logo

చెదరని చిత్రం

యువత నయా ట్రెండ్‌ సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. పది మందిలో ప్రత్యేకంగా కనిపించడానికి శాశ్వత, తాత్కాలిక టాటూలను  వేయించుకుంటున్నారు. పచ్చబొట్టంటే ఇనుప సూదులు..ఆకు పసర్లు వినియోగించే

Published : 07 Dec 2021 03:59 IST

పచ్చ బొట్టుపై యువత ఆసక్తి

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: యువత నయా ట్రెండ్‌ సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. పది మందిలో ప్రత్యేకంగా కనిపించడానికి శాశ్వత, తాత్కాలిక టాటూలను  వేయించుకుంటున్నారు. పచ్చబొట్టంటే ఇనుప సూదులు..ఆకు పసర్లు వినియోగించే విధానం పాత మాటైతే.. చర్మానికి ఇబ్బంది లేకుండా దాని స్వభావాన్ని బట్టి ఆధునిక పద్ధతిలో వేసేది కొత్త ట్రెండ్‌. తమకు నచ్చిన మెచ్చిన డిజైన్లు, పువ్వులు, పక్షులు, జంతువుల రూపాలతో పాటు జీవిత కాలంపాటు స్నేహితులు, ఆత్మీయులు, తల్లితండ్రులు గుర్తుండే విధంగా వారి పేర్లను పచ్చబొట్ల రూపంలో చిత్రాలను అచ్చు వేయించుకొని యువత ఆనంద పడుతున్నారు. సందర్శకులు ఎక్కువగా వచ్చే తిరునాళ్లు, జాతర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. నల్గొండలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలను వేదికగా చేసుకుని దుకాణాలు ఏర్పాటు ఊపందుకుంది.  బయట దుకాణాల్లో తాత్కాలిక పచ్చబొట్టు ధర కేవలం రూ. 100 నుంచి రూ.200 లోపు ఉండగా ఉర్సులో మాత్రం శాశ్వతపచ్చబొట్లకు డిజైన్‌ సైజును అనుసరించి రూ. 50 నుంచి రూ.250 వరకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం శాశ్వత టాటూలతోపాటు తాత్కాలికమైనవి అందుబాటులోకి వచ్చాయి.  ఇవి ఒకటీరెండ్రోజుల పాటు మాత్రమే ఉంటాయి. సబ్బుతో గట్టిగా కడిగేస్తే పోతాయి. వీటిపై యువత అధికంగా మక్కువ చూపిస్తున్నారు. శాశ్వత టాటూ వేయించుకోవాలనుకునేవారు ముందు తాత్కాలిక ముద్రను ప్రయత్నించి నచ్చితే శాశ్వతంగా పచ్చబొట్టు వేయించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే యువత ఎక్కువగా శాశ్వత పచ్చబొట్లను ఇష్టపడుతున్నారు. చేతులు, ఇతర శరీర భాగాలపై గాట్లు, ఇతర గాయాల తాలుక మచ్చలు కనిపించకుండా డిజైన్లతో పచ్చరంగుతో మాత్రమే కాకుండా నలుపు, పసుపు, ఎరుపు ఇలా విభిన్నమైన రంగులతో టాటూ వేయించుకుంటున్నారు. యువతులైతే  తల్లి,తండ్రి నచ్చిన స్నేహితుల పేర్లు, పువ్వులు, సీతకోక చిలుకలు వంటి చిత్రాలను ఎక్కువగా వేయించుకోవడానికి  ఇష్టపడుతున్నారు. యువకులు మాత్రం తల్లితండ్రుల పేర్లతో పాటు విభిన్నమైన కత్తులు, పుర్రెలు, మృగాలు, స్టార్‌ వంటి చిత్రాలను అచ్చు వేయించుకుంటున్నారు.


అభిరుచికి తగ్గట్టు 

-వెంకట్‌, టాటూ డిజైనర్‌
యువత అభిరుచికి తగ్గట్టు టాటూలు వేస్తున్నాం. వారు ఎక్కువగా టాటూస్‌ ట్రెండ్‌ అనుసరిస్తున్నారు. పచ్చబొట్టులో వాడే సిరా, సూదులు ఇతర పరికరాలు విదేశాల నుంచి తెప్పించాం. యువత ఎక్కువగా చేతులు, మెడ భాగాలపై టాటూలు వేయించుకుంటున్నారు. శరీర స్వభావాన్ని బట్టి దానికి ఏ సూదీ అయితే సరిపోతుందో పరీక్షించి దానినే ఎంచుకుంటున్నాం. నల్గొండ ప్రజలు ఎక్కువ ప్రేమాభిమానానికి సంబంధించిన చిత్రాలు, సినీ స్టార్స్‌, సీతాకోక చిలుక వంటి టాటూలపై మక్కువ చూపిస్తున్నారు.


అమ్మానాన్నపై ప్రేమతో..

-మహేశ్‌, నాగార్జున డిగ్రీ కళాశాల, నల్గొండ  
కనిపెంచిన తల్లితండ్రులపై ప్రేమ మసకబారకుండా ఎప్పుడు గుర్తుండేలా చేతిపై అమ్మానాన్న అంటూ టాటూ వేయించుకున్నా. నేను ఇంటి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లినా టాటూ చూస్తున్నంత సేపు తల్లిదండ్రులు నా వెంటే ఉన్నట్లు అనుభూతి కల్గుతోంది. అందుకే ప్రేమను పదిలంగా ఉంచుకోవడానికి టాటూ వేయించుకున్నా.


​​​​​​​పచ్చబొట్టుతో ఇబ్బంది లేదు
-డా. అనితారాణి, చర్మవ్యాధుల నిపుణురాలు

నల్గొండ అర్బన్‌: శరీరంపై పచ్చబొట్టు వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. చర్మం లోపలికి, చర్మం పైపైన పచ్చబొట్లు వేస్తుంటారు. చర్మం పైపైన వేసే వాటితో ఎలాంటి సమస్యలుండవు. చర్మం లోపలికి దిగేలా వేసే పచ్చబొట్టు కొందరికి వికటించే అవకాశాలుంటాయి. అలాంటి వారు వాటికి దూరంగా ఉండటం మంచింది. పచ్చ బొట్టు అనేది ఒక్కసారి శరీరంపై వేసుకోవడం ద్వారా తిరిగి తొలగించడం సులభం కాదు. తొలగించాలనుకుంటే లేజర్‌ శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇటీవల యువతలో పచ్చబొట్టు వేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని