logo
Updated : 07/12/2021 04:04 IST

మూడు గుంటలు.. రాబడి రూ.1.2 లక్షలు

బక్కమంతులగూడెంలో మూడు గుంటల భూమిలో దొండ పందిరి

మఠంపల్లి, న్యూస్‌టుడే: తక్కువ పెట్టుబడితో ఖాళీ స్థలంలో దొండ సాగు చేపట్టి నెలకు రూ.10 వేలు నికర ఆదాయాన్ని గడిస్తున్నారు మఠంపల్లి మండలం బక్కమంతులగూడేనికి చెందిన భోగాల కోటిరెడ్డి. ఏడాదంతా దిగుబడి వచ్చే దొండను 2017లో ఇంటి పక్కనే ఉన్న 3 గుంటల ఖాళీ స్థలంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టాడు. హుజూర్‌నగర్‌లోని ఓ రైతు వద్ద వీటి తీగలను తెచ్చి 8 పాదులు నాటి 200 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పున పందిరి వేశారు. 2 నెలలకే పూత, మూడో నెలలో కాయలు కాయడం మొదలైంది. నాలుగో నెల నుంచి ప్రతి మూడు రోజులకోసారి 30 నుంచి 35 కిలోలు దిగుబడి వస్తోంది. కిలో ధర సగటున రూ.30 నుంచి రూ.35 వరకు ఉండడంతో రూ.10వేలు క్రమం తప్పకుండా ఆదాయం వస్తోంది.
పెట్టుబడి ఇలా: రెండు నెలల కోసారి పాదులు తీసుకోవడం, ఆరు నెలలకు ఒక సారి ఎరువులు, పురుగు మందుల పిచికారి చేస్తారు. పెట్టుబడి ఏడాదంతా కలిపినా రూ.1,500 మించదని ఆయన చెప్పారు. నెలలో 10 రోజులు స్వయంగా పరిసర గ్రామాలకు వెళ్లి అమ్ముతానని ప్రతి సారీ రూ.వెయ్యి ఆదాయం వస్తోందన్నారు. ఏడాదికి రూ.1.20 లక్షలు వస్తాయని తన కుటుంబ పోషణకు ఈ ఆదాయం సరిపోతుందన్నారు. వేసవిలో పాదులు తిరగతోడి  పశువుల ఎరువులు వంటివి వేస్తానన్నారు. ఈ స్థలంలోనే మూడు నిమ్మ, మరో 3 మునగ చెట్లు నాటినట్లు పేర్కొన్నారు. దొండతో పాటు నిమ్మ, మునగ కాయలతో అదనంగా ఆదాయాన్ని గడిస్తున్నట్లు తెలిపారు.


బహుళ ప్రయోజనార్థం మల్చింగ్‌ విధానం

గుర్రంపోడు మండలం కొప్పోల్‌లో నిమ్మ సాగు

త్రిపురారం, న్యూస్‌టుడే: నీటిని ఆదా చేయడానికి ఆధునిక పద్ధతులను అవలంభిస్తున్నారు యువ రైతులు. పండ్ల తోటల్లో, కూరగాయల సాగులో మల్చింగ్‌ విధానం బహుళ ప్రయోజనకారిగా మారడంతో పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. త్రిపురారంలో 50 ఎకరాల్లో, నిడమనూరులో 20, మాడ్గులపల్లిలో 40, గుర్రంపోడులో 60 ఎకరాల్లో మల్చింగ్‌ విధానంలో వివిధ రకాల పంటలు సాగువుతున్నాయి.
పంటకో రకం.. మల్చింగ్‌లో 3 రకాల కవర్లుంటాయి. 25, 35, 100మి.మీ. మందంతో ఉంటాయి. తక్కువ మందం కవర్లు కూరగాయల సాగుకు, ఎక్కువ మందం కలిగిన వాటిని బత్తాయి తోటలకు ఉపయోగిస్తారు. వీటితో కలుపు నివారణ, తక్కువ నీటి ఉపయోగం, త్వరితగతిన మొక్కల ఎదుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి.

రాయితీపై అందించాలి
- గుండెబోయిన రాజు, కామారెడ్డిగూడెం, త్రిపురారం

నేను పుచ్చ సాగులో ఆరేళ్లుగా మల్చింగ్‌ విధానం ఉపయోగిస్తున్నాను. పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసే రైతులకు అవగాహన కల్పిస్తూ ఉద్యానవన శాఖ వారు రాయితీపై అందజేస్తే మరి కొంత మంది రైతులు ఈ తరహా సాగుకు ముందుకొస్తారు.  


ఒకసారి అమర్చితే మూడు పంటలకు ఉపయుక్తం
- రావుల లక్ష్మయ్య, గుంటిపల్లి, నిడమనూరు

కూరగాయల సాగులో ఒక సారి మల్చింగ్‌ కవర్‌ను ఉపయోగించి జాగ్రత్తగా చూసుకుంటే 3 పంటల వరకూ పనిచేస్తుంది. కూరగాయలూ నాణ్యంగా ఉంటాయి. రూ.15 వేలలోపు వ్యయం చేస్తే ఎకరానికి సరిపోయే కవర్‌ వస్తుంది. నీటి సమస్య ఉన్నచోట తప్పనిసరిగా ఉపయోగించాలి.


కాయకుళ్లు తెగులు నివారణ ఇలా..

మిరప పంటలో కొమ్మ ఎండుడు, కాయకుళ్లు తెగులు ఆశించి నష్టపరుస్తుంది. నివారణకు ఏం చేయాలి.

- చిన్నబాబు, అనాజిపురం, పెన్‌పహాడ్‌ మండలం

సమాధానం: పూత, కాత దశలో అజాక్సిస్ట్రోబిన్‌ 1 మి.లీ లేదా డైఫన్‌కొనజోల్‌ 0.5 మి.లీ లేదా ఫ్రొఫికొనజోల్‌ 1 మి.లీ లేదా కాబ్రిమెంటాఫ్‌ 3 గ్రాములు ఏదో ఒక మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకుంటే నివారణ సాధ్యం
మామిడితోటలో ఎర్రచీమల బెడద ఎక్కువగా ఉంది. నివారణ ఎలా?
- కోటేశ్వరరావు, కాపుగల్లు

సమాధానం: ఎర్రచీమలు గూళ్లు కట్టి కాయలు కోసే సమయంలో కుట్టి ఇబ్బందులు కలిగిస్తాయి. వీటివల్ల తోటలకు నష్టం ఉండదు. చీమల గూళ్లు ఉన్న కొమ్మలు కత్తిరించాలి. మొదళ్ల దగ్గర బీహెచ్‌సీ పౌడర్‌ చల్లాలి.

- గరిడేపల్లి, న్యూస్‌టుడే


అలసందకు అదను ఇదే..

గరిడేపల్లి, న్యూస్‌టుడే: యాసంగి ఆరుతడి పంటల్లో అలసంద సాగుకు ప్రస్తుతం అనుకూలమని కేవీకే మృత్తికా విభాగం శాస్త్రవేత్త ఎ.కిరణ్‌ సూచించారు. డిసెంబర్‌ 15 లోగా విత్తుకోవచ్చని తేలికపాటి, ఇసుకతో కూడిన బరువైన నేలలు, ఎర్రనేలలు, మురుగునీరు నిల్వ ఉండని ఒండ్రు మట్టినేలలు అనువైనమిగా వివరించారు. ఒక ఎకరంలో అలసంద ఒక్కటే సాగుచేస్తే 8-10 కిలోలు అంతరపంటగా కోసమైతే 4 కిలోలు విత్తనాలు అవసరం. సాళ్ల మధ్య 45 సెం.మీ మొక్కల మధ్య 20 సెం.మీ దూరం ఉండేలా చూసుకోవాలి. నాగలితోగాని గొర్రుతోగాని విత్తుకోవాలి. జీసీ-3రకం 85-90రోజుల్లో చేతికి వస్తుంది. 4 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వీ-2 రకం 95రోజుల పంటకాలం. 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కో-7రకం 80 రోజుల్లో కోతకు వస్తుంది. 5 క్వింటాళ్ల వరకు దిగుబడి ఆశించవచ్చు. టీపీటీసీ-29 రకం 85-90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దిగుబడి 6 క్వింటాళ్ల వరకు వస్తుంది. ప్రస్తుతం గిరాకీ ఉండి తక్కువ ఖర్చుతో సాగుచేయడానికి అనువైన ఆరుతడి పంట ఇది.


టమాటను జనవరిలో విత్తుకోవాలి

గరిడేపల్లి: టమాట పొడి వాతావరణంలో పండే పంట కావడంతో డిసెంబర్‌లో సాగు చేపట్టవద్దని కేవీకే ఉద్యాన విభాగ శాస్త్రవేత్త సిహెచ్‌.నరేష్‌ సూచించారు. 13 డిగ్రీల ఉష్ణోగ్రతలో విత్తనాలు బాగా మొలకెత్తడంతో పాటు ఎదుగుదల, కాయ చక్కగా ఉంటుంది. టమాటలో విటమిన్‌ సీ ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జనవరి-ఫిబ్రవరి నెలల్లో సాగుచేస్తేనే మంచి ఫలితాలుంటాయి. ప్రస్తుతం డిమాండ్‌ ఉందని సాగు చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశముంది.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని