logo
Updated : 07/12/2021 06:26 IST

నేరం-ఘోరం

నాలుగు వాహనాలు ఢీ.. నలుగురికి గాయాలు

చిట్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, జీఎంఆర్‌ సిబ్బంది వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తూ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఆ కారు ముందున్న మరో కారును, ఈ రెండు వాహనాలు పెద్దకాపర్తి శివారులో యూటర్న్‌ తీసుకుంటున్న ఓ లారీని ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, రెండు కార్లు, ఒక లారీ ధ్వంసమయ్యాయి. కార్లలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలవగా నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రలను మల్కాజ్‌గిరికి చెందిన గాండ్ల ప్రియాంక, మహేందర్‌, కర్నాటి వెంకటేశ్వర్లు, భవానిగా గుర్తించారు. ఈ ఘటనతో రెండు కి.మీ.మేర ట్రాఫిక్‌ స్తంభించింది. జీఎంఆర్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకొని ట్రాఫిక్‌ను నియంత్రించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ మారేశ్వర్‌రావుపై కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్సై నాగరాజు తెలిపారు.


 

రైలు కిందపడి యువకుడి బలవన్మరణం

భువనగిరి నేరవిభాగం: రైలు కిందపడి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన భువనగిరి హుస్నాబాద్‌ సమీపంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని కిసాన్‌ నగర్‌కు చెందిన భగత్‌ శేఖర్‌(35) వ్యాపారం చేస్తుంటారు. హుస్నాబాద్‌ సమీపంలో రైలు పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.


ఆవు చనిపోయిందని.. అప్పు తీర్చలేనని..

బొమ్మలరామారం, న్యూస్‌టుడే: ఆదాయమిస్తుందనుకున్న ఆవు అకస్మాత్తుగా మృతి చెందడంతో దాని యజమాని మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిన ఘటన హాజీపురంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హాజీపురానికి చెందిన కొలిపాక రమేశ్‌(50)కు మూడేళ్ల క్రితం రహదారి ప్రమాదంలో కాలు విరిగింది. ఇతర పనులు చేయలేని ఆయన అప్పు చేసి మరీ మూడు ఆవులు కొన్నారు. వాటి పాలు విక్రయించి రోజువారీగా ఆదాయం పొందుతున్నారు. ఇటీవల ఒక ఆవు మృతి చెందగా, అప్పు తీర్చే మార్గం లేక పశువుల పాకలోనే రమేశ్‌ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అతడి భార్య సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.


విద్యుదాఘాతంతో రైతు మృతి

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన నార్కట్‌పల్లి మండలంలోని ఏపీ.లింగోటంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన డెంకని యాదయ్య(58), వ్యవసాయ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం విద్యుత్తు నియంత్రిక వద్ద ఉన్న అతని మోటార్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి నాలుగురు కుమార్తెలు ఉన్నారు. యాదయ్య మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించి నివాళి అర్పించారు. భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.యాదయ్య తెలిపారు.


స్వాతంత్య్ర సమరయోధుడు కన్నుమూత

ఆత్మకూర్‌(ఎస్‌): ఇస్తాళాపురానికి చెందిన స్వాతంత్య్ర సమర యోధుడు గంధం రాములు(99) అనారోగ్యంతో సోమవారం మృతిచెందారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమంలో భీంరెడ్డి నర్సింహారెడ్డికి అనుచరుడిగా ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడున్నారు. మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.

 

 

 


భర్త వేధిస్తున్నాడని భార్య ఫిర్యాదు

వెలిదండ (గరిడేపల్లి): వెలిదండ గ్రామానికి చెందిన లక్కమళ్ల మాధురి.. తనను తన భర్త సురేష్‌, అత్త మెరిశమ్మ మానసికంగా వేధిస్తున్నారని సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ఏడాదిన్నర వయస్సు బాబుతో సహా తనను సోమవారం విచక్షణారహితంగా కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు గరిడేపల్లి ఎస్సై కొండల్‌రెడ్డి తెలిపారు.  ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


యువకుడు అదృశ్యం

పాలకవీడు గ్రామీణం: మండలంలోని బొత్తలపాలెం గ్రామానికి చెందిన నందిపాటి గోపి (22) ఈ నెల 3న కుటుంబ సభ్యులతో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాకపోవడంతో గోపి సోదరి జ్యోతి ఫిర్యాదు చేశారు. అదృశ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదులుగౌడ్‌ తెలిపారు.


ట్రాక్టర్‌ ఢీకొని బాలిక దుర్మరణం

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ట్రాక్టర్‌ ఢీకొని బాలిక మృతి చెందినట్లు వన్‌టౌన్‌ సీఐ బాలగోపాల్‌ తెలిపారు.  చిన్న చర్చి ప్రాంతంలో నివాసం ఉంటున్న కస్తాన భవాణి(9) సోమవారం మధ్యాహ్నం కిరాణ సముదాయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ట్రాక్టర్‌ ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు కావడంతో హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బాలిక తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని