logo

ధాన్యలక్ష్మి పండాలి..సంక్రాంతులు విరియాలి

పంటలు ఇంటికి చేరిన సంతోషంలో జరుపుకొనే పండగ సంక్రాంతి.. ఆరుగాలం కష్టించిన రైతన్న అలసట తీర్చి.. నూతనోత్తేజం నింపే పర్వదినమిది.. ఈ వేడుకకు.. సాగుకు విడదీయని బంధముంది. వేకువజామున ఇళ్ల ముంగిళ్లల్లో కొలువుదీరే రంగురంగుల ముగ్గులు తప్పక ఉండాల్సింది..

Updated : 15 Jan 2022 04:36 IST

నల్గొండలో భోగి వేడుకల్లో పాల్గొన్న పట్టణవాసులు

చిట్యాల, న్యూస్‌టుడే: పంటలు ఇంటికి చేరిన సంతోషంలో జరుపుకొనే పండగ సంక్రాంతి.. ఆరుగాలం కష్టించిన రైతన్న అలసట తీర్చి.. నూతనోత్తేజం నింపే పర్వదినమిది.. ఈ వేడుకకు.. సాగుకు విడదీయని బంధముంది. వేకువజామున ఇళ్ల ముంగిళ్లల్లో కొలువుదీరే రంగురంగుల ముగ్గులు తప్పక ఉండాల్సింది.. గొబ్బెమ్మలు, నవ ధాన్యాలు. గతంలో సొంతంగా వివిధ పంటలు సాగు చేసే రైతుల ఇళ్లు నవధాన్యాలతో కళకళలాడేవి. నేడు వరి, వాణిజ్య పంటలు, కొన్ని అపరాల సాగే కనిపిస్తోంది. నాలుగు రకాల పంటలు పండిస్తే.. నాలుగు విధాలుగా లాభం వచ్చే అవకాశం ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నం జరగడం లేదు. ధాన్యం కొనుగోలు చేయమని సర్కారు చెబుతున్న వేళ.. నవధాన్యాలు పండిస్తే కలిసి వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రత్యామ్నాయ పంటల పేరిట ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.

గ్రహ పూజల్లోనూ..
నవగ్రహ పూజలు చేయించే సమయంలో కూడా నవధాన్యాలు వినియోగిస్తారు. ఒక్కో పంటను ఒక్కొక్క గ్రహానికి ప్రీతిపాత్రమైనవిగా భావించి, పూజ సమయంలో అర్పిస్తుంటారు. గోధుమలు-సూర్య గ్రహం, ధాన్యం-చంద్రగ్రహం, కందులు-కుజుడు, శనగలు-గురువు, పెసర్లు-బుధుడు, మినుములు- రాహువు, నువ్వులు-శని, ఉలవలు-కేతువు, బొబ్బర్లు-శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైనవిగా భావిస్తుంటారు.వీటిని సమర్పించి అర్చన చేస్తే నవగ్రహాలు తమకు మేలు చేస్తాయని నమ్ముతుంటారు.


ప్రత్యామ్నాయ సమయం వచ్చింది

రైతులను ప్రోత్సహించడానికి వారి పంట ఉత్పత్తులకు  ప్రభుత్వాలు కనీస మద్దతు ధర, పంటల సాగుకు రాయితీలు, ఇతరత్రా పనిముట్ల రూపంలో ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, మార్కెట్‌ డిమాండ్‌తోపాటు ప్రభుత్వ విధానాలను బట్టి కూడా రైతులు తమ పంటల సాగును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నాయి. పంట కాలంలో సాగు చేసే రకాన్ని మార్చకపోవడం వల్ల పంటవైవిధ్యం లోపించి దిగుబడులు తగ్గడం, చీడపీడల బెడద పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కట్టంగూరు మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.వరికి ప్రత్యామ్నాయంగా సాగుచేసే పంటల గురించి ఆయన ఇలా తెలియజేస్తున్నారు. వరి సాగుకే పరిమితం కాకుండా జిల్లాకు చెందిన పలువురు రైతులు ముందుచూపుతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నారు. కొందరు పూర్తిగా విక్రయం కోసమే సాగు చేస్తుంటే, మరికొందరు తమ కుటుంబ అవసరాలకు పోను మిగిలిన దిగుబడిని విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. పెసర, శెనగ, ఆవాలు, కుసుమ, పొద్దుతిరుగుడు, నువ్వులు, మినుములు, వేరుశనగ, జొన్న వంటి పంటలు పండించి ప్రత్యామ్నాయ బాట పట్టాల్సిన అవసరముంది.


ప్రకృతి సాగులో ఆరుతడి పంటలు
- నల్లాని నాగలక్ష్మి, రైతు గుండ్రాంపల్లి, చిట్యాల మండలం

3 ఎకరాల్లో మూడున్నరేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. విత్తనాలు కొనుగోలు చేయకుండా నా పొలంలో పంట నుంచే తయారు చేసుకుంటున్నా. ప్రస్తుతం కంది ఎకరం, మినుములు అర ఎకరంలో సాగు చేపట్టాను. వరిలో కూడా వివిధ రకాలు సాగు చేస్తున్నా. వీటితోపాటు ఉల్లి, పప్పు, మిరప, ఎల్లిగడ్డ, కంది ఇలా రకరకాలను  వేసి మా కుటుంబ అవసరాలు పోను మిగిలినది విక్రయిస్తున్నా. నేల బాగుంటే దిగుబడి బాగుంటుంది.


ఏటా సాగు చేస్తున్నా
- బండ రమేశ్‌రెడ్డి, రైతు, బొల్లేపల్లి, కట్టంగూరు మండలం

టా వరితోపాటు మినుములు, వేరుశనగ సాగు చేస్తున్నా. ప్రస్తుతం 2 ఎకరాల్లో మినుములు, 6 ఎకరాల్లో వేరుశనగ వేశా. పసుపు మినహా మిగిలిన అన్ని రకాల పంటలు సాగు చేశా. గ్రామంలో, లేదా నల్గొండ, నకిరేకల్‌ మార్కెట్‌లో విక్రయిస్తుంటాం. వేరుశనగపై ఎకరానికి ఖర్చులు పోను రూ.50 వేలు, మినుములపై రూ.40 వేలు గిట్టుబాటయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని