logo
Published : 04/12/2021 04:54 IST

ప్రమాదవశాత్తూ బావిలో మునిగి దివ్యాంగుడు దుర్మరణం

మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

పాలకవీడు గ్రామీణం, న్యూస్‌టుడే: వ్యవసాయ బావిలో విద్యుత్తు మోటారు వెలికితీయడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం పాలకవీడులో చోటుచేసుకొంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని మేకల కృష్ణయ్య తన వ్యవసాయ బావిలో పడిన విద్యుత్తు మోటారును తీయడానికి అదే గ్రామానికి చెందిన కొమర కోటయ్య(53) కూలీకి పిలిచాడు. మోటారును నీళ్లలోంచి తీసేందుకు బావిలో మునిగిన కోటయ్య పది నిమిషాల వరకు బయటకు రాలేదు. దీంతో ఆందోళనకు గురైన రైతు కృష్ణయ్య గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు గజ ఈతగాడి సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. రోజు మాదిరిగా పనికి బయటకువెళ్లిన కోటయ్య విగతజీవిగా కన్పించటంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. మృతుడు పుట్టు మూగ, వినికిడి లోపం కలిగిన దివ్యాంగుడు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. మూడేండ్ల క్రితం కూతురుకి వివాహం చేశాడు. ప్రస్తుతం గ్రామంలో ఒంటరిగా జీవనం సాగిస్తూ కూలీ పనులకు జీవనం సాగిస్తున్నాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. మృతుని అన్న కుమారుడు వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదులుగౌడ్‌ తెలిపారు.


రోడ్డుప్రమాదంలో ఒకరు..

పెద్దఅడిశర్లపల్లి: ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొని ఎదురుగా వస్తున్న డీసీఎం కిందపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన పీఏపల్లి మండలం రంగారెడ్డిగూడెం స్టేజీ మస్కతిడైరీ సమీపంలో శుక్రవారం జరిగింది. గుడిపల్లి పోలీసుల వివరాల ప్రకారం.. త్రిపురారానికి చెందిన తాటికొండ సాంబశివ, తాటికొండ శేఖర్‌(24).. సాగర్‌ నుంచి ద్విచక్రవాహనంపై కొండమల్లేపల్లివైపు వెళ్తూ మార్గమధ్యంలో రంగారెడ్డిగూడెం స్టేజీ సమీపంలో ముందుకెళ్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొని ఇరువురు నడిరోడ్డుపై పడ్డారు. అదేసమయంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం శేఖర్‌ తలకు తగలడంతో తీవ్రగాయాలైన శేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఇతను త్రిపురారంలోని చికెన్‌ సెంటర్‌లో పనిచేసేవారు. ద్విచక్రవాహనం నడుపుతున్న సాంబశివకు తీవ్రగాయాలవగా నల్గొండకు తరలించారు. గుడిపల్లి ఎస్సై పి.వీరబాబు సిబ్బందితో చేరుకుని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ట్రాక్టర్‌ తగిలి మరొకరు..

త్రిపురారం, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన నన్నెబోయిన అంజయ్య(54).. దిగుమతి కోసం సత్యనారయణపురం గ్రామంలోని రఘరామరైసు మిల్లుకు గురువారం రాత్రి ట్రాక్టర్‌లో ధాన్యం తీసుకొచ్చారు. ట్రాక్టర్‌ను అంజయ్య బావమరిది సైదులు వెనకకు మళ్లిస్తున్న క్రమంలో వెనకాలున్న అంజయ్యకు తగిలింది. కుప్పకూలిన అతడిని మిల్లు యాజమాన్యం చికిత్స నిమిత్తం మిర్యాలగూడకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. అంజయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. ఈ మేరకు కేసుదర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అజయ్‌కుమార్‌ తెలిపారు.


మహిళ చెప్పుతో కొట్టిందనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

మోతె, న్యూస్‌టుడే: మహిళ చెప్పుతో కొట్టిందనే మనస్తాపంతో వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నవంబర్‌ 30 తేదీన జరగ్గా అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మోతె ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం నేరడవాయి గ్రామానికి చెందిన దారమల్ల ఉప్పయ్య (50) నవంబరు 30న వారికున్న రెండు గెదేలను మేపడానికి గోపతండా వైపు వెళ్లారు. అదే రోడ్డులో తండాకు చెందిన కొర్ర బుజ్జి వరి కల్లంలో గింజలను ఆరబెడుతున్నారు. గెదేలలో ఒకటి కల్లంలోకి వెళ్లి వరి ధాన్యాన్ని తిన్నది. ఈ విషయం గమనించిన గోపయ్య గెదేను పక్కకు తీసుకెళ్లాడు. ‘కల్లంలోకి గెదే వచ్చి గింజలు తింటుంటే కళ్లు కనపడటం లేదా అంటూ బుజ్జి ఆగ్రహంతో ఉపయ్య చెప్పుతో కొట్టింది. స్థానికులు వారిని వారించి గొడవను సద్దుమణింపజేశారు. గెదేలను మేపి సాయంత్రం ఇంటికి వెళ్లిన ఉప్పయ్య ఉదయం జరిగిన ఘటన గురించి కుటుంబ సభ్యులకు తెలిపారు. వెంటనే మనస్తాపంతో ఇంట్లోని పురుగు మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కొడుకు శ్రీను ఈ మేరకు ఫిర్యాదు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని