logo
Published : 05/12/2021 03:19 IST

సంక్షిప్త వార్తలు

కాపురాల గుట్ట అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ అనుమతి!

నీలగిరి: నల్గొండ పట్టణంలోని కాపురాల గుట్టను టూరిజం పార్కుగా అభివృద్ధి పర్చడానికి కేంద్ర పర్యాటక శాఖ తన విన్నపాన్ని స్వీకరించిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మానుమెంట్స్‌, సైట్స్‌ సభ్యులు ఆదోని వెంకటరమణారావు తెలిపారు. కాపురాల గుట్టపైన పద్మనాయక రాజ వంశస్తులు నిర్మించిన కోటను, శివాలయాన్ని పునరుద్ధరించి ఈకో టూరింజంగా అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి గుట్టను పరిశీలించి ఈకో టూరిజం అభివృద్ధికి కృషిచేస్తానని ప్రకటించారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి పత్రం ఇవ్వగా స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద పరిశీలనకు స్వీకరించామని తెలియజేస్తూ  కేంద్ర టూరిజం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ తనకు లేఖరాశారని తెలిపారు.


అధిక ఎరువుల వాడకంతో దెబ్బతింటున్న భూసారం

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: ఎరువులు అధికంగా వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని జిల్లా వ్యవసాయశాఖాధికారి జి.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ నేల ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నల్గొండ మండలం దండంపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భూసారాన్ని పెంచుకొని సేంద్రియ పద్ధతులు చేపట్టాలని, చెరువుమట్టి వేయడం, పెంటఎరువు, పచ్చిరొట్టపైరు, పచ్చిఆకుఎరువులు, జీవన ఎరువులు వాడటం వల్ల భూసారం పెరుగుతుందని వివరించారు. పంటలో అధిక దిగుబడి సాధించాలంటే భూమిలో అన్ని పోషక పదార్ధాలు సమపాళ్లలో అందాలని తెలిపారు. నత్రజని, భాస్వరం, పోటాషియం, ద్వితీయ శ్రేణి పోషక పదార్థాలైన సున్నం, మెగ్నీషియం, గందకం, సూక్ష్మ పోషక పదార్థాలు జింక్‌, రాగి, ఇనుము, మాంగనీసు, బోరాన్‌, క్లోరిన్‌ను పంటలకు అందించాలని తెలిపారు. ఏడీఏ హుస్సేన్‌బాబు, ఉద్యానవన శాఖాధికారి సంగీతలక్ష్మి, అధికారులు శాంతినిర్మల, సుమన్‌ రమన, కీర్తి, చంద్రకళ, హరిత, వీణ, వాసుదేవరెడ్డి, సురేష్‌గుప్త, తదితరులు పాల్గొన్నారు.


ఎస్సై కొట్టారంటూ వీడియో వైరల్‌  

ఈనాడు, నల్గొండ: నల్గొండ పురపాలిక పరిధిలోని అర్జాలబావిలో ఉన్న ఓ భూమి తగాదాలో జోక్యం చేసుకొని, తనను అకారణంగా కేసులో ఇరికించి నల్గొండ టూటౌన్‌ ఎస్సై నర్సింహులు దాడి చేశారని ఓ స్థిరాస్తి వ్యాపారి చెబుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. తనను అకారణంగా ఎస్సై కేసులో ఇరికించారని శ్రీనివాసులు అనే వ్యాపారి గత నెల 16న ఎస్పీకి ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రస్తుతం అంతర్గతంగా విచారణ సాగుతోంది. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటంపై సంబంధిత ఎస్సై నర్సింహులును ‘ఈనాడు’ సంప్రదించగా... నిబంధనల ప్రకారమే తామీ కేసులో వ్యవహరించామని వెల్లడించారు.


పోలీసుల అదుపులో ‘డిక్కీ’ దొంగలు

దేవరకొండ, న్యూస్‌టుడే: ఆదమరిచి ద్విచక్ర వాహనాల్లో డబ్బులు పెట్టి కార్యాలయం లోనికి గాని, బ్యాంకు లోపలికి గాని, ఇతర పనుల నిమిత్తం వాణిజ్య సముదాయాలకు వెళ్లినా ఆ డబ్బులు మాయం చేస్తున్నారు ఓ ముఠా సభ్యులు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఈ ముఠా సభ్యులను దేవరకొండ పోలీసులు పక్కా ప్రణాళికతో వల వేసి పట్టుకున్నారు. నవంబర్‌ 29న దేవరకొండ సబ్‌రిజిష్ట్రార్‌ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్‌ రైటర్‌ వద్ద పని చేసే శంకర్‌ రూ.70 వేలతో రిజిష్ట్రేషన్‌ డాక్యుమెంట్లకు సంబంధించిన చలాన్లు కట్టేందుకు బ్యాంకుకు బయల్దేరారు. బ్యాంకుకు వెళ్లే క్రమంలో శంకర్‌ ముందుగా దేవరకొండ పట్టణంలోని విష్ణు కాంప్లెక్స్‌ వద్దకు ఓ షాపుకు వెళ్లగా పసిగట్టిన ముఠా సభ్యులు డిక్కీలో ఉన్న డబ్బుల బ్యాగును తీసుకొని కల్వకుర్తి రోడ్డు వైపు వెళ్లారు. బాధితుడు దేవరకొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్‌ స్టేషన్‌లో సీసీ కెమెరాలో నిందితులను గుర్తించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని వీరి కోసం నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి జిల్లాలో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా తిరిగి ఆ ముఠా సభ్యులు మాటు వేసేందుకు దేవరకొండలోని స్టేట్‌ బ్యాంకు వద్దకు వచ్చారు. యథావిధిగా బాధితుడు శంకర్‌ మళ్లీ బ్యాంకుకు రావడంతో అప్పటికే అక్కడికి వచ్చిన డిక్కీ ముఠా సభ్యులను పసిగట్టి పోలీసులకు సమాచారం అందించడంతో ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.


రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక

నల్గొండ టౌన్‌: మహాత్మాగాంధీ యూనివర్సిటీ మాజీ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డా.దోమల రమేశ్‌ 2017-18 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి ఉత్తమ కో ఆర్డినేటర్‌గా ఎంపికయ్యారు. వర్సిటీ పరిధిలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని ఎన్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర అధికారులు శనివారం ఈ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా రమేశ్‌కు ఎంజీయూ వీసీ గోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ విష్ణుదేవ్‌, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.


నేడు కబడ్డీ క్రీడాకారుల ఎంపిక

మేళ్లచెరువు: జిల్లా కబడ్డీ అసోషియేసన్‌ ఆధ్వర్యంలో మేళ్లచెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం కబడ్డీ క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్టు అసోషియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నామ నర్సింహారావు తెలిపారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సబ్‌ జూనియర్‌ బాలబాలికల జిల్లా జట్టుకు వయసు 16 ఏళ్ల లోపు, 55 కేజీల బరువు గల వారు అర్హులని వివరించారు. ఆధార్‌ కార్డుతో హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు. అధ్యక్షుడు రామచందర్‌ గౌడ్‌, ఆర్గనైజరు నాగిరెడ్డి, సైదులు, సంధ్య, లక్ష్మీనారాయణ, సంతోష్‌, గోపి తదితరులు పాల్గొన్నారు.


ఏపీ నుంచి ధాన్యం రాకుండా నిఘా: ఏడీఏ

మఠంపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ధాన్యం ధర ఎక్కువగా ఉండడంతో ఏపీ నుంచి ఇక్కడకు తరలించే అవకాశం ఉందని దీనిని నిరోధించేందుకు వివిధ శాఖల సమన్వయంతో నిఘా ఏర్పాటు చేశామని హుజూర్‌నగర్‌ ఏడీఏ సంధ్యారాణి చెప్పారు. మట్టపల్లి వంతెన వద్ద ఉన్న తనిఖీ కేంద్రాన్ని శనివారం పరిశీలించి మాట్లాడారు. వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ, మార్కెటింగ్‌ శాఖల సిబ్బంది నిరంతరం లారీలు, ఇతర వాహనలు తనిఖీ చేస్తారని తెలిపారు.  అనంతరం పెదవీడులోని విత్తన దుకాణాన్ని తనిఖీ చేశారు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని డీలర్లను ఆదేశించారు. ఎంఏవో బుంగా రాజు, ఏఈవో ఝాన్సీ, పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


పారిశుద్ధ్య సిబ్బందికి చేనేత వస్త్రాలు

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని పురపాలిక సంఘాల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ఏకరూప దుస్తులుగా చేనేత వస్త్రాలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి నిర్ణయించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖాకీ రంగు ప్యాంటు, ఆకుపచ్చ రంగులో ‘ఇక్కత్‌’ డిజైను చేనేత వస్త్రంతో కుట్టిన అంగీలు సరఫరా చేయనున్నారు. కొయ్యలగూడెంలోని చేనేత మగ్గాలపై 5700 మీటర్ల వస్త్రం నేసి సరఫరా చేస్తున్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని