logo

జీవన్మృతులు.. ప్రాణదాతలు

మనిషి ప్రాణాన్ని సృష్టిలో వెలకట్టలేం. రూ. కోట్లు ఖర్చు చేసినా చనిపోయిన వ్యక్తిని బతికించుకోలేం. కానీ.. మరణించిన వ్యక్తి అవయవాలను దానం చేయడం వల్ల మరొకరికి కొత్త జీవితం ఇవ్వడంతో పాటు వారి కుటుంబంలో

Published : 05 Dec 2021 03:19 IST

పుట్టెడు దుఃఖంలో ఉన్నా మరొకరి జీవితాల్లో వెలుగులు
మునుగోడు, నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే

మనిషి ప్రాణాన్ని సృష్టిలో వెలకట్టలేం. రూ. కోట్లు ఖర్చు చేసినా చనిపోయిన వ్యక్తిని బతికించుకోలేం. కానీ.. మరణించిన వ్యక్తి అవయవాలను దానం చేయడం వల్ల మరొకరికి కొత్త జీవితం ఇవ్వడంతో పాటు వారి కుటుంబంలో వెలుగులు నింపే అవకాశం ఉంటుంది. అంత విలువైన మనిషి అవయవాలను చనిపోయాక మట్టిలో కలిపే కంటే మరొకరికి దానం చేస్తే చిరస్థాయిగా నిలిచిపోతారు. అనుకోని ఘటనలో మనిషి మరణించిన అతడి కళ్లు మాత్రం మరొకరికి లోకాన్ని చూపిస్తాయి. మూత్రపిండాలు మరణానికి దగ్గర్లో ఉన్న ప్రాణాలకు జీవం పోస్తాయి. హృదయం ఇంకొకరి ప్రాణాలను రక్షిస్తుంది. ఇలా మరణించిన మనిషి అవయవ భాగాలు దానం చేస్తే ఇతరులకు ప్రాణదాతలుగా మిగిలిపోతారు. అంతేకాకుండా బతికిన మనిషిలో చనిపోయిన వారి అవయవాలు సజీవంగా ఉండిపోతాయి. ఇలాంటి కోణంలోనే వివిధ కారణాలతో మరణించిన వారి అవయవాలను దానం చేయించేందుకు పెద్ద మనస్సుతో ముందుకొచ్చిన కొందరి కుటుంబ సభ్యుల మనవీయ దృక్ఫథం చూసి మరెందరికో ఆదర్శంగా నిలిచారు.


మరొకరికి వెలుగులు నింపిన మారయ్య...

సింగారంలో మృతిచెందిన మారయ్య నేత్రాలను తీస్తున్న వైద్యులు(పాతచిత్రం)

మునుగోడు మండలం సింగారం గ్రామ వీఆర్‌ఏ ఇండ్ల మారయ్య అనారోగ్యంతో బాధపడుతూ 2016లో మృతిచెందారు. తండ్రి చనిపోయిన బాధతో పుట్టెడు దుఃఖంలో ఉన్న అతని చూపు మరొకరికి వెలుగులు నింపాలని ఆలోచనతో నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రి వైద్యులకు సమాచారం అందించి నేత్రదానం చేయించారు. బతికినంత కాలం ప్రజలకు నిత్యం సేవా చేయాలనే ఆలోచన మా తండ్రికి బాగా ఉండేదని అందుకే నేత్ర దానం చేయించమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.


పోరాట యోధుడు...చిరస్మరణీయుడు

మునుగోడు మండల సింగారం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు వందేళ్లకుపైగా వయస్సున్న ఇండ్ల రామస్వామి నాలుగేళ్ల క్రితం మరణించారు. అతనూ రజకార్లకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలకు కీలక పాత్ర పోషించి గొప్ప పోరాట యోధుడిగా నిలిచిన రామస్వామి మరణించిన తర్వాత కూడా మరొకరికి చూపునిచ్చి చిరస్మరణీయుడిగా నిలిచారు. అంతేకాకుండా రామస్వామి బతికున్నప్పుడే అతడి భార్య రాములమ్మ ఆయన కంటే ఏడాది ముందు చనిపోయింది. దీంతో రామస్వామి స్వయంగా కామినేని ఆసుపత్రి వారికి సమాచారం అందించి రాములమ్మ నేత్రాలను దానం చేయించారు.


అవయవదానంతో మరొకరికి ప్రాణదానం..

చండూరు మండలం బొడంగిపర్తి గ్రామానికి చెందిన నౌసు వెంకటయ్య(55) గత నెల 18న మునుగోడు మండలం చల్మెడ గ్రామ శివారులో ద్విచక్రవాహనంపై నుంచి అదుపుతప్పి కిందపడి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రోడ్డు ప్రమాదం వల్ల తమ నుంచి దూరమైన తండ్రి మరికొందరికి ప్రాణదాతగా నిలవాలనే ఉద్దేశ్యంతో గుండె, ఉపిరితిత్తులు, కార్నియా, కిడ్నీ, కాలేయం అవయవ భాగాలను కిమ్స్‌ ఆసుపత్రిలో దానం చేయించామని కుటుంబీకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని