logo

వసతి.. సమస్యలే గతి

ఉమ్మడి జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కొన్నిచోట్ల దుప్పట్లు అందలేదు. మరికొన్నిచోట్ల కిటికీలు సక్రమంగా లేవు. వెరసి చలి తీవ్రతకు వణుకుతూ నిద్రించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని వసతి గృహాల్లోని సమస్యలపై ‘న్యూస్‌టుడే’ కథనం....

Published : 05 Dec 2021 03:19 IST

ఉమ్మడి జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కొన్నిచోట్ల దుప్పట్లు అందలేదు. మరికొన్నిచోట్ల కిటికీలు సక్రమంగా లేవు. వెరసి చలి తీవ్రతకు వణుకుతూ నిద్రించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని వసతి గృహాల్లోని సమస్యలపై ‘న్యూస్‌టుడే’ కథనం.


శిథిలావస్థలో భవనం

చండూరులో శిథిలావస్థలో ఉన్న బీసీ  బాలుర వసతి గృహం

చండూరు, న్యూస్‌టుడే: చండూరులోని ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం శిథిలావస్థకు చేరింది. వర్షం నీళ్లు పై కప్పుతో పాటు గోడలలోకి దిగుతుండటంతో నిమ్ము చేరింది. రాత్రి వేళలో చలి బాగా ఉంటుంది. ఇందులో పాత విద్యార్థులు 32 మంది ఉండగా కొత్తగా 30 మందికిపైగా వచ్చారు. పాత వారికి దుప్పట్లు వచ్చాయి. కొత్తగా చేరిన వారికి ఇంకా సమయం పట్టనుంది. భవనంలో ఎక్కడిక్కడ ఇనుప సీకులు బయటికి తేలటంతో ఎపుడు కూలేది తెలియక విద్యార్థులు ప్రమాదకరంగా కాలం వెళ్లదీస్తున్నారు.    


ఎస్టీ వసతి గృహంలో పాడైన పరుపులు, మంచాలు

నేరేడుచర్ల ఎస్టీ వసతిగృహంలో పాడైన ఇనుప మంచాలు

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: నేరేడుచర్ల మూడు సంక్షేమ వసతి గృహాలు ఉండగా అన్నిట్లోనూ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఎస్టీ వసతి గృహంలో ఇనుప మంచాలు అందుబాటులో ఉంచారు. కానీ వాటిపై పరుపులు పాడైపోగా తిరిగి సరఫరా చేయలేదు. కొన్ని మంచాలు పాడైపోగా మరమ్మతులు చేపట్టలేదు. ఇరుకు గదుల్లో ఏర్పాటు చేసిన మంచాలు అంత సౌకర్యంగా లేకపోవడంతో విద్యార్థులు కింద పడుకోవడానికే ఆసక్తి చూపుతున్నారు. బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో మంచాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు కిందే పడుకుంటున్నారు. కొవిడ్‌ వల్ల వసతి గృహాలకు పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరు కావడం లేదు.


చలికి గజగజ

డిండి బాలికల బీసీ వసతిగృహంలో పెరిగిన పిచ్చి మొక్కలు

దేవరకొండ, న్యూస్‌టుడే: దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని డిండి బాలికల వసతిగృహంలో 112 మంది బాలికలు ఉండగా శుక్రవారం ‘న్యూస్‌టుడే’ సందర్శించినప్పుడు 70 మంది విద్యార్థినులు హాజరయ్యారు. వసతిగృహంలో పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు మొలిచాయి. వీటికితోడు పైభాగం పెచ్చులూడుతుండడంతో విద్యార్థినులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం చలికాలం కావడంతో దుప్పట్లు పంపిణీ చేయాల్సి ఉండగా, పనిఒత్తిడి ఉండడంతో పంపిణీ చేయలేకపోయామని మరునాడు తప్పనిసరిగా విద్యార్థినులకు అందజేస్తామని సంబంధిత వార్డెన్‌ సమాధానమిచ్చారు. వసతిగృహం పరిసర ప్రాంతాల నుంచి చలిగాలులు వీస్తుండడంతో గజ గజ వణుకుతూనే నిద్రిస్తున్నారు. మరోవైపు దేవరకొండ ఎస్సీ బాలుర వసతిగృహాన్ని గురువారం రాత్రి సందర్శించినప్పుడు అక్కడ వార్డెన్‌ అందుబాటులో లేకపోవడం, వాచ్‌మెన్‌ విధులు నిర్వహిస్తూ విద్యార్థులపైన తన ప్రతాపం చూపిస్తున్నారు. విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ పరుగులు పెట్టడం ‘న్యూస్‌టుడే’ కంటపడింది.


కొత్త దుప్పట్లు రాలే

హుజూర్‌నగర్‌: ఎస్సీ బాలుర వసతి గృహంలో దుప్పట్లు లేకుండా నిద్రపోయిన విద్యార్థులు

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ఈ సంవత్సరం దుప్పట్లు పంపిణీ కాలేదు. కరోనాతో  వసతి గృహాలు మూతపడే సమయానికి విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన దుప్పట్లు ఈ సంవత్సరం పంపిణీ చేసినట్లు వార్డెన్‌ రమేష్‌ తెలిపారు. వసతి గృహంలో 46 మంది ఉండగా సగం మందికి పాత దుప్పట్లు పంపిణీ చేశారు. అందులో కొందరికి పడుకునేందుకు వేసుకునే దుప్పట్లు పంపిణీ కాగా కప్పుకునేందుకు లేవు. పట్టణంలో బీసీ వసతి గృహంలో సగం మందికే దుప్పట్లు వచ్చాయి. ఎస్టీ వసతి గృహంలో మాత్రం అసలు దుప్పట్లు రాలేదు.


చలికి ఇబ్బందులు

బీసీ వసతి గృహంలో కిటీకిలకు తలుపులు లేక బయటి నుంచి అడ్డుగా కట్టిన దుప్పట్లు

కోదాడ పట్టణం, న్యూస్‌టుడే: కోదాడలోని బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో కొనసాగుతుంది. కిటీకీలు తలుపులు బిగించడం యాజమాని మరిచిపోయారు. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. చలికి తట్టుకోలేక కిటీకీలకు దుప్పట్లు, టవాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. వసతి గృహంలో 46 మంది విద్యార్థులు ఉండగా 40 మంది వసతి గృహంలో ఉన్నారు. ఈ విషయమై సంబంధిత వసతి గృహ అధికారిణి లతీమూన్‌ను వివరణ కోరగా యాజమానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు.

* గుడిబండ రోడ్‌లోని ఎస్సీ వసతి గృహంలో 9 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు దుప్పట్లు ఇవ్వకపోవడంతో చలితో ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మరుగుదొడ్లలో  నీటి సరఫరా లేదు. విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ మరుగుదొడ్లలోకి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై వసతి గృహ అధికారి నారాయణరెడ్డిని వివరణ కోరగా విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.


భువనగిరిలో ఇలా..

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా పరిధిలో 19 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు, ఆరు ఎస్టీ, 15 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. ఆయా వసతి గృహాల్లో 2054 మంది విద్యార్థులు ఉన్నారు. చలికాలం ప్రారంభంలోనే వసతి గృహాల కిటికీలకు రెక్కలు బిగించే చర్యలు చేపట్టారు. గుత్తేదారు ఇప్పటికే అత్యధిక వసతి గృహాల్లో కిటికీలు, దర్వాజలకు మరమ్మతులు పూర్తి చేశారు. మరికొన్ని వసతి గృహాల్లోని కిటికీలకు రెక్కలు బిగించే పనులు పురోగతిలో ఉన్నాయి. వసతి గృహాల్లోని విద్యార్థులకు ఒక్కొక్కరికి కింద పర్చుకొనే కార్పెట్‌తోపాటు చలికి కప్పుకొనే దుప్పటి పంపిణీ చేశారు. జిల్లా పరిధిలోని మూడు మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 1263 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటి వరకు వారికి దుప్పట్లు పంపిణీ చేయకపోవడం గమనార్హం. గతేడాది పంపిణీ చేసిన దుప్పట్లను ప్రస్తుతం విద్యార్థులు వినియోగించుకుంటుండటం గమనార్హం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని