logo

తేలికగా దాటొచ్చని.. దొరికిపోయారు

పోలీసుల కన్నుగప్పి గంజాయిను సరిహద్దు దాటించాలని ప్రయత్నించిన అంతర్రాష్ట్ర ముఠా ఆటలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. కొత్తూరు మండలం, తిమ్మాపూర్‌

Updated : 18 Jan 2022 02:41 IST

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు

రూ.69 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

పట్టుబడిన సరకుతో పోలీసు అధికారులు, సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌ కొత్తూరు, న్యూస్‌టుడే: పోలీసుల కన్నుగప్పి గంజాయిను సరిహద్దు దాటించాలని ప్రయత్నించిన అంతర్రాష్ట్ర ముఠా ఆటలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. కొత్తూరు మండలం, తిమ్మాపూర్‌ జాతీయరహదారిపై శంషాబాద్‌ ఎస్‌వోటీ, కొత్తూరు పోలీసులు సంయుక్త తనిఖీల్లో 214 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన బాబా సౌ చందేకర్‌(45), పుక్మలి తిరుమలి బాలు(39), గణేష్‌ నొలారి(39), రాజేంద్ర(45), సూర్యాపేట నివాసి మాలోత్‌ వినోద్‌(28)ను అరెస్ట్‌ చేశారు. ప్రధాన సరఫరాదారులు రవి, నాగరాజు, బాల్‌రాజ్‌, గణేష్‌, రాథోడ్‌ రవి పరారయ్యారు. సోమవారం షాద్‌నగర్‌ ఏసీపీ కుశల్కర్‌, ఇన్‌స్పెక్టర్లు వెంకటరెడ్డి, శ్రీధర్‌ భూపాల్‌తో కలిసి కొత్తూరు పోలీసుస్టేషన్‌లో శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ప్రధాన నిందితుడు బాబా సౌ చందేకర్‌, రాజేంద్రతో కలసి గంజాయి రవాణా సాగిస్తున్నారు. ఏపీ అటవీ ప్రాంతాల్లో కొనుగోలు చేసి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్నాడు. వీరికి వరంగల్‌కు చెందిన రవి వాహనాలు సమకూర్చుతూ సరకును సరిహద్దు దాటించేందుకు సహాయపడుతున్నాడు. మిగిలిన నిందితులు సరుకు రవాణాకు భద్రతగా ఉండేవారు. వారం రోజుల క్రితం 250 కిలోల గంజాయి కావాలంటూ చందేకర్‌, రాజేంద్రలు గణేశ్‌ అనే దళారిని సంప్రదించారు. రవి ఏపీలోని సీలేరు అటవీ ప్రాంతంలో కిలో రూ.3,000ల చొప్పున 214 కిలోలు కొనుగోలు చేశాడు. సీలేరు నుంచి భద్రాచలం సరుకు చేరవేసేందుకు ఇద్దరు సాయపడ్డారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ వరకూ మరో ఇద్దరు రక్షణగా వచ్చారు. సోమవారం తెల్లవారుజామున తిమ్మాపూర్‌ చేరుకున్నారు. గంజాయి పొట్లాలను ఒక కారు నుంచి మరో వాహనంలోకి మారుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి మూడు కార్లు, ఐదు సెల్‌ఫోన్లు, రూ.2.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సొత్తు విలువ రూ.69.90 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

తనిఖీలు లేని మార్గాల్లో..

టోల్‌గేట్లు, తనిఖీ కేంద్రాల వద్ద పోలీసులను తప్పించుకునేందుకు గ్రామాలు, పంట పొలాల మీదుగా ప్రయాణం కొనసాగించారు. సహాయకులు, వాహనాలను తరచూ మార్చుతూ వచ్చారు. చివరకు విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్‌ ఎస్‌వోటీ సీఐ వెంకట్‌రెడ్డి, కొత్తూరు సీఐ శ్రీధర్‌ భూపాల్‌ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు తిమ్మాపూర్‌ వద్ద పట్టుకున్నాయి. శంషాబాద్‌ ఎస్‌వోటీ, కొత్తూరు పోలీసులకు సైబరాబాద్‌ సీపీ స్టీఫెఫన్‌ రవీంద్ర రివార్డు ప్రకటించారని డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. గంజాయి సరఫరా వెనకున్న గొలుసుకట్టును త్వరలోనే చేధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు