logo

ఆఖర్లో తెలుసుకుని..

తెలిసీ తెలియని వయసులో ప్రేమా పెళ్లి అంటూ జీవితాల్లో కష్టాలు కొనితెచ్చుకుంటున్న వారు జిల్లాలో పెరిగిపోతున్నారు. జీవితం అంటే ఏమిటో తెలియని పాఠశాల వయసులోనే ప్రేమ వైపు వెళ్తున్న బాల బాలికలు కొందరైతే.. బాలలకు మాయ మాటలు చెప్పి వారిని వెంట తిప్పుకొనేలా చేసుకుంటూ

Published : 17 Jan 2022 06:13 IST

● మూడేళ్లలో 262 మంది బాధితులు

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే

తెలిసీ తెలియని వయసులో ప్రేమా పెళ్లి అంటూ జీవితాల్లో కష్టాలు కొనితెచ్చుకుంటున్న వారు జిల్లాలో పెరిగిపోతున్నారు. జీవితం అంటే ఏమిటో తెలియని పాఠశాల వయసులోనే ప్రేమ వైపు వెళ్తున్న బాల బాలికలు కొందరైతే.. బాలలకు మాయ మాటలు చెప్పి వారిని వెంట తిప్పుకొనేలా చేసుకుంటూ పెళ్లివరకు తీసుకెళ్తున్న మాయగాళ్లు మరి కొందరుంటున్నారు. ఈ క్రమంలో తొంబై శాతం మంది తమ తప్పు తెలుసుకుని సఖీ కేంద్రం, సీడబ్ల్యూసీ, పెద్దల సమక్షం ద్వారా తల్లిదండ్రుల చెంతకు చేరుతున్నారు. మరి కొందరు ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కొవిడ్‌ కారణంగా పాఠశాల స్థాయి నుంచి ప్రతి విద్యార్థికి చరవాణి అందుబాటులోకి వచ్చింది. వాట్సప్‌, టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌, స్నాప్‌చాట్‌, ఫేస్‌బుక్‌ వంటి యాప్‌ల ద్వారా మొదట్లో పరిచయాలు పెంచుకుని ప్రేమ వరకు దారితీస్తోంది. జిల్లాలో బాలికల వివాహాలు, పెళ్లికి ముందు ప్రేమలో పడిన బాలబాలికల కౌన్సెలింగ్‌ కోసం ఆయా పోలీస్‌ స్టేషన్లతో పాటు సఖి కేంద్రం, భరోసా కేంద్రాలను సంప్రదించిన వారు గడిచిన మూడేళ్లలో 262 మంది బాధితులున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. లెక్కల్లోకి రానివారి సంఖ్య అధికంగానే ఉంటుంది.

● జిల్లా కేంద్రానికి చెందిన ఓ బాలికను రోజూ పాఠశాలకు ఆటోలో తీసుకెళ్లే యువకుడు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెళ్లివరకు తీసుకెళ్లాడు. గమనించిన తల్లిదండ్రులు యువకుడికి దేహశుద్ధి చేయడంతో పాటు బాలికకు స్థానిక మానసిక వైద్యుడి ద్వారా కౌన్సెలింగ్‌ ఇప్పించారు. ప్రస్తుతం చిన్నారి గతంలో మాదిరిగా పాఠశాలకు వెళ్తూ చదువుల్లో రాణిస్తోంది.

● దేవవరకొండ మండలంలో గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక చరవాణి స్నాప్‌డీల్‌ ద్వారా పరిచయం అయిన యువకుడితో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించారు. దీంతో మనస్థాపం చెందిన బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ఆరు నెలల క్రితం జరిగింది.

ఆకర్షణకు లోనై..

మిర్యాలగూడ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదే వీధిలో ఉండే బాలుడితో ప్రేమలో పడింది. వారం రోజుల పాటు ఇల్లు వదిలి వెళ్లిన వారిని పోలీసులు చరవాణి సహకారంతో పట్టుకున్నారు. తల్లిదండ్రులకు విషయం తెలియడంతో బాలిక కుటుంబాన్ని అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి మార్చారు. భరోసా కేంద్రంలో ఇచ్చిన కౌన్సెలింగ్‌ ద్వారా బాలిక తిరిగి కళాశాలలో చేరి చదువుల్లో రాణిస్తోంది.


అవగాహన కల్పిస్తున్నాం

- సుభద్ర, పీడీ ఐసీడీఎస్‌, నల్గొండ

జిల్లాలో ఇటీవల ప్రేమ వ్యవహారం బాలబాలికల్లో ఎక్కువగా కన్పిస్తోంది. 18 ఏళ్ల లోపు ప్రేమ వివాహం చేసుకునే వారిని గుర్తించి సఖి కేంద్రం ద్వారా కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. దీంతో పాటు మైనర్‌ బాల బాలికలకు సీడబ్ల్యూసీ ద్వారా కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాం. అలా వెళ్లని వారిని వసతి గృహంలో ఉంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కువ మంది చరవాణులు, ఫేస్‌బుక్‌ ద్వారా ఏర్పడిన పరిచయాలతో ప్రేమలోపడ్డట్లు చెపుతున్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే వ్యక్తిగత గుర్తింపు, ఇతరులపై ఆధారపడకుండా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమౌతుందని ప్రతి ఒక్కరికి సూచిస్తున్నాం. సఖీ కేంద్రంలో ఇబ్బందులు ఎదురైతే బాధితులు నేరుగా, చరవాణి ద్వారా ఫిర్యాదు చేయవచ్ఛు


తల్లిదండ్రులూ జాగ్రత్త వహించాలి

-డా. శివరామకృష్ణ, మానసిక వైద్యుడు, నల్గొండ

సినిమాలు సోషల్‌మీడియా, చరవాణి కారణంగా ఎక్కువ మంది విద్యార్థులు పెడదోవ పడుతున్నారు. చిన్న వయసులోనే ప్రేమా పెళ్లి అంటూ జీవితాలను ఇబ్బంది పాలు చేసుకుంటున్నారు. 13,14 ఏళ్లలోనే కొందరు ప్రేమ వల్ల నష్టపోయామని కౌన్సెలింగ్‌ కోసం తల్లిదండ్రులతో కలసి వస్తున్నవారు ఇటీవల ఎక్కువగా ఉంటున్నారు. చిన్నతనంలో సామాజిక కట్టుబాట్లపై అవగాహన కల్పించక పోతే వయసు పెరిగే కొద్ది ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 12 ఏళ్లు దాటిన బాల బాలికలున్న తల్లిందండ్రుల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులు ఉపయోగించే సెల్‌ఫోన్‌ ప్రతి రోజు గమనిస్తూ ఉండాలి. రాత్రిపూట బెడ్‌రూంలలో సెల్‌ఫోన్‌ ఉపయోగించకుండా చూసుకోవాలి. పాఠశాలల్లో ఏ వయసులో ఏం చేయాలి అనేదానిపై విద్యార్థుల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తే బాగుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని