logo
Published : 05/12/2021 03:19 IST

రోశయ్య.. మిమ్ము మరువమయ్యా

ఈనాడు, నల్గొండ: ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాతో మాజీ సీఎం, మాజీ గవర్నర్‌ రోశయ్యతో విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడి నేతలతో సత్సంబంధాలు ఉండటంతో ఆయన ఉమ్మడి జిల్లాలో పలుమార్లు వివిధ హోదాల్లో పర్యటించారు. దేవరకొండ, మునుగోడు, నల్గొండ, నకిరేకల్‌ నియోజకవర్గాల్లోని 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందించే శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులు రోశయ్య ఆర్థికశాఖ మంత్రిగా ఉండగానే ప్రారంభమయ్యాయి. అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ ఆదేశాల మేరకు అధికారులు, అప్పటి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులైన జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పంపిన ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం లభించేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. 2009లో ముఖ్యమంత్రి పదవీ చేపట్టాక ఈ ప్రాజెక్టులో భాగమైన అతిపెద్ద సొరంగమార్గం తవ్వడానికి ఉపయోగిస్తున్న టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌కు రూ.500 కోట్ల వరకు నిధులు విడుదల చేసినట్లు సంబంధిత వర్గాలు ‘ఈనాడు’కు తెలిపాయి. ఆయన మృతిపై జిల్లా వ్యాప్తంగా పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు శనివారం నివాళి అర్పించారు. తాను మంత్రిగా ఉండగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో రోశయ్య రెండు సార్లు పర్యటించారని, నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రికి ఆయనే శంకుస్థాపన చేశారని, అనేక రహదారులకు నిధులు మంజూరు చేశారని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.


రూ.10 కోట్లతో విద్యుత్తు ఉపకేంద్రం ఆయన చలవే

దిర్శించర్లలో విద్యుత్తు ఉపకేంద్రం శంకుస్థాపన సభలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు గజమాలతో సత్కారం

నేరేడుచర్ల: మండలంలోని దిర్శించర్లలో రూ.10 కోట్ల వ్యయంతో 132/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం ఏర్పాటు చేయడం అప్పటి సీఎం రోశయ్య చలవతోనే సాధ్యమైంది. అప్పటి ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం రోశయ్య వద్ద ఉన్న చనువుతో ఉపకేంద్రానికి నిధులు మంజూరు చేయించి ఆయనతోనే 2010 మార్చిలో శంకుస్థాపన జరిపించారు. నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి మండలాలకు విద్యుత్తు అంతరాయాల సమస్య చాలా వరకు తగ్గింది.


చేనేత సమస్యలపై అధ్యయనం

చౌటుప్పల్‌లో చేనేత మహిళలతో మాట్లాడుతున్న రోశయ్య (పాతచిత్రం)

చౌటుప్పల్‌: తెదేపా ప్రభుత్వంలో చేనేత కార్మికుల సమస్యలపై కాంగ్రెస్‌ కమిటీ నల్గొండ జిల్లాలో 2001 మార్చి 6న మాజీ మంత్రి రోశయ్య నాయకత్వంలో పర్యటించింది. చౌటుప్పల్‌, కొయ్యలగూడెం, సిరిపురంలో చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను రోశయ్య తెలుసుకున్నారు. వారికి కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలబడి పోరాడుతుందని భరోసా ఇచ్చారు.


నారసింహుని క్షేత్రంలో..

యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి, భువనగిరి పట్టణం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో కొణిజేటి రోశయ్య 2010లో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. పంచనారసింహులను సందర్శించి, పూజలు నిర్వహించారు. పూజారులు, అధికారులతో ఆలయ అభివృద్ధిపై చర్చించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో ఆర్థికశాఖ మంత్రిగా పలుమార్లు రోశయ్య క్షేత్రాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు పొందారు. 1990లో కొండ కింద ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. భూదాన్‌పోచంపల్లి మండలంలోని దేశ్‌ముఖి గ్రామంలోని సాయిబృందానం క్షేత్రాన్ని 2010 డిసెంబరు 23న రోశయ్య సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వచ్చి వెళ్లిన వెంటనే ఆలయానికి రహదారి వేయించారని నిర్వాహకులు గుర్తుచేశారు. భువనగిరి పట్టణంలో  2016లో తమిళనాడు గవర్నర్‌ హోదాలో పట్టణ శివారులో మహాచండీ యాగం, కార్తిక వనభోజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


ప్రముఖుల నివాళి

విలువలకు మారుపేరు

ప్రస్తుత రాజకీయాల్లో విలువలకు మారుపేరు రోశయ్య. ఆయన మరణం ఏపీకే కాకుండా తెలుగు రాష్ట్రాలకూ తీరని లోటు. ఆర్థిక క్రమశిక్షణలో ఆయన అనేక మందికి మార్గదర్శకంగా నిలిచారు. ప్రత్యర్థులను సైతం ఆయన పలకరింపుతో ఆకట్టుకునేవారు.

- జగదీశ్‌రెడ్డి, ఇంధనశాఖ మంత్రి

గొప్ప వక్త

శాసనసభ, మండలిలో అనేక చర్చల్లో పాల్గొని తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్న గొప్ప వక్త రోశయ్య. నేటి తరం నాయకులకు ఆయన జీవితం ఆదర్శం. వారి కుటుంబానికి మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.

- సుఖేందర్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు

సౌమ్యుడు, సహనశీలి

మ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అత్యంత సౌమ్యుడు, సహనశీలి రోశయ్య. ఏ పార్టీ వారు ఆయనదగ్గరికెళ్లిన సహనంతో సమాధానాలు చెప్పేవారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శం

- లింగయ్య యాదవ్‌, ఎంపీ, రాజ్యసభ

గొప్ప ఆర్థిక కోవిదుడు

ర్థిక మంత్రిగా దాదాపు 20 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన గొప్ప ఆర్థిక కోవిదుడు రోశయ్య. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం. వారి కుటుంబానికి మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.

- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ, భువనగిరి

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని