logo

Crime News: దావత్‌కి పిలిచి..తల, మొండెం వేరు చేసి దారుణ హత్య

దావత్‌ చేసుకుందామని పిలిచి తలను, మొండాన్ని వేరు చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఏసీపీ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలం మద్దిపట్లకి చెందిన నామ శ్రీనివాస్‌(42) బొంగుళూర్‌ సమీపంలోని మెట్రో సిటీ కాలనీలో మూడేళ్లుగా నివాసం ఉంటున్నారు.

Updated : 24 Dec 2021 08:21 IST

నామ శ్రీనివాస్‌

ఆదిభట్ల, న్యూస్‌టుడే: దావత్‌ చేసుకుందామని పిలిచి తలను, మొండాన్ని వేరు చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఏసీపీ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలం మద్దిపట్లకి చెందిన నామ శ్రీనివాస్‌(42) బొంగుళూర్‌ సమీపంలోని మెట్రో సిటీ కాలనీలో మూడేళ్లుగా నివాసం ఉంటున్నారు. పదేళ్ల క్రితం ఇతని భార్య చనిపోయింది. 17 ఏళ్ల కుమారుడు గోపీకృష్ణ.. సొంతూరులో నాన్నమ్మ లక్ష్మమ్మ, తాత రామస్వామి దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 14న తన కుమారుడు శ్రీనివాస్‌ కనిపించడం లేదని రామస్వామి ఫిర్యాదుతో ఆదిభట్ల ఠాణాలో మిస్సింగ్‌ కేసు నమోదైంది. అదేరోజు ఎల్బీనగర్‌లో నివసించే బ్రహ్మచారి ఓ చీటింగ్‌ కేసులో సరూర్‌నగర్‌ ఠాణాలో లొంగిపోయాడు. పోలీసుల విచారణలో భాగంగా ఈ హత్యోదంతం వెలుగు చూసిందని ఏసీపీ ఈ మేరకు వెల్లడించారు. నామ శ్రీనివాస్‌, హాలియాకి చెందిన బ్రహ్మచారి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డ్యాన్సర్‌ నరేష్‌, ట్రాన్స్‌జెండర్‌ రాజమ్మ స్నేహితులు. గతంలో బ్రహ్మచారి ఓ కేసు విషయంలో ఎల్బీనగర్‌ పరిధిలో అరెస్టై జైలుకు వెళ్లాడు. తనకోసం బెయిల్‌ తీసుకోవాలని శ్రీనివాస్‌కు డబ్బులు ఇచ్చినా అతను పట్టించుకోలేదు. ఏడాదిపాటు జైల్లో ఉన్న బ్రహ్మచారి కక్షగట్టాడు. జైల్లోంచి వచ్చాక పథకం ప్రకారం నరేష్‌, రాజమ్మల సహకారంతో నవంబర్‌ 12న దావత్‌ చేసుకుందామని నామ శ్రీనివాస్‌ను పిలిచారు. కారులో నలుగురు కలిసి బొంగుళూర్‌ అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఇక్కడ శ్రీనివాస్‌ను క్లచ్‌ వైర్‌తో ఉరేసి చంపేశారు. తల భాగాన్ని వేరు చేసి మొండాన్ని అక్కడే పాతిపెట్టారు. తల భాగాన్ని ఏం చేశారన్నది బ్రహ్మచారిని విచారించినా తేలలేదన్నారు. పరారీలో ఉన్న నరేష్‌, రాజమ్మలు పట్టుబడితే నిజాలు వెలుగులోకి వస్తాయని ఏసీపీ తెలిపారు.

‘హత్య వెనక ఓ పోలీస్‌ అధికారి ఉన్నారు’.. నామ శ్రీనివాస్‌ హత్య వెనుక సస్పెండ్‌ అయిన ఓ పోలీస్‌ అధికారి ఉన్నారని మృతుడి తండ్రి రామస్వామి, కుమారుడు గోపీకృష్ణ ఆరోపించారు. శ్రీనివాస్‌ నాలుగేళ్లుగా ఆ పోలీస్‌ అధికారికి ఇన్ఫార్మర్‌గా ఉన్నాడని.. భూవివాదాలు, ఇతర కేసుల సెటిల్‌మెంట్లలో ఆయనకు శ్రీనివాస్‌ సహకరించేవాడని తెలిపారు. భూవివాదాలే హత్యకు కారణమై ఉండొవచ్చని అనుమానం వ్యక్త చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని