logo

ఆరుతడి పంటలు శ్రేయస్కరం: కలెక్టర్‌

యాసంగిలో వరి సాగు చేయొద్దని కలెక్టరు పమేలా సత్పతి సూచించారు. రుస్తాపూర్‌లో సోమవారం రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. యాసంగి వరిని ఎఫ్‌సీఐ కొనుగోలు చేసే పరిస్థితులు

Published : 07 Dec 2021 03:29 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

తుర్కపల్లి, న్యూస్‌టుడే: యాసంగిలో వరి సాగు చేయొద్దని కలెక్టరు పమేలా సత్పతి సూచించారు. రుస్తాపూర్‌లో సోమవారం రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. యాసంగి వరిని ఎఫ్‌సీఐ కొనుగోలు చేసే పరిస్థితులు లేనందున వచ్చే సారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోమని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయటం రైతులకు ఎంతో శ్రేయస్కరమని ఆమె పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారిణి అనురాధ, ఎంపీపీ భూక్య సుశీల, మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్‌, సర్పంచి లావణ్య, ఎంపీటీసీ సభ్యుడు మోహన్‌బాబునాయక్‌, వ్యవసాయ అధికారి దుర్గేశ్వరీ, ఏఈవో దివ్య రైతులు పాల్గొన్నారు.

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: యాసంగి కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం మిగిలి ఉన్న లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. పుర కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యాన్ని అందరూ సమష్టిగా పని చేసి సాధించాలన్నారు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని తెలిపారు. ధాన్యం లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. జిల్లా పరిధిలో ధాన్యం కొనుగోలు జరుగుతున్న 37 మిల్లులకు ఒక్కో వీఆర్వోను నియమించామన్నారు. మిల్లు పాయింట్ల వద్ద ఎక్కువ రోజులు లారీలు ఉండకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మిల్లులు, కొనుగోలు కేంద్రాల వారితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. ధాన్యం నాణ్యతా ప్రమాణాల్లో వ్యత్యాసాలను గుర్తించాలన్నారు. ధాన్యం రవాణా చేస్తున్న లారీల వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో నమోదు చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి రోజు ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తమ కార్యాలయానికి పంపించాలని సూచించారు. ఈ సమీక్షలో ఆర్డీవోలు ఎమ్వీ భూపాల్‌రెడ్డి, సూరజ్‌కుమార్‌, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ గోపికృష్ణ, పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, పలు మండలాల తహసీల్దార్లు, వీఆర్వోలు, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు.

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని హన్మాపురంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆరుతడి పంటలు, పంట మార్పిడిపై రైతులకు సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వచ్చే యాసంగిలో భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) వరి ధాన్యాన్ని కొనుగోలు చేయదన్నారు. అనంతరం గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. జిల్లా, మండల వ్యవసాయ అధికారులు అనురాధ, వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఈవో మాధురి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని