logo

సర్కారు భూమి.. సమర్పయామి

కృష్ణపట్టి మండలాలు దామరచర్ల, అడవిదేవులపల్లిలో 24వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వీటిని కొందరు ఆక్రమిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 15 ఏళ్లుగా రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు జారీ చేయడంతో వాటిని అడ్డుపెట్టుకుని వేలాది ఎకరాల భూములను కొందరు సాగులోకి తెచ్చారు. కొంతమంది స్వాధీనంలో వందలాది ఎకరాలున్నాయి. గతంలో ప్రభుత్వ భూములకు మించి భూయాజమాన్య హక్కు పుస్తకాలు ఉండటంతో సమగ్ర భూసర్వే సమయంలో వీటిని పార్ట్‌-బీలో ఉంచారు. వీటిలో ప్రస్తుతం 22 వేల ఎకరాలు సాగులో ఉన్నాయని అధికారులు...

Published : 07 Dec 2021 03:59 IST

దామరచర్ల, న్యూస్‌టుడే: కృష్ణపట్టి మండలాలు దామరచర్ల, అడవిదేవులపల్లిలో 24వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వీటిని కొందరు ఆక్రమిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 15 ఏళ్లుగా రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు జారీ చేయడంతో వాటిని అడ్డుపెట్టుకుని వేలాది ఎకరాల భూములను కొందరు సాగులోకి తెచ్చారు. కొంతమంది స్వాధీనంలో వందలాది ఎకరాలున్నాయి. గతంలో ప్రభుత్వ భూములకు మించి భూయాజమాన్య హక్కు పుస్తకాలు ఉండటంతో సమగ్ర భూసర్వే సమయంలో వీటిని పార్ట్‌-బీలో ఉంచారు. వీటిలో ప్రస్తుతం 22 వేల ఎకరాలు సాగులో ఉన్నాయని అధికారులు గుర్తించారు. సమగ్ర భూసర్వే అనంతరం రెండేళ్ల క్రితం సుమారు 5 వేల ఎకరాల భూములను ధరణి పోర్టల్‌లో నమోదు చేసి సాగుదారులకు పాసుపుస్తకాలు ఇచ్చారు.

క్షేత్రస్థాయిలో విచారణ
ఆయా గ్రామాల్లో భూముల ఆక్రమణలపై అడవిదేవులపల్లి మండలానికి చెందిన కొందరి ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం ఆర్డీవో క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఉల్సాయిపాలెం, మొల్కచర్ల, బాలెంపల్లి, చిట్యాలలో ప్రభుత్వ భూములు పలువురి ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. మండల కేంద్రంలో సర్వే నంబరు 25లో అక్రమ కట్టడాల నిర్మాణదారులకు తాఖీదులు జారీ చేయాలని నిర్ణయించారు.

అక్రమ పట్టాల రద్దు
వాడపల్లి, ఇర్కిగూడెం, టీవీగూడెం, కొత్తపల్లి, ముదిమాణిక్యం రెవెన్యూ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో నాపరాయి క్వారీలు ఉన్నాయి. వీటిపై లీజు హక్కులు పొందినవారు పక్కనున్న వందల ఎకరాలను ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ధరణిలో నమోదు చేసి పట్టాపాసుపుస్తకాలు ఇచ్చినట్లు తేలడంతో గతేడాది కేశవాపురం వీఆర్వోపై అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములపై స్వాతంత్య్ర సమరయోధుల పేరిట పట్టాలు సృష్టించగా వాటినీ రద్దు చేశారు.


నోటీసులు జారీ చేస్తున్నాం
-బి.రోహిత్‌సింగ్‌, ఆర్డీవో, మిర్యాలగూడ

అడవిదేవులపల్లి మండలంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై అందిన ఫిర్యాదు ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపాం. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తున్నాం. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి నివేదించాం. తదుపరి ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటాం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని