logo
Updated : 05/12/2021 10:57 IST

TS News: అమెరికాలో కంపెనీ పెట్టొచ్చి.. 11ఏళ్లు అనాథలా రోడ్లపై తిరిగి!

మానసిక వికలాంగురాలిగా భావించి అనాథాశ్రమంలో చేర్పించిన పోలీసులు

ప్రస్తుతం అనాథాశ్రమం సంరక్షణలో అరుణాకుమారి

ఉన్నత విద్యావంతురాలు.. ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తూ వందలాది మందికి విద్యాబుద్ధులు నేర్పారు.. 2009లో జరిగిన ఓ ఘటన ఆమెను మానసికంగా కుంగదీసింది.. ఉపాధ్యాయ వృత్తి, కుటుంబం, ఇంటిని వదిలేసి ఆమె వెళ్లిపోయారు.. రోడ్లపై తిరుగుతూ, ఎవరైనా ఇచ్చిన దాన్ని తింటూ ఎక్కడోచోట తలదాచుకున్నారు.. ఇలా ఒకట్రెండు రోజులు కాదు సుమారు పదకొండు ఏళ్లపాటు ఆమె ఇలాగే గడిపారు.. 2021 ఫిబ్రవరి 6న హైదరాబాద్‌ పాతబస్తీ (కుల్సుంపుర)లో వీధుల వెంట తిరుగుతున్న ఆమెను మతిస్తిమతం లేని మహిళగా అక్కడి పోలీసులు భావించారు.. రోడ్లపై సంచరిస్తున్న మరో 13 మంది మహిళలతో కలిసి ఆమెను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి చేర్చారు.. ఇక్కడ భోజనం, వసతి సౌకర్యం బాగుందనుకుందేమో అందుకే తన గతం గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు.. కానీ కట్టుకున్నవాడు, కన్నపిల్లలు ఎలా ఉన్నారోనని మదనపడుతూనే గడిపారు.. వారి గురించి ఆలోచిస్తూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ‘న్యూస్‌టుడే’తో బరువెక్కిన హృదయంతో ఆమె గతానుభవాలను పంచుకున్నారు..

- చౌటుప్పల్‌, న్యూస్‌టుడే

ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం సమీపంలోని ఆత్కూరుకు చెందిన అరుణకుమారి చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, నాగార్జునసాగర్‌లో బీఈడీ అభ్యసించారు. వరంగల్‌ జిల్లా పరకాలకు చెందిన సహాధ్యాయి శ్రీకాంత్‌తో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. తదనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అరుణకుమారి ఎంఏ చదవారు. వీరికి ప్రియాంక, మౌనిక అనే ఇద్దరు కుమార్తెలున్నారు. రంగారెడ్డి జిల్లా మర్రిపల్లిలో తొలి ఉపాధ్యాయురాలిగా అరుణకుమారి ఉద్యోగంలో చేరారు. పెద్దపెండ్యాల, రఘునాథపల్లి, ఖిలాసపూర్‌, జనగాం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేశారు. భర్త శ్రీకాంత్‌ సైతం తనతో పాటు జనగాంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా 1999 వరకు ఉండేవారు. ఆ తరువాత దీర్ఘకాలిక సెలవుపై అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లి ప్లానెట్‌ సాఫ్ట్‌ అనే కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేశారు. ఐదేళ్లు అక్కడే ఉండి 2004లో తిరిగొచ్చి జనగాంలోని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా ఆమె మళ్లీ విధుల్లో చేరారు. 2009లో అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఉపాధ్యాయ వృత్తి, కుటుంబానికి దూరమయ్యారు. 2019లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. 14 ఏళ్లుగా ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ పలు పుణ్యక్షేత్రాలు సందర్శించారు. ఒక రోజు చార్మినార్‌ ప్రాంతం నుంచి కాలినడకన వెళ్తుండగా ఆమె వేషధారణ చూసి, సరైన సమాధానాలు చెప్పకపోవడంతో మానసిక దివ్యాంగురాలిగా భావించి పోలీసులు అమ్మానాన్న అనాథాశ్రమంలో ‘సృష్టి’ పేరిట చేర్పించారు. పది నెలలుగా ఆశ్రమంలో ఆమె ధ్యానం సాధన చేస్తున్నారు. ఈమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం, ఆధారాలు లేనందున ఇక్కడే ఉన్నారని అనాథాశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్‌ చెప్పారు. అరుణాకుమారికి సంబంధించిన వారొ స్తే సంతోషంగా పంపిస్తామన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని