logo

ఆర్టీసీ బస్‌డిపో కల నెరవేరేనా..?

భువనగిరిలో ఆర్టీసీ బస్‌ డిపో ఏర్పాటు చేయాలన్న ప్రజల కోరిక నెరవేరడంలేదు. జిల్లా కేంద్రం ఏర్పాటు తదుపరి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్నో ఏళ్ల కలయిన భువనగిరి డిపో ఏర్పాటును

Published : 18 Jan 2022 02:40 IST

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే

భువనగిరి బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

భువనగిరిలో ఆర్టీసీ బస్‌ డిపో ఏర్పాటు చేయాలన్న ప్రజల కోరిక నెరవేరడంలేదు. జిల్లా కేంద్రం ఏర్పాటు తదుపరి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్నో ఏళ్ల కలయిన భువనగిరి డిపో ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించకపోవడం గమనార్హం. భువనగిరి మీదుగా నిత్యం వందలాది బస్సులు ప్రయాణిస్తున్నప్పటికీ ప్రయాణికుల అవసరాలు తీరడంలేదు. ప్రతి బస్‌ నిండుగా రావడంతో పలు ప్రాంతాలకు ప్రయాణించాల్సిన వారు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైపాస్‌ నిర్మాణం తదుపరి అత్యధిక డిపోల బస్సులు భువనగిరి బస్టాండ్‌లోకి రాకుండానే నేరుగా బైపాస్‌ మీదుగా ప్రయాణిస్తున్నాయి. హైదరాబాదు నుంచి రాత్రి వేళల్లో భువనగిరికి ప్రయాణించే ప్రయాణికులను బస్‌ డ్రైవర్లు, కండక్టర్లు అనుమతించడంలేదు. దీంతో బస్‌ ప్రయాణమే నరక ప్రాయంగా మారింది. పెరుగుతున్న జనాభా, జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకొని భువనగిరి పట్టణంలో బస్‌ డిపో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశం రాజకీయంగా ముడిపడి ఉండటంతో ప్రస్తుత ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే తప్ప డిపో ఏర్పాటు అయ్యే పరిస్థితి లేదు.

ప్రత్యామ్నాయ ప్రయాణమే దిక్కు

జిల్లా పరిధిలో ప్రస్తుతం యాదగిరిగుట్ట డిపో ఉంది. ఈ డిపోకు సుమారు 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో నార్కట్‌పల్లి, జనగాం డిపోలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలోని 17 మండలాల్లో యాదగిరిగుట్ట డిపో సేవలు అందిస్తుంది. ఇది డిపో నిర్వాహకులకు తలకు మించిన భారంగా పరిణమించింది. హైదరాబాద్‌ పరిసరాల్లో సుమారు 30 బస్‌డిపోలు ఉన్నప్పటికీ నగర శివారులోని కొన్ని గ్రామాలకు ఆయా డిపోల బస్సులను అధికారులు తిప్పుతున్నారు. పరిధి పెద్దగా ఉండటంతో గుట్ట డిపో సేవలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ప్రజల డిమాండ్‌ మేరకు బస్సులు లేని కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను వెతుక్కోవాల్సి వస్తుంది. భువనగిరి పట్టణం కన్నా చిన్న మండలాలైన దుబ్బాక, ఊట్నూర్‌లో బస్‌ డిపోలను ఏర్పాటు చేయడం గమనార్హం. బస్‌ డిపో ఏర్పాటుతో జిల్లా ప్రజల కష్టాలు గట్టెక్కనున్నాయి. డిపో నుంచి ప్రారంభమయ్యే బస్సులలో ప్రయిణికులకు సీట్లు లభించే అవకాశం ఉంది. భువనగిరిలో ఆర్టీసీ డిపో ప్రతిపాదన లేదని యాదగిరిగుట్ట డిపో మేనేజర్‌ లక్ష్మారెడ్డి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని