్యూస్‌టుడే


సర్వే నం.755లోని వక్ఫ్‌భూమిలో వెలిసిన నిర్మాణాలు

రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన దేవరకొండ పట్టణ దినదినాభివృద్ధితో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో వక్ఫ్‌భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పట్టా నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. అయినా రెవెన్యూ, పురపాలిక, వక్ఫ్‌బోర్డ్‌ అధికారులు చోద్యం చూస్తున్నారు.

ఫలహారంగా ఆ సర్వే నెంబర్లు

దేవరకొండ పురపాలికలో అత్యధిక విలువైన వక్ఫ్‌భూములు మహబూబ్‌నగర్‌రోడ్డులోనే ఆవరించి ఉన్నాయి. సర్వే నం.753లో 12.20 ఎకరాలు, సర్వే నం.755లో 9.30 ఎకరాలు, 759లో 2.11 ఎకరాలు ఉంది. నిజాం కాలంలో మసీదుల నిర్వహణ, మతపరమైన వేడుకలు, పండుగలు జరుపుకొనేందుకు ఈ భూములను వక్ఫ్‌బోర్డుకు అప్పగించారు. కాగా బోర్డుకు సంబంధించిన వారు అతీగతి లేకపోవడంతో భూములు ఇష్టమొచ్చినట్లు వారసులమంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆక్రమించుకుంటున్నారు. ఈ సర్వే నంబర్లలో పక్కనున్న పట్టా భూమి సర్వే నంబర్లతో వాటిని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. వక్ఫ్‌భూమి సర్వే నం.755 అనేక మంది నిర్మాణాలు చేపట్టి పక్కనున్న పట్టా భూమి 754 సర్వే నంబర్‌ అక్రమార్కులు అడ్డగోలుగా వేసి రిజిస్ట్రేషన్లు చేయడంతో 2.23 ఎకరాలు ఉన్న పట్టా భూమి కాస్తా 10 ఎకరాలకు పైగా మిరచిపోయింది. పట్టణంలో సర్వే నంబర్‌ 753 వక్ఫ్‌భూమి 12.20 ఎకరాలకుగాను పక్కనున్న పట్టా భూమి 751 సర్వే నంబర్‌లో 17.30 ఎకరాలుండగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడంతో అది కాస్తా 25 ఎకరాలకు చేరింది. అలాగే నాయినోనికుంట సమీపంలో 756 సర్వే నంబర్‌లో 4.12 ఎకరాలు ఉండగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడంలో పది ఎకరాలకు చేరుకుంది.

టీ చల్లి.. పాతపేపర్లుగా తయారుచేసి..

దేవరకొండ మండల రెవెన్యూ అధికారుల తాజా లెక్కల ప్రకారం మండలంలో వక్ఫ్‌భూములు 168.37 ఎకరాలున్నాయి. 144.7 ఎకరాలు దేవరకొండ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. అయితే పట్టణాల్లో ఉన్న 144.7 ఎకరాలు 90 శాతానికిపైగా కబ్జాకు గురయ్యాయి. హైదరాబాద్‌, నల్గొండ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో బాండ్లను కొనుగోలు చేసి వాటిపైన మగ్థుంబాబా దర్గాకు సంబంధించిన ముతవల్లీలు నిజాముద్దీన్‌ వారసులం తామేనని పేర్కొంటూ ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తున్నారు. ఇవి ఏనాడో రాసినవిగా కనిపించేట్లుగా వీటిపై టీ చల్లి ఆరబెడతారు. అనంతరం దళారులు.. తామే మగ్థుంబాబాదర్గా వారసులుగా పేర్కొంటూ సర్వే నెం.755లో నిర్మాణాలు చేపడుతున్నారు. వీటితో పాటు ఇతరులు ఎవరైనా గతంలో ఇళ్లు నిర్మించుకున్న వారి వద్దకు వెళ్లి నకిలీ ధ్రువీకరణ పత్రాలు వారి వద్ద ఉంచుతారు. తామే అసలైన వారసులమని తమకే వక్ఫ్‌భూముల లావాదేవీలు చెల్లించాలని భయాందోళన కలిగిస్తారు. వీటికి తోడు దేవరకొండ పురపాలికలో తప్పుడు యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు, తప్పుడు సర్వే రిపోర్టులు జారీ చేస్తుండడంతో వాటిని రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో చూపడంతో రిజిస్ట్రేషన్‌ అధికారులు కాస్తా ఆదాయం కోసం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.


టాస్క్‌ఫోర్స్‌ బృందం పరిశీలిస్తుంది

- వెంకటయ్య, పురపాలిక కమిషనర్‌

దేవరకొండ పట్టణంలో చాలాకాలంగా వక్ఫ్‌భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతమైనట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపైన పూర్తిగా టాస్క్‌ఫోర్స్‌ బృందం పరిశీలిస్తుంది. ఈ బృందంలో ఆర్డీవో, డీఎస్పీ, తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఆర్‌అండ్‌బీ ఎక్కడ ఫిర్యాదు వస్తే అక్కడ విచారణ నిర్వహిస్తారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని